పల్లెల్లోని చెరువుల్లో నల్ల మట్టి తోడేళ్లు పడ్డాయి. పగలూ రాత్రి అనే తేడా లేకుండా మరీ తవ్వేస్తున్నాయి. ఇటుక బట్టీల అవసరాలకు ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని ఆసరాగా చేసుకొని కోట్ల విలువ చేసే మట్టిని తెగ తోడేస్తున్నాయి. ‘అనుమతి గోరంత.. తోడేది కొండంత’ అన్న చందంగా వ్యవహరిస్తూ నిత్యం నలభై నుంచి యాభై టిప్పర్లలో పరిమితికి మించి తరలించుకుపోతున్నాయి.
కాల్వశ్రీరాంపూర్, ఓదెల మండలాల్లోని మూడు గ్రామాల్లో మట్టి తవ్వకాలు జరుగుతుండగా, టిప్పర్లు కిలోమీటరు పొడవునా ఒకదాని వెనుక మరోటి ‘రయ్.. రయ్’మంటూ వెళ్తుండడంతో ప్రజలు భయపడుతున్నారు. అతివేగం, ఓవర్‌లోడ్ కారణంగా రోడ్లు దెబ్బతినడమే కాదు ఇటీవల పలువురు ప్రమాదాల బారిన పడిన ఘటనలు చోటుచేసుకోవడంతో ఆగ్రహిస్తున్నారు. రోడ్డెక్కి వాహనాలను అడ్డుకుంటున్నా, అధికారులు పట్టించుకోకపోవడంపై మండిపడుతున్నారు.
ఓదెల/ కాల్వశ్రీరాంపూర్: జూన్ 5: పెద్దపల్లి జిల్లాలో అత్యధికంగా ఇటుక బట్టీలు విస్తరించి ఉండడంతో నల్ల మట్టికి భారీ డిమాండ్ ఉంటుంది. ఏటా వేసవిలో చెరువులు ఎండిన వెంటనే పలువురు బట్టీల వ్యాపారులు అనుమతులు తీసుకొని మట్టిని తరలించుకుంటారు. ఆయా చెరువుల నుంచి కేటాయించిన వరకే మట్టి తీసుకెళ్లాల్సి ఉంటుంది. అయితే అనుమతి తీసుకున్నామనే పేరుతో ఓదెల, కాల్వశ్రీరాంపూర్ మండలాల్లోని పలు గ్రామాల్లోని చెరువుల నుంచి పగలు, రాత్రి అనే తేడా లేకుండా నిబంధనలకు విరుద్ధంగా లోతుగా తవ్వుతూ, పరిమితికి మించి తోడుకెళ్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
టిప్పర్ల కెపాసిటీకి మించి తరలింపు
కాల్వశ్రీరాంపూర్ మండలం పందిల్ల, ఓదెల మండలం కొలనూర్, ఇందుర్తి గ్రామాల్లోని చెరువుల్లో మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. ఇక్కడి నుంచి మట్టిని లారీలు, టిప్పర్లలో పెద్దపల్లి, సుల్తానాబాద్‌లోని ఇటుక బట్టీలకు తరలిస్తున్నారు. అయితే మట్టిని టిప్పర్లలో కెపాసిటీకి మించి తరలిస్తుండడంతో గ్రామీణ ప్రాంత రోడ్లన్నీ దెబ్బతింటున్నాయి. కిలోమీటర్ పొడవునా లారీలు ఒకదాని వెనుక మరొకటి వెళ్తుండడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.
ఇదిలా ఉండగా, లారీలు అతివేగంగా వెళ్తుండడంతో ప్రజలు భయపడుతున్నారు. ఇటీవల పెగడపల్లి గ్రామంలో లారీ ఢీకొని రైతు పత్తి రాజేందర్‌రెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో ఓదెల మండలం కొలనూర్, పొత్కపల్లి, ఇందుర్తి, కాల్వశ్రీరాంపూర్ మండలం పందిల్ల, పెగడపల్లిలో ప్రజలు విసిగివేసారి, ఇటీవల రోడ్డెక్కి లారీలను అడ్డుకుంటున్నారు. పోలీసుల జోక్యంతో తమ గొంతు నొక్కుతున్నారని ఆరోపిస్తున్నారు. ప్రజల నుంచి ఇంత వ్యతిరేకత వ్యక్తమవుతున్నా ప్రజాప్రతినిధులు, జిల్లా అధికార యంత్రాంగం తమకేమి పట్టనట్లు ఉండడంపై ఆగ్రహిస్తున్నారు.