నిరుపేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో వసతులు కరువయ్యాయి. పట్టించుకునే వారు లేకపోవడంతో సమస్యలు తిష్టవేశాయి. ‘నమస్తే తెలంగాణ’ సందర్శనలో వసతులు లేక విద్యార్థులు పడుతున్న అవస్థలు బయటపడ్డాయి. ఇందులో తిమ్మాపూర్ మండలం రామకృష్ణకాలనీలోని మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల ఒకటి. మానకొండూర్ నియోజకవర్గంలోని గన్నేరువరం మండలానికి మంజూరైన ఈ పాఠశాలకు అక్కడ వసతి లేని కారణంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏమైనా వసతులు ఉన్నాయా? అంటే అవీ లేదు. రేకుల షెడ్డు, చెట్ల కింద పాఠాలు, మూత్రశాలలు లేని వసతి గృహం, దుర్గందంతో నిండిన పరిసరాలు.. ఇలా నిత్యం ఇవే సమస్యలపై విద్యార్థులు కుస్తీ పట్టాల్సి వస్తోంది. ఇక్కడి సమస్యల గురించి విద్యార్థులను అడిగితే చాలుపోమ్మని చెప్పేస్తున్నారంటే వారు నిత్యం అనుభవిస్తున్న నరకం ఎలాంటిదో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు.
– కరీంనగర్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ)/ తిమ్మాపూర్
తిమ్మాపూర్ మండలం రామకృష్ణకాలనీలోని మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో అలా అడుగు పెట్టామో లేదో.. ముక్కు పుటాలు ఎగిరి పోయే దుర్గందం. ఏమిటిదని విద్యార్థులను అడిగితే డ్రైనేజీ వాసనని చెప్పారు. సుమారు 420 మంది విద్యార్థులున్న ఈ పాఠశాలకు సరైన డ్రైనేజీ సదుపాయం లేదు. విద్యార్థులు వాడిన వ్యర్థపు నీరు వసతి గృహం వెలుపలకు వెళ్లే మార్గం లేక అక్కడే డ్రైనేజీలోనే మురిగి మురిగి కంపు వెదజల్లుతోంది. ఈ దుర్గంధం తీవ్రస్థాయిలో ఉన్నా విద్యార్థులు సర్దుకుపోతున్నారు.
డ్రైనేజీని తరగతి గదుల పక్క నుంచే నిర్మించి పైన కప్పు వేశారు. అందులోంచి మురుగు నీరు లీకవుతూ దుర్గందాన్ని వెదజల్లుతోంది. ఈ దుర్గందంలోనే విద్యార్థుల తరగతులు కొనసాగుతున్నాయి.. ఆఖరికి భోజనాలు కూడా ఇదే దుర్గందంలో చేయాల్సిన దుస్థితి. వసతి గృహాన్ని కూడా చుట్టేసిన ఈ దుర్గంధంలోనే విద్యార్థులు నిద్రపోతున్నారు. వాసన పడక కొందరు వాంతులు చేసుకుంటున్నామని విద్యార్థులు వాపోతున్నారు. అనుక్షణం ఈ దుర్గంధంలో గడుపుతున్న చిన్నారుల ఆరోగ్యం ఎలా ఉంటుందో ప్రభుత్వ పెద్దలు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది.
రేకుల షెడ్ల కిందనే తరగతులు
ఈ గురుకుల పాఠశాలలో 420 మంది విద్యార్థులు ఉన్నారు. ఐదు నుంచి పదో తరగతి వరకు రెండేసి సెక్షన్లు ఉన్నాయి. తరగతుల నిర్వహణకు రేకుల షెడ్లు వేశారు. చిన్న ఎండ కొట్టినా రేకులు వేడెక్కి వీటి కింద ఉన్న విద్యార్థులపై ప్రభావం చూపుతోంది. ఫ్యాన్లు తిరుగుతున్నా వేడిని తట్టుకోలేక పోతున్నామని విద్యార్థులు వాపోతున్నారు. తరగతి గదులు ఈ విధంగా ఉంటే చదువులు ఎలా ముందుకు సాగుతాయని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.
