Pawan Kalyan | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ఇటీవల ముంబైలోని ప్రముఖ కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో విజయవంతంగా భుజానికి శస్త్రచికిత్స జరిగింది. ఈ ఆపరేషన్‌ను ప్రపంచ ప్రఖ్యాత ఆర్థోపెడిక్ మరియు స్పోర్ట్స్ మెడిసిన్ నిపుణుడు డాక్టర్ దిన్షా పార్దివాలా నేతృత్వంలోని వైద్య బృందం నిర్వహించింది. పవన్ కళ్యాణ్‌కు చికిత్స చేసిన ఈ ప్రముఖ వైద్యుడు ఎవరు? ఆయన ప్రత్యేకత ఏమిటి? అనే అంశాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. డాక్టర్ దిన్షా పార్దివాలా ప్రస్తుతం ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో స్పోర్ట్స్ మెడిసిన్ సెంటర్ హెడ్‌గా, అలాగే ఆర్థ్రోస్కోపీ, స్పోర్ట్స్ ఆర్థోపెడిక్స్ మరియు షోల్డర్ సర్వీసెస్ విభాగాల డైరెక్టర్‌గా సేవలందిస్తున్నారు. ముఖ్యంగా భుజం, మోకాలు, లిగమెంట్ గాయాలకు అత్యాధునిక శస్త్రచికిత్సలు చేయడంలో ఆయనకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది.
వైద్య రంగంలో దాదాపు 27 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన డాక్టర్ పార్దివాలా ఇప్పటివరకు 10 వేలకుపైగా శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించారు. ముఖ్యంగా ఆయన చేసిన సర్జరీల్లో ఇన్ఫెక్షన్ రేటు దాదాపు శూన్యంగా ఉండటం ఆయన నైపుణ్యానికి నిదర్శనంగా చెబుతారు. ముంబైలోని ప్రతిష్టాత్మక సేథ్ జి.ఎస్. మెడికల్ కాలేజ్ & కేఈఎం హాస్పిటల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఆయన, అనంతరం ఆర్థోపెడిక్స్‌లో ఎంఎస్ చేశారు. ఆ తర్వాత అమెరికాలోని హాస్పిటల్ ఫర్ స్పెషల్ సర్జరీ (న్యూయార్క్), అమెరికన్ స్పోర్ట్స్ మెడిసిన్ ఇన్స్టిట్యూట్ (అలబామా) లో ఆర్థ్రోస్కోపీ, స్పోర్ట్స్ ఆర్థోపెడిక్స్‌లో ప్రత్యేక శిక్షణ పొందారు. అలాగే యూకేలోని ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ వైద్య సంస్థల్లో హిప్ ఆర్థ్రోస్కోపీపై అడ్వాన్స్డ్ ట్రైనింగ్ పూర్తి చేశారు.
డాక్టర్ దిన్షా పార్దివాలా దేశంలోని ప్రముఖ క్రీడాకారులకు వ్యక్తిగత వైద్యుడిగా కూడా గుర్తింపు పొందారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) మెడికల్ కమిటీలో భారత ప్రతినిధిగా కూడా ఆయన సేవలందిస్తున్నారు. టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తర్వాత మోకాలికి క్లిష్టమైన శస్త్రచికిత్స చేసినది కూడా డాక్టర్ పార్దివాలానే. అలాగే ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా, స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగాట్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణులు సైనా నెహ్వాల్, పీ.వి. సింధు, రెజ్లర్ సుశీల్ కుమార్ వంటి పలువురు ప్రముఖ క్రీడాకారులకు కూడా ఆయన చికిత్స అందించారు. దేశంలో తొలి రివర్స్ టోటల్ షోల్డర్ రీప్లేస్మెంట్, తొలి కార్టిలేజ్ సర్జరీ, తొలి స్టెమ్ సెల్ ఇంప్లాంట్, తొలి నేవిగేషన్ గైడెడ్ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ వంటి అనేక వినూత్న శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించిన ఘనత కూడా డాక్టర్ పార్దివాలాదే.
వైద్య రంగంలో విశిష్ట సేవలకు గాను డాక్టర్ దిన్షా పార్దివాలా పలు జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు. 2009లో ISAKOS జాన్ జాయిస్ అవార్డు, 2015లో స్వస్థ భారత్ సమ్మాన్ పురస్కారంతో ఆయనను సత్కరించారు.