‘పశ్చిమాసియా యుద్ధ ప్రభావం జిల్లాపై పడింది. నిత్యావసరంగా మారిన పెట్రోల్, డీజిల్‌కు కొరత ఏర్పడింది’ ..ఇలా సోషల్ మీడియాలో వదంతులు జోరందుకోవడంతో వాహనదారులు ఒక్కసారిగా ఆందోళన చెందారు. మంగళవారం రాత్రి నుంచే బంకులకు పోటెత్తారు. ఏ బంకు ముందు చూసినా పెద్ద సంఖ్యలో బారులు తీరుతూ.. పెట్రోల్, డీజిల్ కోసం గంటల తరబడి పడిగాపులు గాస్తున్నారు. అవసరం లేకున్నా వాహనాల్లో ట్యాంక్ ఫుల్ చేయించుకుంటున్నారు. ఈ క్రమంలో రెండు మూడు రోజులకు సరిపోయే నిల్వలు కొన్ని గంటల్లోనే అయిపోవడంతో అనేక బంకుల ముందు నో స్టాక్ బోర్డులు పెడుతున్నారు. ఇది చూసి మరో బంకుకు రయ్మంటున్నారు. అయితే అధికారులు మాత్రం ఇవన్నీ వదంతులేనని, కొరత అవాస్తవని కొట్టి పారేస్తున్నారు. జిల్లాకు అవసరమైన ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచిస్తున్నారు.
కరీంనగర్, మార్చి 25 (నమస్తే తెలంగాణ) : గ్యాస్, ఇంధన అవసరాలకు మన దేశం ఎక్కువగా గల్ఫ్ దేశాలపైనే ఆధారపడుతున్నది. అయితే పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా అక్కడి నుంచి ఇంధన నిల్వలు రాక పోవడంతో కొరత అనివార్యమవుతుందనే వదంతులు పుట్టాయి. ఈ నేపథ్యంలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పెట్రోల్, డీజిల్ దొరకదని భావించిన వాహనదారులు రెండు రోజులుగా బంకులకు క్యూ కడుతున్నారు. ఒక్కసారిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెట్రోల్ బంకులపై ప్రభావం పడుతుండగా.. మంగళవారం రాత్రి నుంచి ఏ బంకు ముందు చూసినా బారులు తీరుతున్నారు. బుధవారం కూడా ఇదే పరిస్థితి ఉండగా, ముఖ్యంగా కరీంనగర్ నగరంలో ఎక్కడ చూసినా పెద్ద సంఖ్యలో వాహనాలు కనిపించాయి. ద్విచక్ర వాహనాలు, కార్లు క్యూ కట్టాయి.
ఇటు హైవేలను ఆనుకొని ఉన్న బంకుల్లో భారీ వాహనాలు బారులు తీరాయి. ఒక్కసారిగా వాహనదారుల తాకిడి పెరగడంతో బంకుల నిర్వాహకులు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. సాధారణ రోజుల్లో ఒకట్రెండు లీటర్ల పెట్రోల్ పోయించుకునే వాహనదారులు ఇప్పుడు గంటల తరబడి బారులు తీరి ఫుల్ ట్యాంకులు చేయించుకుంటున్నారు. దీంతో వారం పది రోజుల వరకు సరిపడా నిల్వలు ఉన్న బంకుల్లో కూడా గంటల వ్యవధిలోనే స్టాక్ అయిపోవడం నో స్టాక్ బోర్డులు పెట్టేస్తున్నారు. బంకులోకి రాకుండా తాళ్లు కట్టి తాత్కాలికంగా మూసి వేస్తున్నారు. దీంతో నిల్వ ఉన్న బంకులపై మరింత భారం పడుతున్నది. డీజిల్ సమస్య కూడా ఇంచు మించు ఇలాగే ఉన్నది.

Karimnagar1
పలు బంకుల్లో నో స్టాక్ బోర్డులు
కరీంనగర్ జిల్లాలో సుమారు 150 బంకులు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. బుధవారం ఉదయం నుంచి నగరంలోని అనేక బంకుల వద్ద వాహనదారులు బారులు తీరారు. మధ్యా హ్నం ఎండను సైతం లెక్క చేయకుండా క్యూలో నిల్చున్నారు. కమాన్ చౌరస్తా, హౌసింగ్ బోర్డు కాలనీ, ఎన్టీఆర్ విగ్రహం, రాంపూర్‌తోపాటు సిరిసిల్ల బైపాస్ రోడ్డులో ఇటు రాజీవ్ రహదారిపై అటు జగిత్యాల, మంచిర్యాల మార్గంలో ఉన్న పలు బంకుల్లో మధ్యాహ్నం వరకే నిల్వలు అయిపోయాయని నిర్వాహకులు తెలిపారు. దీంతో నో స్టాక్ బోర్డులు పెట్టేశారు. ఈ బోర్డులు చూసిన వాహనదారులు ఎక్కడ బంకులు తెరిచి ఉంటే అక్కడికి క్యూ కట్టా రు. కొన్ని బంకుల్లో బారులు తీరిన వాహనదారులందరికీ పెట్రో ల్, డీజిల్ దొరకకపోవడంతో మరో చోటకు పరుగులు తీశారు.
