Boiled rice mill | పెద్దపల్లి, మే 22(నమస్తే తెలంగాణ): పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ పక్కనే కంపు కొడుతున్నది. పక్కన ఉన్న పారాబాయిల్డ్ రైస్ మిల్లులు వదిలే వ్యర్థాలతో దుర్వాసన వీస్తున్నది. జిల్లా ఉన్నతాధికారులు నిత్యం అదే రోడ్డు పక్క నుంచి ప్రయాణిస్తున్న ఆ దుర్వాసన వైపు మాత్రం కన్నెత్తి కూడా చూడటం లేదు. దీంతో పక్కనే ఉన్న బృందావన్ కాలనీ వాసులు రైస్ మిల్లులు వెదజల్లుతున్న వ్యర్థాలతో నిత్యం అనారోగ్యాల బారిన పడి ఆర్థికంగా చితికిపోతున్నారు. దీనికి తోడు పెద్దపల్లి-కరీంనగర్ ప్రధాన రహదారికి పక్కనే రైస్ మిల్లుల నుంచి వచ్చే వ్యర్థమైన దుర్వాసనతో కూడిన నీటిని రోడ్డు పక్కకే వదులుతుండటంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ప్రజలకు దుర్వాసనను దూరం చేయాలని ప్రజలు కోరుతున్నారు.
రైస్ మిల్లుల వ్యర్థాలతోనే దుర్వాసన..
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌కు అతి సమీపంలోనే అనేక సంవత్సరాలుగా పారాబాయిల్డ్ రైస్ మిల్లులు ఉన్నాయి. ఇవి కలెక్టరేట్‌కు, బృందావన్ కాలనీకి మధ్య ఉన్నాయి. వీటిలో రాధాకృష్ణ ఇండస్ట్రీస్, మాధవీ ఇండస్ట్రీస్, హరిహర ఇండస్ట్రీస్, అన్నపూర్ణ ఇండస్ట్రీస్ నుంచి వ్యర్థమైన నీరు రోడ్డు పక్కన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డ్రైనేజీలోకి, ఒక చిన్న కుంటలోకి వదులుతున్నారు. ఈ కలుషితమైన నీటి కారణంగా బృందావన్ కాలనీతో పాటుగా పెద్దపల్లి-కరీంనగర్ ప్రధాన రహదారిపై నుంచి వెళ్లే ప్రయాణీకులు నిత్యం దుర్వాసనను పీలుస్తున్నారు. ఈ దుర్వాసన వల్ల ప్రజలు నిత్యం నరకయాతనను అనుభవిస్తున్నారు.
కాలనీలో ఉండలేకపోతున్నాం.. సంతోష్, అడ్వకేట్, బృందావన్‌కాలనీ, పెద్దపల్లి
రైస్ మిల్లులు వదిలే వ్యర్థమైన నీటి వల్ల ముక్కు మూసుకొనే ఉండాల్సి వస్తున్నది. చిన్నగా గాలి వీసినా ఇండ్లల్లో ఉండలేక పోతున్నాం. ఈ దుర్వాసనతో మా బృందావన్కాలనీలోనే ఉండలేకపోతున్నాం. కాలనీలో ప్రజలు నిత్యం అనారోగ్యాల పాలవుతున్నారు. ఇప్పటికే మున్సిపల్ అధికారులకు చెప్పినప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. కలెక్టరేట్‌కు పక్కనే ఇలాంటి కంపు కొడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. జిల్లా కలెక్టర్ ఈ విషయంలో చొరవ చూపి మాకు దుర్వాసనను దూరం చేయించాలి. మమ్మల్ని ఆదుకోవాలి.