‘సదరం సర్టిఫికెట్‌కు రూ.30 వేలు?’ శీర్షికన మంగళవారం ‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన కథనం సంచలనం సృష్టించింది. కరీంనగర్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో రెండు రోజులుగా కలకలం రేపుతున్నది. ఇక్కడ జరుగుతున్న అక్రమాలు, బ్రోకర్ల దందా వెలుగులోకి రావడం, సూపరింటెండెంట్ కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం బ్రోకర్లకు దడ పుట్టించింది. తమకు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో వారంతా అప్రమత్తమైనట్టు తెలిసింది. సదరం సర్టిఫికెట్ల కోసం ఒప్పందం కుదుర్చుకున్న వారిని శిబిరాలకు రాకుండా అడ్డుకోవడంతోపాటు తాము రమ్మన్నప్పుడే రావాలని చెప్పినట్టు తెలుస్తున్నది. జనరల్ హాస్పిటల్లో ప్రతి రోజూ 250 మందికి పరీక్షలు చేసి దివ్యాంగుల సర్టిఫికెట్లు జారీ చేస్తుండగా, రోజువారీగా హాజరయ్యే వారి కంటే ఈ రెండు రోజుల్లో సంఖ్య తగ్గడం ఆరోపణలకు బలం చేకూరుస్తున్నది. అయితే ఈ దందా వెనుక ఎవరున్నారనే కోణంలో యంత్రాంగం విచారణ చేస్తున్నట్టు తెలుస్తుండగా, అక్రమార్కుల్లో వణుకు పుడుతున్నది.
కరీంనగర్ విద్యానగర్, ఫిబ్రవరి 12 : కరీంనగర్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ (జీజీహెచ్)లో సదరం సర్టిఫికెట్ల పేరిట జరుగుతున్న దందాను ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తెచ్చింది. శిబిరంలో జరుగుతున్న అక్రమాలను, బ్రోకర్లుగా మారిన సిబ్బంది తీరును బయటపెట్టింది. సదరం సర్టిఫికెట్ కోసం 30 వేలు డిమాండ్ చేసిన ఏజిల్ సెక్యూరిటీ గార్డును సూపరింటెండెంట్ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడంతో అక్రమాలకు పాల్పడుతున్న సిబ్బంది గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఈ దందా చాలాకాలంగా జరుగుతున్నా ఇన్నాళ్లూ పట్టించుకునే వారు లేక వెలుగులోకి రాలేదు. ‘నమస్తే’ కథనంతో కదలిక మొదలు కాగా, ఈ దందా వెనక చాలా మందే ఉన్నట్టు చర్చ జరుగుతున్నది. సదరం శిబిరం జరిగితే చాలు దరఖాస్తు చేసుకున్న వారి జాబితాను కింది స్థాయి సిబ్బందికి ఇచ్చి, వారితో ఫోన్లు చేయిస్తన్నట్టు తెలుస్తున్నది. సోమవారం పట్టుబడిన సెక్యూరిటీ గార్డుకు కూడా దవాఖానకు చెందిన ఓ ఉద్యోగి ఈ జాబితా ఇచ్చి ఫోన్లు చేయించినట్టు తెలుస్తున్నది. అయితే ఆ ఉద్యోగి ఎవరని ఆరా తీయగా.. సదరు సెక్యూరిటీ గార్డు దవాఖానలో పీఆర్వోగా పనిచేస్తున్న వినయ్ పేరు చెప్పినట్టు సమాచారం. అందులో ఎంత వరకు వాస్తవం ఉందనేది? అధికారులు పూర్తి స్థాయి విచారణ జరిపితే వెలుగులోకి వచ్చే అవకాశమున్నది.
అర్హత ఉన్నా వసూళ్లు?
