Dharmapuri | ధర్మపురి, నవంబర్20: జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తిమ్మాపూర్ – మద్దునూర్ గండి గుట్ట పై గుప్తనిధుల కోసం జరుగుతున్న అనుమానాస్పద బ్లాస్టింగులు తిమ్మాపూర్, రాయపట్నం, మద్దునూర్ గ్రామాల్లో కలకలం రేపుతున్నాయి. వారం రోజుల క్రితం బీర్పూర్ మండలం కండ్లపల్లి గ్రామంలో గుప్తనిధుల కోసం గొయ్యి తవ్వే క్రమంలో వెలుతురు కోసం ఏర్పాటు చేసుకున్న విద్యుత్ తీగ తగలి విద్యుత్ షాక్ తో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మరువక ముందే.. ధర్మపురి మండలం తిమ్మాపూర్ గుట్టపై గుప్తనిధుల కోసం చేస్తున్న బాస్టింగులు గ్రామ ప్రజల్లో భయమాందోళనలు కలిగిస్తున్నాయి.
ధర్మపురి మండలం తిమ్మాపూర్, మద్దునూర్ గ్రామాల మధ్యలో లింగం చెరువు గుట్ట ఉంది. ఈ గుట్టపై ఓ గుమ్మి(కుండమాదరి) దానిపై మూత ఆకారంలో ఓ బండ రూపాంతరం చెంది ఉంది. దీనిని ఈ ప్రాంత ప్రజలు ‘ధనం గుండు’ అని పిలుస్తుంటారు. అయితే ఈ గుట్టపై ఉన్న ధనంగుండులో గుప్తనిధులు ఉన్నాయని ఇక్కడ చాలాకాలంగా ప్రచారంలో ఉంది. పూర్వం రాజ నిధులను ఈ ప్రదేశంలో మంత్ర, యంత్ర పూజా సమేతంగా నిక్షిప్తం చేసి ఉంచారని కొందరు చెబుతుంటే.. మరి కొందరు పూర్వం గజదొంగలు ఊర్లపై పడి దోచుకున్న సొమ్మును గుట్టపై దాచి ఉండవచ్చనే కథలు ఇక్కడ వాడుకలో ఉన్నాయి.
అయితే ఇదంతా వట్టి బూటకమని బండరాయి ఆకారం అలా ఉండడం వల్ల జనాలు గుప్తనిధులు అంటూ భ్రమ పడుతూ ప్రచారం చేస్తున్నారనీ అంటున్నారు. ఈ ధనంగుండను బద్దలు కొట్టే ప్రయత్నాలు చాలా జరిగాయనీ, చివరగా 20ఏళ్ల క్రితం ఈ గుట్టపై ధనం గుండును బద్దలు కొట్టే ప్రయత్నంలో ఒరకు మృతి చెందినట్లుగా కూడా గ్రామంలో చెప్పుకుంటారు. మళ్లీ ఇప్పుడు రెండు రోజులుగా ఇక్కడ తవ్వకాులు జరుగుతున్నట్లుగా గ్రామస్తులు గుర్తించారు. రెండు రోజులుగా రాత్రి సమయాల్లో దాదాపు 10 నుండి 15 మంది కా కార్లల్లో కొంత సమయం తీసుకుంటూ ఒకరి వెనుక ఒకరు ఈ ప్రాంతానికి వచ్చి వీరు దిగగానే కార్లు వెళ్లిపోతున్నాయనీ, వీరంతా గుట్టపైకి వెలుతున్నారనీ పశువుల కాపరులు, రైతులు, యువకులు చెబుతున్నారు.
ఇటీవల ఏపీ మారేడుపల్లి వద్ద జరిగిన ఎన్ కౌంటర్ నేపథ్యంలో గుట్టపైన ఉన్నది మావోయిసులా..? లేక దొంగలా..? అనే అనుమానాలతో కూడా మరోవైపు కలిగి భయాందోళనలకు గురయ్యామని. గ్రామస్తులు చెప్పారు. కానీ గురువారం ఉదయం ధనం గుండు పైకప్పు మూత మాదరిగా ఉండే కొంతభాగం దెబ్బతిన్నట్లుగా పశువుల కాపరులకు కనబడటంతో బుధవారం రోజున అమావాస్య సందర్భంగా బుధవారం అర్ధరాత్రి సమయంలో గుప్తనిధుల కోసం గుప్తనిధి వేటగాళ్లు క్షుద్రపూజలు జరిపి ధనం గుండును బద్దలు కొట్టే ప్రయత్నం చేసి ఉంటారని గ్రామస్తులు భావిస్తున్నారు. పురావస్తు శాఖ నిపుణులతో ఇక్కడ పరిశీలనలు జరిపి నిజానిజాలు తేల్చాలని గ్రామస్తులు కోరుతున్నారు.