EX MLA Sunke Ravishankar | గంగాధర, ఏప్రిల్ 25 : చొప్పదండి నియోజకవర్గం లో ప్రభుత్వం తూతూ మంత్రంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిందని, కేంద్రాల వద్ద ధాన్యం కొనే దిక్కే లేదని, అన్నదాతపై ప్రభుత్వం కక్ష సాధిస్తుందని మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గట్టుభూత్కూర్ లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు శనివారం స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ప్రభుత్వంతో మంత్రంగా ధాన్యం కొనుగోలు తూతూ మంత్రంగా సాగుతోందని, రైతుల కోసం కనీస వసతులు కూడా ఏర్పాటు చేయలేదని దుయపడ్డారు.
నెలరోజులుగా రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు పడుతున్నారని, కొనుగోళ్ళు సకాలంలో జరగడం లేదని ప్రసంతృప్తిని వ్యక్తం చేశారు. అన్నదాతపై ప్రభుత్వం కక్ష గట్టినట్లు వ్యవహరిస్తున్నదని ఆరోపించారు.పంటలకు సాగు నీరు ఇవ్వకుండా లక్షల ఎకరాలను ఎండబెట్టిన ప్రభుత్వం, చేతికి వచ్చిన కొద్దిపాటి పంటలను కూడా కొనకుండా నిర్లక్ష్యం చేస్తూ రైతుల పొట్ట కొట్టడానికి ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చొప్పదండి నియోజకవర్గంలో ధాన్యం కొనుగోళ్లు కేంద్రాల ప్రారంభాలతోనే సరి పెట్టారని, మిల్లర్లు అలాట్మెంట్ కాలేదని, కొనుగోళ్లు కాంటా వేసేది లేదు, వడ్లు కొనేది లేదన్నారు.
సన్నాలకు సున్నాలు చుట్టారని,సకాలంలో వడ్లు కొనుగోలు చేయకపోవడంతో రైతులు మిల్లర్లు, దళారుల తక్కువ ధరకు అమ్ముకుంటున్నారని పేర్కొన్నారు. మద్దతు ధర దేవుడెరుగు,ఒక్క గింజ ధాన్యం కొనుగోలు చేయలేదన్నారు. బిఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లక్షల ఎకరాలకు నీరందించి భూమికి బరువయ్యే పంట పండించినా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దానిని కొనుగోలు జరిగిందని, వారం రోజులోపు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశామని గుర్తు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు కంకణాల విజేందర్ రెడ్డి, వేముల దామోదర్, నాయకులు మామిడిపల్లి అఖిల్, బొడ్డు మల్లేశం తదితరులు పాల్గొన్నారు.