Akkepelli Rajeshwara Temple | ధర్మపురి, డిసెంబర్ 25: ధర్మపురి పట్టణ శివారులోని శ్రీఅక్కెపెల్లి రాజేశ్వరాలయంలో గురువారం వేకువజామున చోరీ జరిగింది. ఎస్ఐ మహేశ్, ఆలయ పూజారులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం ఉదయం 5గంటలకు పూజాకార్యక్రమాలు నిర్వహించేందుకు ఆలయానికి చేరుకున్న అర్చకుడు బూస ప్రవీణ్ కు ఆలయం ఇనుప పతాంజలిగేటు తాళాలు పగులగొట్టబడి కనిపించింది.
కంగారుగా లోనికి వెళ్లి చూసేసరికి స్వామి వారి 2కిలోల వెండి ప్రాణపట్టం, 80 గ్రాములు అమ్మవారి ముఖకవచం చోరీకి గురైనట్లు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు ఆలయానికి చేరుకొని పరిసరాలను పరిశీలించారు. అలాగే పక్కన్నే ఉన్న లక్ష్మీనరసింహస్వామివారి మందిరంలోకి కూడా దుండగులు చొరబడి స్వామివారి వెండి కోరమీసాలు దొంగిలించారు. క్లూస్ టీమ్ సిబ్బంది చేరుకొని రెండు ఆలయాల్లో కొన్ని ఆధారాలు సేకరించారు. డీఎస్పీ రఘుచందర్, సీఐ రాంనర్సింహారెడ్డి ఆలయ పరిసరాలను పరిశీలించారు. అయితే దొంగిలించబడిన వెండి ప్రస్తుత ధర ప్రకారం రూ.3లక్షల వరకు ఉంటుందని అర్చకుడు తెలిపారు.