బిగ్‌బాస్ ఫేమ్ డెమాన్ పవన్, రీతూచౌదరి కలిసి నటించిన ‘బంగారం’ ఆల్బమ్ సాంగ్ ఇటీవలే విడుదలైంది. ఈ పాటకు సోషల్‌మీడియాలో మంచి స్పందన లభిస్తున్నది. ఆకట్టుకునే నృతాలు, రొమాంటిక్ వైబ్‌తో మ్యూజిక్ ఛార్ట్స్‌లో ట్రెండ్ అవుతున్నది. ఈ పాటను అఫ్రోజ్ అలీ స్వరపరచడంతో పాటు సాహిత్యాన్ని అందించారు. సమీరా భరద్వాజ్‌తో కలిసి ఆయన ఈ గీతాన్ని ఆలపించారు. ‘బంగారం నీకోసం నేనుంటే నాకోసం నువ్వుంటే చాలు కదే..నా గుండెల్లో దాపెట్టుకొని కళ్లోపెట్టి చూసుకుంటా రాణివలే’ అంటూ రొమాంటిక్ ఫీల్‌తో ఈ పాట సాగింది. గురువారం జరిగిన సాంగ్లాంచ్ ఈవెంట్లో డెమాన్ మాట్లాడుతూ.. డీపీ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందించిన ఈ పాటకు అద్భుతమైన స్పందన లభిస్తున్నదని, భవిష్యత్తులో తమ సంస్థ వెబ్‌సిరీస్‌లు, సినిమాలు నిర్మించాలని ప్లాన్ చేస్తున్నదని తెలిపారు. ఈ పాటలో భాగం కావడం ఆనందంగా ఉందని రీతూ చౌదరి పేర్కొన్నది. ఈ కార్యక్రమంలో గాయని సమీర భరద్వాజ్, సంగీత దర్శకుడు రంజిత్ రెడ్డి, కొరియోగ్రాఫర్ విజ్జు ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.