సిటీబ్యూరో, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): నగరంలో భారీ వర్షం కురిసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో సోమవారం సాయంత్రం గ్రేటర్లోని పలు చోట్ల గాలివాన దంచికొట్టింది. రాత్రి 9.30 గంటల వరకు నగరంలోని హయత్నగర్, హస్తినపురంలో అత్యధికంగా 1.80 సెం.మీలు, బహుదూర్పురాలోని సులేమాన్ నగర్లో 1.45 సెం.మీలు, రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 1.35సెం.మీలు, శాస్త్రిపురంలో 1.20సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీజీడీపీఎస్ అధికారులు వెల్లడించారు. అల్పపీడనం, ద్రోణి ప్రభావంతో రాగల మరో రెండు రోజులు వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.