నిల్వలు ఉన్నా.. ఇదేం పరిస్థితి..?
యుద్ధం కారణంగా మున్ముందు ఇంధన సమస్యలు ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ, ప్రస్తుతం సరిపడా నిల్వలు ఉన్నాయని పౌర సరఫరాల అధికారులు చెబుతున్నారు. వరంగల్, రామగుండంలోని ఆయిల్ డిపోల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు 60 రోజులకు మించి సరిపడా నిల్వలు ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు ఈ రెండు డిపోల నుంచే కాకుండా సూర్యాపేట, హైదరాబాద్ నుంచి సరఫరా అవుతుందని, ఇప్పట్లో ఇంధన సమస్యలు రాకపోవచ్చని చెబుతున్నారు.
అయితే రెండు రోజులుగా పలు పెట్రోల్ బంకులు మూత పడుతున్న విషయమై స్పందించిన అధికారులు, డీడీలు చెల్లించిన 24 గంటల్లో సంబంధిత బంకులకు సప్లయ్ చేస్తున్నామని స్పష్టం చేస్తున్నారు. నిజానికి ఇంధన కంపెనీలు గతంలో బంకులకు క్రెడిట్‌పై స్టాక్ సప్లయ్ చేస్తుండేవని, ముందు ఇంధనం సప్లయ్ చేసి తర్వాత వసూలు చేసుకునేవని, అయితే ప్రస్తుతం యుద్ధం నేపథ్యంలో కొన్ని కంపెనీలు క్రెడిల్ ఇవ్వలేమని స్పష్టం చేస్తున్నట్టు తెలుస్తున్నది. అంతే కాకుండా గతంలో ఉన్న బకాయిలు చెల్లిస్తేనే సప్లయ్ చేస్తామని చెబుతున్నట్టు సమాచారం కాగా, కొందరు బంకు నిర్వాహకులు చిక్కుల్లో పడుతున్నారు. నిల్వలు నిండుకున్న తర్వాత నో స్టాక్ బోర్డులు పెట్టేస్తున్నారు. బంకు యజమానులకు ఇది ఇప్పుడు పెద్ద సమస్యగా మారిందని వాపోతున్నారు.
కొరత లేదు.. వదంతులు నమ్మవద్దు
యుద్ధం నేపథ్యంలో ఇంధన కొరత ఏర్పడుతుందని వస్తున్న పుకార్లను నమ్మవద్దు. జిల్లాలోని అన్ని పెట్రోల్ బంకుల్లో పెట్రోలు, డీజిల్ నిల్వలు సరిపడా ఉన్నాయి. ఇంధన సరఫరా వ్యవస్థలు ఎప్పటిలాగే సక్రమంగా కొనసాగుతున్నాయి. ఎక్కడా ఎలాంటి కొరత లేదు. సోషల్ మీడియా లేదా ఇతర మాధ్యమాల్లో వచ్చే వదంతులను ప్రజలు పట్టించుకోవద్దు. కొరత ఏర్పడుతుందనే భయంతో అవసరానికి మించి ఇంధనం కొనుగోలు చేయవద్దు. ఇంధనం ఇండ్లల్లో నిల్వ చేయడం ప్రమాదకరం. ప్రజలు ప్రశాంతంగా ఉండాలి. ప్రభుత్వ యంత్రాంగం ఇచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మాలి. అత్యవసర పరిస్థితులు ఏమీ లేవు. ఈ విషయంలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.
– ఒక ప్రకటనలో కరీంనగర్ సీపీ గౌష్ ఆలం
వచ్చే 60 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయి
కరీంనగర్ జిల్లాలోని సుమారు 150 పెట్రోల్ బంకులకు వచ్చే 60 రోజులకు సరిపడా నిల్వలు ఒక్క రామగుండం, వరంగల్ ఆయిల్ డిపోల్లోనే ఉన్నాయి. అవసరం అనుకుంటే ఇతర ఆయిల్ డిపోల నుంచి కూడా జిల్లాకు అవసరమైన ఇంధన నిల్వలు తెప్పిస్తాం. స్టాక్ లేదని వస్తున్న వదంతులను నమ్మి ఇబ్బందులు పడద్దు. ఒక్కసారిగా వాహనదారుల తాకిడి పెరగడంతో రెండు మూడు రోజులకు సరిపడా నిల్వలు కూడా గంటల వ్యవధిలో నిండుకున్నాయి. నో స్టాక్ బోర్డులు తాత్కాలికమే. డీడీలు చెల్లించిన 24 గంటల్లో అవసరమైన ఇంధనం సప్లయ్ చేస్తున్నాం. ఎవరూ వదంతులు నమ్మకండి, ఇబ్బందులు పడకండి..
– నర్సింగారావు, కరీంనగర్ డీఎస్వో