వేమలవాడ రాజన్న ఆలయ పరిధిలో రోడ్డు విస్తరణ పనులపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాము విస్తరణకు వ్యతిరేకం కాదని, బహిరంగ మార్కెట్ విలువ ఆధారంగా తమకు పరిహారం చెల్లించి కూల్చివేయాలంటూ వ్యాపారులు చేసిన విన్నపాలు బుట్టదాఖలయ్యాయి. తహసీల్దార్ నుంచి పైస్థాయి అధికారులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులను కలిసి అర్థించినా చివరకు అధికారులు అనుకున్నదే చేయడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజానికి ఇంకా చాలా మంది పరిహారం తీసుకోకపోగా, కొంత మంది కోర్టును ఆశ్రయించారు. వీటిని పరిష్కరించకుండానే సోమవారం తెల్లవారు జామునుంచే పోలీసుల పహారా మధ్య కూల్చివేతలు సాగించడంతో బాధితులు ఆందోళనకు గురయ్యారు.
అది సోమవారం ఉదయం 6 గంటలు.. వేములవాడ మూలవాగు వంతెన నుంచి రాజన్న ఆలయానికి వెళ్లే ప్రధాన రహదారి.. దారిపొడవునా మోహరించిన పోలీసులు, ఇతర శాఖల అధికారులు, ఎక్స్కవేటర్లు.. కట్టుదిట్టమైన బందోబస్తు మధ్యన రోడ్డు విసర్తణ పనులు మొదలు కాగా, నిర్వాసితులు బిక్కుబిక్కుమన్నారు. దుకాణాలు, నివాసాలు ఖాళీ చేసేందుకు కొంత సమయం ఇవ్వాలని అర్థించినా వినకుండా కూల్చివేతలు ప్రారంభించడంతో సామగ్రిని పట్టుకొని రోడ్డు మీద వాహనాల కోసం పడిగాపులు గాశారు.
కరీంనగర్, జూన్ 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆంక్షలు.. పోలీస్ పహారా మధ్య వేములవాడ రాజన్న ఆలయ పరిధిలో రోడ్డు విస్తరణ పనులు మొదలయ్యాయి. మూల వాగు వంతెన నుంచి రాజన్న ఆలయం వరకు కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య సాగాయి. మున్సిపల్ కార్యాలయానికి సంబంధించిన మటన్ మారెట్ను ఆదివారం కూల్చివేసిన అధికారులు..
సోమవారం ఉదయం నుంచే నిర్వాసితుల నివాసాలు, దుకాణాలను కూల్చివేశారు. గుర్తించిన భవన, దుకాణం యజమానులు వారి వారి భవనాలను ఖాళీ చేయాలంటూ పదిహేను రోజుల క్రితం నోటీసులు జారీచేసి, గడువు ముగిసిన మరుసటి రోజు నుంచే రంగంలోకి దిగారు. ఉదయం 6 గంటలకే అధికారులు, పోలీసులు భారీగా మోహరించారు. మొత్తం 10 బృందాలతో పది ఎక్స్కవేటర్లు, వాహనాలతో అమరవీరుల స్తూపం నుంచి మొదలుకొని ఆలయం వరకు కూల్చివేతలను ప్రారంభించారు. ఒకో తహసీల్దార్‌కు ఒకో ప్రాంతానికి ఇన్చార్జిగా అప్పగించి కూల్చివేసే కార్యక్రమాన్ని పర్యవేక్షించే బాధ్యతలు అప్పగించారు.
దుకాణాలు ఖాళీ చేసేందుకు కొంత సమయం కావాలని వ్యాపారులు వేడుకున్నా ఎలాంటి గడువు ఇవ్వకుండా కూల్చివేశారు. గంట సమయం మాత్రమే ఇస్తామని, ఈలోగా ఖాళీ చేసుకుంటే తామే వాహనాన్ని సమకూర్చుతామని చెబుతూనే.. తమ మాట వినకపోతే దుకాణాలను ఖాళీ చేస్తామని హెచ్చరించారు. ఇదిలా కొనసాగుతుండగానే.. ఒకసారిగా కూల్చివేతలు ప్రారంభం కావడంతో దుకాణాలు, నివాసాలను నిర్వాసితులు బికుబికుమంటూ సర్దుకుంటూ ఖాళీ చేయాల్సి వచ్చింది. మరోవైపు వస్తువులన్నీ ఎకడికకడ రోడ్డు మీద పెట్టుకొని వాహనాల కోసం పడిగాపులు పడాల్సిన దుస్థితి ఏర్పడింది.