సదరం శిబిరానికి రోజుకు 250 మంది వరకు పరీక్షలు చేయించుకుంటారు. అర్హత ఉంటేనే వైద్యులు దివ్యాంగుల సర్టిఫికెట్ జారీ చేస్తుంటారు. నిజానికి అర్హత లేకున్నా సదరం శిబిరం కోసం చాలా మంది స్లాట్ బుక్ చేసుకుంటుంటారు. అందులో 3 నుంచి 4 శాతం మందికి మాత్రమే శాశ్వత వైకల్య సర్టిఫికెట్లు జారీ చేస్తుంటారు. కొందరికి ఒకటి రెండేళ్ల వరకు తాత్కాలిక దివ్యాంగ సర్టిఫికెట్లను ఇస్తుంటారు. ఇలాంటి వారు 30 నుంచి 40 శాతం వరకు ఉంటారు. వీరిని పరీక్షిస్తున్న వైద్యులు మాత్రం ఎక్కడ పొరపాట్లు చేయకుండా సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. పూర్తి స్థాయి అర్హత ఉన్న వారిని పరీక్షించి దివ్యాంగ సర్టిఫికెట్లు ఇస్తుంటారు. కానీ, మధ్యలో బ్రోకర్లు జోక్యం చేసుకుని అర్హత ఉన్న నిరుపేద దివ్యాంగుల నుంచి కూడా వేలకు వేలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అర్హత లేని వారికి తాత్కాలిక వైకల్య సర్టిఫికెట్లు ఇప్పిస్తూ వారిని మోసం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. కింది స్థాయి సిబ్బంది చేస్తున్న ఈ దందా కారణంగా వైద్యుల ప్రతిష్టకు కూడా భంగం కలుగుతున్నది. అయితే ఈ అక్రమాల వెనక ఎవరు ఉన్నారనే విషయమై దవాఖాన ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నట్లు తెలుస్తున్నది. అక్రమ దందా వెనక ఎవరెవరు ఉన్నారో గుర్తించి కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరమున్నది.
ఈ నెల కాకపోతే మరో నెల?
దివ్యాంగులు సదరం శిబిరంలో దివ్యాంగ సర్టిఫికెట్లు పొందేందుకు ఒక నెల ముందే మీసేవా కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకుంటారు. అధికారులు వాటిని పరిశీలించి ఆర్థో, ఈఎన్టీ, మెంటల్, ఆప్తాల్ తదితర విభాగాలుగా విడదీసి, వారికి తేదీలు కేటాయిస్తుంటారు. ఆ తేదీల్లోనే శిబిరానికి వచ్చి పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. నిజానికి ఈ శిబిరాలను జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆర్గనైజ్ చేస్తుంటుంది. ఆయా తేదీల్లో వచ్చే వారి జాబితాను కూడా ఈ సంస్థనే విడుదల చేస్తుంది. బ్రోకర్లు ఎక్కడి నుంచి ఈ జాబితాను ఎక్కడి నుంచి తీసుకుంటున్నారో తెలియదుగానీ, దివ్యాంగులతో బేరసారాలు కుదుర్చుకుంటున్నారు. వారికి అనుకూలమైన పరిస్థితులు ఉంటేనే శిబిరానికి రమ్మని, లేదంటే మరో నెల రమ్మని చెబుతున్నారు. ఈ కారణంగా రోజువారీగా నడిచే సదరం శిబిరంలో పూర్తి స్థాయిలో దివ్యాంగులు ఏనాడూ హాజరు కావడం లేదు. ఈ నెల రాని దివ్యాంగులకు మరో నెలలో అవకాశం కల్పిస్తున్న నేపథ్యంలోనే ఇలా జరుగుతున్నట్టు స్పష్టంగా తెలుస్తున్నది. అయితే ఒకసారి సదరం శిబిరానికి హాజరు కాకుంటే.. తిరిగి ఏడాది వరకు హాజరు కాకుండా ఉంచేలా నిబంధనలు సవరిస్తేనే ఇటు బ్రోకర్ల ఆట కట్టించినట్టవుతుంది. అటు సదరం శిబిరానికి వచ్చే వారి సంఖ్య కూడా తగ్గుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.