బంజారాహిల్స్, ఫిబ్రవరి 23: చాలీచాలని జీతం కుటుంబ పోషణకు సరిపోకపోవడంతో డ్యూటీ ముగిసిన తర్వాత ర్యాపిడో బైక్ నడిపిస్తున్న హోంగార్డు.. హోటల్ మేనేజ్మెంట్ పూర్తిచేసి విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నించేందుకు నగరానికి వచ్చి ర్యాపిడో బైక్ బుక్ చేసుకొని వెళ్తున్న యువతి.. వీరిద్దరినీ వాటర్ ట్యాంక్ రూపంలో వచ్చిన మృత్యువు కబళించింది. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. చాంద్రాయణ గుట్ట సమీపంలోని అలీ జుబెన్ కాలనీలో నివాసం ఉండే సయ్యద్ హుస్సేన్(40) సంతోష్‌నగర్ ట్రాఫిక్ పీఎస్‌లో హోంగార్డుగా పనిచేస్తున్నాడు. కుటుంబాన్ని పోషించేందుకు వచ్చే జీతం సరిపోకపోవడంతో డ్యూటీ ముగిసిన తర్వాత హుస్సేన్.. ర్యాపిడో బైక్ నడిపిస్తుంటాడు.
ఈ క్రమంలో సోమవారం ఉదయం 8గంటలకు డ్యూటీ దిగిన హుస్సేన్ ర్యాపిడో బుకింగ్స్ చేసుకుని మెహదీపట్నం దాకా వచ్చాడు. అక్కడ బుకింగ్ కోసం వేచి ఉన్న సమయంలో విజయనగరం జిల్లాకు చెందిన కొల్లూరు అక్షిత(21) అనే యువతి ర్యాపిడో బుక్ చేసుకుంది. ఉదయం 9.15 ప్రాంతంలో ఆమెను బైక్ మీద ఎక్కించుకున్న హుస్సేన్ బంజారాహిల్స్ రోడ్ నెం.1మీదుగా నాగార్జున సర్కిల్ వైపు వెళ్తున్నాడు. జలగం వెంగళరావు పార్కు సమీపంలోని మలుపు వద్దకు రాగానే వేగంగా వచ్చిన వాటర్ ట్యాంకర్ పక్కనుంచి వెళ్తున్న క్రమంలో బైక్‌ను తాకింది. ఈ ధాటికి బైక్ అదుపుతప్పి ట్యాంకర్ కిందకు వెళ్లడం.. ట్యాంకర్ వెనుక టైర్లు హుస్సేన్‌తో పాటు వెనుక కూర్చున్న అక్షిత మీదుగా వెళ్లిపోవడం రెప్పపాటు వ్యవధిలో జరిగిపోయింది.
ఈ ఘటనలో అక్షిత అక్కడికక్కడే మృతి చెందగా, హుస్సేన్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ప్రమాదానికి కారణమైన ట్యాంకర్ డ్రైవర్ కాజా పాషా(30)ను పోలీసులు అరెస్ట్ చేశారు. అక్షిత హోటల్ మేనేజ్మెంట్ కోర్సు పూర్తిచేసి, దుబాయ్, కెనడాలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఆదివారం ఉదయమే నగరానికి వచ్చిందని పోలీసుల విచారణలో తేలింది. సోమవారం ఉదయాన్నే మెహదీపట్నంలోని కన్సల్టెంట్ కార్యాలయానికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. ఇద్దరినీ మృత్యువు కబళించడం స్థానికులను ఆవేదనకు గురిచేసింది.