దీనికి తోడు తరగతి గదుల పక్క నుంచే దుర్గందం వెదజల్లే డ్రైనేజీ ఉండడంతో ఇటు వాసన, అటు ఉక్కపోతతో విద్యార్థుల చదువులు ముందుకు సాగడం లేదు. తరగతి గదులకు కనీసం వెంటిలేషన్స్ కూడా సరిగ్గా లేక పోవడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. పక్కనే కమర్షియల్ షాపింగ్స్ ఉన్నాయి. అక్కడ ఎవరైనా సిగరేట్లు, బీడీలు తాగితే క్లాస్ రూంలకు పొగ వాసన కూడా వస్తోందని విద్యార్థులు వాపోతున్నారు. ఈ కారణంగా పాఠశాల ఆరుబయట ఉన్న చెట్ల కింద తరగతులు నిర్వహిస్తున్నారు.
మూత్రం వస్తే అంతే సంగతులు..
వసతి గృహంలో మూత్ర శాలల సదుపాయం లేదని విద్యార్థులు వాపోతున్నారు. కొన్ని ఉన్నా వాటిని మూసేశారని, మూడంతస్తుల్లో ఉన్న ఈ భవనానికి రాత్రి 9 గంటలకు తాళం వేస్తారని, రాత్రి వేళ మూత్రం వస్తే కిందికి దిగే అవకాశం ఉండదని ఆవేదన చెందుతున్నారు. ఉదయం 5.30 గంటలకు తాళం తెరిచిన తర్వాతనే విద్యార్థులు కింద ఉన్న మూత్ర శాలలలకు వెళ్లాలి. కింద ఉన్న మూత్ర శాలలు కూడా సౌకర్యవంతంగా లేవు. కొన్నింటిలోనే నీటి సదుపాయం ఉంది. మిగతా వాటిలో మూత్రానికి, మరుగుదొడ్డికి వెళ్లాలన్నా పిల్లలే బకెట్లతో నీటిని తీసుకెళ్లాలి. విద్యార్థులు భోజనానికి ముందు, తర్వాత చేతులు కడుక్కోవడానికి ట్యాప్స్లేవు. ఒకేసారి నల్లాలు విడిస్తే కడుక్కోవాలి. ముందుగా వెళ్లిన స్నానం చేసిన వారికే నీళ్లు అందుతున్నాయని విద్యార్థులు వాపోతున్నారు.
అందుబాటులో లేని ఆట స్థలం
ఈ పాఠశాలలో కనీసం ఆట స్థలం కూడా లే దు. వసతి గృహం పక్కన ఉన్న రియల్ఎస్టేట్ చేసిన ప్లాట్లలో విద్యార్థులు ఆడుకుంటున్నారు. అయితే, ఈ స్థలం యజ మాని కూడా ఇటీవల తనకు రెంట్ చెల్లించాలని నోటీసు ఇచ్చినట్లు తెలిసింది. ఇందులో ఇండ్లు నిర్మించుకుంటే ఈ స్థలం కూడా విద్యార్థులకు దక్కకుండా పోతుంది.
ఐదు నెలలుగా రాని బిల్లులలు
గురుకుల పాఠశాలలకు 2016లో పెంచిన మెనూ బిల్లులే ఇప్పటికీ నడిపిస్తున్నారు. ఈ సమయంలో ఐదు నుంచి ఏడో తరగతి విద్యార్థులకు నెలకు రూ.950, 8వ తరగతి నుంచి 10 వరకు చదివే విద్యార్థులకు రూ.1,1 00, ఇంటర్ విద్యార్థులకు రూ.1,500 చొప్పున చెల్లిస్తున్నారు. అయితే, ఇప్పుడు కూరగాయలు, గుడ్లు, అరటి పండ్లు, చికెన్, మటన్ ధరలు విపరీతంగా పెరిగాయి.