ప్రధాన రహదారి విస్తరణ పూర్తిగా పోలీస్‌మయంగా మారింది. అదనపు ఎస్పీ చంద్రయ్య పర్యవేక్షణలో అమరవీరుల స్తూపం నుంచి రాజన్న ఆలయం వరకు దాదాపు 200 మంది పోలీసులను మోహరించారు. ఎకడికకడ పోలీసులతోపాటు అగ్నిమాపక సిబ్బంది, రెవెన్యూ, మున్సిపల్, వైద్య ఆరోగ్య సిబ్బందిని కూడా విధి నిర్వహణలో ఉంచారు. వేములవాడ పట్టణంలోని ప్రధాన రహదారిలో జరిగిన కూల్చివేతలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, వేములవాడ ఇన్చార్జి ఆర్డీవో రాధాబాయి, మున్సిపల్ కమిషనర్ వారు పరిశీలించారు. జరుగుతున్న పనులను ఆయన పరిశీలించి తగు సూచనలు చేశారు.
విమలక్క ఇల్లు నేలమట్టం
ఐదు దశాబ్దాల పాటు ఈ ప్రాంతంలో దున్నేవాడికే భూమి దకాలని పోరాటం చేసిన జనశక్తి కేంద్ర కమిటీ కార్యదర్శి కూర రాజన్న, రాష్ట్ర కార్యదర్శి దేవేందర్ అలియాస్ అమర్, అరుణోదయ సాంస్కృతిక అధ్యక్షురాలు విమలకకు చెందిన నివాసాలు రోడ్డు విస్తరణలో నేలమట్టమయ్యాయి. వీరు ఉద్యమ బాట పట్టినప్పటికీ రాజన్న తల్లి కూర మల్లమ్మ 2019లో మృతి చెందే వరకు ఇదే ఇంట్లో ఉంది. ప్రస్తుతానికి ఆ నివాసాన్ని పకన ఉన్న బంధువులు వినియోగించుకుంటున్నారు. రహదారి విస్తరణలో వీరి నివాసం మొత్తం నేలమట్టమైంది. పరిహారం అందకుండానే వీరి నివాసం నేల మట్టం కావడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం విమలక్కతో పాటు ఇతరులు కూల్చివేసిన ఇంటి వద్దకు వచ్చే అవకాశమున్నట్టు సమాచారం.
అందని పరిహారం ?
80 అడుగుల రోడ్డు విస్తరణ చేయాలని నిర్ణయించిన అధికారులు, ఆ మేరకు 243 మంది నిర్వాసితులకు నోటీసులు ఇచ్చారు. అందులో కొంత మందికి మాత్రమే పరిహారం అందగా.. మెజార్టీ బాధితులు తమకు బహిరంగ మార్కెట్ ప్రకారం పరిహారం ఇవ్వాలని కోరుతూ వస్తున్నారు. ఇదే విషయాన్ని రాతపూర్వకంగా అధికారులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు ఇచ్చారు. ఏళ్ల తరబడిగా వ్యాపారం చేసుకొని జీవిస్తున్నామని, ఒక్కసారిగా తమ భవనాలు కూల్చివేస్తే తాము రోడ్డున పడుతామని, అందుకే తమకు పరిహారం ఎక్కువ ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేస్తూ వచ్చారు. తాము విస్తరణకు ఏమాత్రం వ్యతిరేకం కాదని చెప్పారు. అయినా, అధికారుల నుంచి సరైన స్పందన లేకపోవడంతో దాదాపు 88 మంది హైకోర్టును ఆశ్రయించినట్టు తెలుస్తున్నది.