రోహిణీకార్తె ముందే తొలకరి పలుకరించింది.. దీంతో నైరుతి రుతుపవనాలు ఆశాజనకంగా ఉన్నాయనే ఆశతో రైతాంగం సాగుకు సన్నద్ధమైంది.. కానీ, ముందస్తుగా దుక్కులు దున్ని పత్తి విత్తనాలు వేసిన.. నార్లు పోసిన కర్షకుల పరిస్థితి దారుణంగా తయారైంది. పదిహేను రోజుల నుంచి వానల జాడ లేక రైతులు ఆకాశం వైపు చూస్తున్నారు. నాటిన పత్తి విత్తనాల్లో కొందరివి మొలకెత్తి చిగురించగా, మరికొందరివి మొలకెత్తకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. వేలాది రూపాయలు ఖర్చు చేసిసాగు చేస్తే విత్తనాలు మొలకెత్తలేవని, కాస్తోకూస్తో మొలిచినవి గాలి, ఎండ తీవ్రతతో వాడిపోతున్నాయని దిగాలు చెందుతున్నారు. పోసిన నార్లు ముదిరిపోతున్నాయని వాపోతున్నారు. సకాలంలో వానలు పడకపోతే తాము నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు.
హుజూరాబాద్ రూరల్ జూన్ 22 :వానకాలం ఎంత త్వరగా విత్తనాలు వేస్తే అంత మంచిదని.. చీడపీడలు, ప్రకృతి వైపరీత్యాల బారినపడకుండా పంట చేతికి వస్తుందని రైతుల నమ్మకం! అయితే మేలో వర్షాలు పడడంతో రైతుల్లో సంబురపడ్డారు. ఈ నెల మొదటి నుంచి అంటే.. పదిహేను రోజుల క్రితం నుంచే దుక్కులు దున్ని సాగు ప్రారంభించారు. పత్తి విత్తనాలు వేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేలాది ఎకరాల్లో విత్తనాలు నాటిన రైతులు, ఇప్పటికే విత్తనాలు, దుక్కిదున్నినవి, కూలీల ఖర్చులు కలిపి దాదాపు ఎకరానికి సుమారు 12వేల వరకు పెట్టారు. ఇప్పుడు వరుణుడి జాడ కోసం ఎదురు చూస్తున్నారు. మొలకెత్తిన విత్తనాలను కాపాడుకోలేక తండ్లాతున్నారు. నీళ్లు లేక మొలక భూమిలోనే ఎండిపోతుండగా కంటతడి పెడుతున్నారు. విత్తనాలు మొలకెత్తని చోట మరోసారి నాటాల్సి వస్తుందని చెబుతున్నారు. బోర్లు, బావులు ఉన్న చోట కొందరు విత్తనాలకు నీరు అందిస్తున్నప్పటికీ, ఆ సౌకర్యం లేని చోట వర్షం కోసం పడిగాపులు కాస్తున్నారు. ఇటు రోహిణి కార్తెలోనే కొందరు అన్నదాతలు నార్లు పోశారు.
నార్లు ఏపుగా పెరిగినా నాట్లేసేందుకు నీళ్లు లేక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వారంలోనైనా పడకపోతే పెట్టుబడి కూడా నష్టపోతామని వాపోతున్నారు. సొంత భూముల్లో విత్తనాలు వేసిన రైతుల పరిస్థితి ఇలా ఉంటే, కౌలు తీసుకున్న రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉందని చెబుతున్నారు. అయితే కొందరు ఇప్పటి వరకు ఇంకా సాగు మొదలు పెట్టలేదు. వానలు ఎప్పుడొస్తాయా.. అని ఎదురుచూస్తున్నారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి ఎన్నడూ రాలేదని రైతులు గుర్తు చేస్తున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభించిన తర్వాత ప్రాజెక్టులను, చెరువులను ముందుగానే నింపిందని, దాంతో నీళ్లకు ఇబ్బంది ఉండేది రాలేదని చెబుతున్నారు. కాలం కలిసి రాకున్నా మొగులుకేసి చూసి పరిస్థితి ఉండేది కాదని, పొలాలకు పుష్కలంగా నీళ్లు వచ్చాయని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదని వాపోతున్నారు. రాజకీయాలు పక్కన పెట్టి మేడిగడ్డ వద్ద పిల్లర్‌ను బాగు చేసుంటే ఇవాళ పరిస్థితి వేరేలా ఉండేదని అభిప్రాయ పడుతున్నారు. కరువు పరిస్థితుల్లో ఆ ప్రాజెక్టును వాడుకునే పరిస్థితి ఉండేదని, వర్షాలు పడినప్పుడు గోదావరితో ప్రాజెక్టులను నింపుకొనే వీలుండేదని చెబుతున్నారు.
నాకున్న నాలుగెకరాలతోపాటు మరో ఎనిమిదెకరాలు కౌలుకు తీసుకుని పత్తి విత్తనాలు పెట్టిన. తొలకరించి పలుకరించి పదిహేను దాటినా వాన పడడంలేదు. రోజు ఉరుముతున్నది గానీ వానలు పడ్తలేవు. వారం కింద పెట్టిన పత్తి విత్తనాలు మాడిపోతాయేమోనని నాలుగెకరాలల్ల స్ప్రింక్లర్ల సాయంతో నీటిని అందిస్తున్న. మిగతా ఎనిమిదెకరాల్లో పెట్టిన విత్తనాలు మొలకెత్తలేదు. మొదట్ల విత్తనాలు పెట్టి అన్నివిధాలా నష్టపోయిన.
గత నెలలో వర్షాలు పడినయి. దాంతో ముందస్తుగా విత్తనాలు పెట్టిన. నాకున్న ఏడెకరాలతోపాటు మరో నాలుగెకరాలు కౌలుకు తీసుకుని సాగు చేసిన. విత్తనాలు పెట్టినప్పటి సంది ఇప్పటి వరకు వానలు పడ్తలేవు. కొన్ని విత్తనాలు మొలువగా, మరికొన్ని మొలువలేదు. విత్తనాల రేటు, పెట్టుబడి భారీగా పెరిగింది. వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోయే దుస్థితి ఉన్నది.
జిల్లాలో ఈ వానకాలం సీజన్ ప్రారంభమై 15రోజులు గడిచింది. ఆదిలో వర్షం కురిసి మళ్లీ జాడకుండా పోయింది. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జూలై నెల చివరి వరకు కూడా పత్తి విత్తనాలు పెట్టవచ్చు. రైతులు తొందరపడకుండా వ్యవసాయ విస్తరణాధికారుల సూచనలు పాటించాలి.