మెట్పల్లి, ఆగస్టు 17 : మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ పరిధిలోని గోదాంల్లో నిల్వ చేసిన సరుకులకు భద్రత కరువైంది. మార్కెట్ యార్డు ఆవరణలో 5 వేల మెట్రిక్ టన్నుల గోదాంలు రెండు ఉండగా, మార్కెట్ నిధులతో 2014కు ముందు నిర్మించిన మరో 2 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాంలు ఉన్నవి. 5 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన రెండో గోదాంలో ఒకటి ఖాళీగా ఉండగా, మరో దాంట్లో మూడు కంపార్ట్ మెంట్లకు గానూ రెండు కంపార్ట్ మెంట్లలో పీడీసీ బియ్యం నిల్వ చేశారు. 2 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల రెండు గోదాంల్లో ఒకటి వినియోగానికి అనువుగా లేకపోవడంతో మరొక దానిలో పౌరసరఫరాల సంస్థకు సంబంధించి 9 లక్షలకు పైగా గన్నీ సంచులు నిల్వ చేశారు. సరిగ్గా గన్నీ సంచులు ఉన్న 2 వేల మెట్రిక్ టన్నుల గోదాంకే నిప్పు అంటుకున్న విషయం తెలిసిందే. గన్నీ సంచులు కాలిపోవడంతో సుమారు రూ. 97 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు అంచనా వేశారు. అలాగే, గన్నీ సంచులకు అంటుకున్న మంటలు చెలరేగడంతో గోదాం రేకులు, గోడలు దెబ్బతిన్నాయి.
ఈ గిడ్డంగి ధ్వంసం కావడంతో సుమారు రూ. 70 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు మార్కెట్ అధికారులు అంచనా వేశారు. ఈ రెండు విభాగాల అధికారులు జరిగిన నష్టం వివరాలతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా, ఈనెల 10న ఉదయం గోదాంలో మంటలు అంటుకున్న విషయం బయటకు రావడంతో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది, రెవెన్యూ, పోలీస్ అధికారులు, సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు ఆర్పేందుకు తమ ప్రయత్నాలను చేపట్టారు. మంటలు పూర్తిగా అదుపులోకి రావడానికి నాలుగు రోజులు పట్టింది. కాగా, గోదాంలో అగ్గి రాజేసుకోవడం అనేది మిస్టరీగా మారింది. గోదాంల్లో సరుకులు నిల్వ ఉన్నప్పుడు సరైనా భద్రత చర్యలు చేపట్టాల్సిన బాధ్యత మార్కెటింగ్ శాఖ అధికారులపై ఉంటుంది. కానీ, వారి నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మార్కెట్ యార్డు చివరలో ఓ కాలనీని ఆనుకొని నిర్మించిన ప్రహరీ సమీపంలో ఒకే ప్రాంతంలో నాలుగు గోదాంలు ఉన్నవి. రాత్రింబవళ్లు గోదాంల వద్ద వాచ్మెన్లు, సీసీ కెమెరాల ఏర్పాటుతో నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. గోదాంలకు వెళ్లే రహదారిలో, గోదాంల మధ్య విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసి విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలి. కానీ, అవేమి ఇక్కడ లేకపోవడంతో రాత్రియే కాదు పగలు సైతం ఆకతాయిలు, మందు బాబులు, పేకాట, నక్కిమూట జూదరులు గోదాల ప్లాట్‌ఫాంపై, గోదాం నడుమ అంతర్గత సీసీ రోడ్లపై తిష్టవేసి తమ అసాంఘిక కార్యకలాపాలను సాగిస్తున్నారనే ప్రచారం జరుగుతున్నది. గిడ్డంగిలో విద్యుత్ సౌకర్యం లేదు.
విద్యుత్‌కు సంబంధించి ఎలాంటి నెట్వర్క్ అక్కడ లేకపోవడంతో షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశమే లేదు. ఈ క్రమంలోనే పాత గన్నీ సంచులు నిల్వ ఉన్న గోదాంకు దుండగులు ఎవరో కావాలనే నిప్పు పెట్టి ఉండవచ్చనే అనుమానాలకు బలం చేకూరస్తుంది. మరో వైపు మార్కెట్ కమిటీలో వాచ్మెన్ల కొరత పీడిస్తున్నది. ఉన్న కొద్ది మంది ఔట్సోర్సింగ్ పద్ధతిలో పని చేస్తున్న సెక్యూరిటీ గార్డ్స్‌ను కార్యాలయం, ఇతరాత్ర పనులకు వినియోగిస్తుండడం వల్ల గోదాంల భద్రతపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేని దుస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది. ఎక్కడో అడవి ప్రాంతంలో విసిరిపడేసినట్లు గోదాంలు ఉండడం, వాటి చుట్టూ ఏపుగా పెరిగిన చెట్లు, పిచ్చిమొక్కలు, ముళ్లపొదలు ఉండడంతో అటుపై రాత్రిపూట వెళ్లలేని పరిస్థితి. గోదాంలో నిల్వ చేసిన సరుకులను దొంగలు లూటీ చేసే అవకాశం కూడా లేకపోలేదు. కనీసం గోదాం వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లయితే అటువైపు వేరే వ్యక్తులు ఎవరైనా వస్తే గుర్తుపట్టే అవకాశం ఉంటుంది. సంబంధిత అధికారులు స్పందించి గోదాంల వద్ద పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.