అవే ధరలతో వీటిని అందించడం సాధ్యం కావడం లేద ని ఆయా ఏజెన్సీల నిర్వాహకులు వాపోతున్నారు. ప్రభు త్వం నుంచి వచ్చే బిల్లులకు తగినట్లుగా మెనూను రూ పొందించుకోవల్సి వస్తోందని అంటున్నారు. ప్రతి రోజూ ఇచ్చే అరటి పండ్లు, గుడ్లు దినం విడిచి దినం ఇవ్వాల్సి వస్తోందని చెబుతున్నారు. పప్పులు, చారు, ఇతర కూరలు కూడా మునుపటిలా ఉండడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. అయితే, గత మార్చి నుంచి ఈ బిల్లులు కూడా రాకపోవడంతో తమపై భారం పడుతోందని మరో పక్క ఏజెన్సీల నిర్వాహకులు వాపోతున్నారు.
అపరిశుభ్రంగా పరిసరాలు
గురుకుల పాఠశాల చుట్టూ పిచ్చి మొక్కలు, గడ్డి పెరిగి అపరిశుభ్రంగా తయారైంది. కనీసం గ్రామ పంచాయతీ నుంచి కూడా గడ్డి మందు కొట్టే పరిస్థితి కనిపించడం లేదు. చెత్తా చెదారం ఉండడంతో విపరీతమైన దోమలు వ్యాపిస్తున్నాయని విద్యార్థులు వాపోతున్నారు. చాలా మందికి జ్వరాలు కూడా వచ్చాయని చెబుతున్నారు. అంతే కాకుండా వసతి గృహంలో బెడ్స్ సరిపోక ఒకే బెడ్‌పై ఇద్దరిద్దరం పడుకుంటున్నామని చెబుతున్నారు..
హాస్టల్లో బాత్రుంలు లేవు
హాస్టల్లో బాత్రుంలు లేవు. ఉన్న వాటిని సీజ్ చేశారు. కొన్నింటికి అటాచ్ బాత్ రూంలు ఉన్నాయి. వాటికి తలుపులు లేవు. నీళ్లు రావు. రాత్రి 9 గంటలకు కింద తాళం వేస్తారు. పై నుంచి కిందికి రానీయరు. మూత్రం వస్తే పొద్దున 5.30 గంటలకు తాళం తీసిన తర్వాతనే బాత్రూమ్కు వెళ్లాలి. మూత్రం ఆపుకుంటే కొందరికి కడుపు నొప్పులు వచ్చాయి.
– ప్రేమ్ రక్షిత్, విద్యార్థి
జారి పడితే దెబ్బ తాకింది..
హాస్టల్లోని డార్మెంట్లో డ్రైనేజీ పైపులు లీకవుతున్నాయి. చూసుకోకుండా తడిపై కాలు వేస్తే పడిపోయా. దెబ్బ తగిలింది. హాస్టల్ గదుల్లోకి కోతులు కూడా వస్తున్నాయి. భయపెడుతున్నాయి. గదుల పక్కనే చెత్తా చెదారం వేయడం వల్ల దుర్వాసన వస్తోంది. వర్షం పడితే గోడలకు కరెంట్ షాక్ వస్తోంది..
– సిద్దార్ధ, విద్యార్థి
షాక్ వస్తే ఎగిరి పడ్డా..
హాస్టల్లో కిటికి తీసేందుకు వెళ్లితే కరెంట్ షాక్ వచ్చింది. అందురూ చూస్తుండగానే ఎగిరి పడ్డా. మళ్ల కిటికీలు ఎవరం ముట్టుకోవడం లేదు. కరెంట్ స్విచ్ బోర్డుల నుంచి వైర్లు బయటికి వస్తున్నాయి. ఫ్యాన్లు వేసుకోవాలన్నా భయమే. ఎక్కడ కరెంట్ వస్తుందోనని భయపడుతున్నాం.
– అరుణ్‌కుమార్, విద్యార్థి
స్కిన్ ఎలర్జీ వస్తోంది..
స్నానం చేసేందుకు మంచి నీళ్లు లేవు. నీళ్లు బాగా లేక స్కిన్ ఎలర్జీ వస్తోంది. ఒకరికి దురద వస్తే ఇంకొకరికి అంటుకుంటోంది. పుండ్లు కూడా అవుతున్నాయి. ఇంటర్లో కొన్ని సబ్జెక్టులకు టీచర్స్ కూడా లేరు. త్వరగా భర్తీ చేయాలని కోరుకుంటున్నాం.
– శివమణి, విద్యార్థి