‘నీళ్లచారు.. ఉడికీ ఉడకని అన్నం’ ఇది మెజార్టీ సర్కారు పాఠశాలల్లో పెడుతున్న మధ్యాహ్న భోజనం! జగిత్యాల జిల్లాలో క్షేత్రస్థాయిలో చూస్తే.. పోషకాహారం దేవుడెరుగు, కనీసం చిక్కటిపప్పు అన్నం అందడం లేదు. ఇక కూరగాయలు, ఆకుకూరలు, సాంబారుతో రుచికరమైన భోజనం అందిస్తున్నామని గొప్పలు చెబుతున్నా.. ఎక్కడా మెనూ కానరావడం లేదు. వారానికి మూడు గుడ్లు ఇవ్వాల్సి ఉండగా.. ఒక్కటికి మించి ఇవ్వడం లేదు. ఇదేంటని భోజన కార్మికులను అడిగితే.. సర్కారు ఇచ్చే పైసలతో పప్పు, కూరగాయలు కొనే పరిస్థితి లేదని, బిల్లులు కూడా రావడం లేదని.. ఇలా ఎలా వండాలని తమ బాధలను వెల్లబోసుకుంటున్నారు. కనీసం గౌరవ పారితోషికం ఇస్తలేరని.. సిలిండర్లు రావడం లేదని, ఏడు నెలలుగా చెల్లింపులే లేవని.. ఇక తమ బతుకులు ఎలా గడిచేదని ఆవేదన చెందుతున్నారు.
జగిత్యాల, జూలై 22 (నమస్తే తెలంగాణ) : విద్యాహక్కు చట్టం 2013 ప్రకారం 8వ తరగతి వరకు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం పిల్లలకు కూరగాయలు, ఇతర పౌష్టికాహారానికి నిధులు ఇస్తున్నది. ఇక 9,10వ తరగతి విద్యార్థులకు బియ్యంతోపాటు కూరగాయలు, పౌష్టికాహారం అంతా రాష్ట్ర ప్రభుత్వమే అందజేస్తూ వస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మెనూ చాలా అద్భుతంగా కనిపిస్తున్నా జగిత్యాల జిల్లాలో ఎక్కడా ఇది అమలు కావడం లేదు. జిల్లాలో 515 ప్రాథమిక పాఠశాలలు, 84 ప్రాథమికోన్నత పాఠశాలలు, 184 ఉన్నత పాఠశాలల్లో మొత్తం 55,927 మంది విద్యాభ్యాసం చేస్తుండగా, వీరందరికీ ప్రతి రోజూ మధ్యాహ్న భోజనం సిద్ధం చేసి వడ్డిస్తున్నారు. అయితే దాదాపుగా ప్రతి పాఠశాలలో నీళ్ల చారు.. సాంబార్.. ఎప్పుడైనా ఒకసారి కూరగాయల భోజ నం అందజేస్తున్నారు. పెరిగిన ధరల నేపథ్యంలో ఎక్క డా కూరగాయలు, ఆకు కూరలు వండడం లేదు. కేవ లం సోరకాయలు, బెండకాయల వంటివి కొన్ని వేసి, కొంత పప్పు వేసి సాంబర్ చేసి వడ్డిస్తున్నారు. మెనూ తో సంబంధం లేకుండా ఎక్కడ చూసినా ఇలానే భోజనం అందిస్తున్నారు. ఇక వారానికి మూడు సార్లు కోడిగుడ్డు పెట్టాల్సి ఉన్నా.. వారానికి ఒక్కరోజే పెడుతున్నారు. మిగిలిన రోజుల్లో వడ్డించడం లేదు. వెజిటేబుల్ బిర్యాని, కూరగాయల కూర, ఆకు కూరలు దాదాపు వడ్డించడం లేదు.
సోమవారం మధ్యాహ్న భోజన సమయంలో ‘నమస్తే తెలంగాణ’ జిల్లాలోని పలు పాఠశాలలను సందర్శించింది. ఈ సందర్భంగా పలువురు మధ్యాహ్న భోజన తయారీదారులు తమ గోడును వెల్లబోసుకున్నారు. మధ్యాహ్న భోజనం తమకు గిట్టుబాటు కావడం లేదని, ప్రభుత్వం ఇచ్చే మొత్తంతో వంట చేయడం సాధ్యం కాదని తెగేసి చెబుతున్నారు. ఆకుకూరలు, కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటాయని, ప్రభుత్వం ఇచ్చే ధరలకు కొనడం సాధ్యం కాదంటున్నారు. ఇక పప్పుల ధరలు సైతం పెరిగిపోయాయని, ఈ నేపథ్యంలో చిక్కటి పప్పు వేసి కూర చేయడం ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. ఒక్క కోడిగుడ్డుకు ప్రభుత్వం 4 మాత్రమే చెల్లిస్తుందని, మార్కెట్లో 7 పలుకుతుందని, అందుకే వారానికి ఒక్కరోజు మాత్రమే కోడిగుడ్డు పెడుతున్నామని చెబుతున్నారు. ప్రభుత్వం సిలిండర్లు ఇవ్వడం లేదని, వాటి ధరలు వందలు దాటి రూ.వేలకు చేరుకోవడంతో కొనుగోలు చేసి వినియోగించడం సాధ్యం కావడం లేదని వాపోయారు. పిల్లలకు నీళ్లలాగా ఉన్న పలుచని చారుతో భోజనం పెట్టడం తమకు సైతం ఇష్టం లేదని, మనస్ఫూర్తిగా వంట చేయడం లేదని, అయితే విధి లేని పరిస్థితి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మధ్యాహ్న భోజన కార్మికులపై కనికరం చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సన్నబియ్యం అంటూ దొడ్డుబియ్యం ఇస్తున్నారని, సన్నబియ్యం నేరుగా అందజేయాలని, అంగన్వాడీ కేంద్రాలకు ఇస్తున్నట్టుగానే పాఠశాలలకు కోడిగుడ్లను సరఫరా చేయాలని, సిలిండర్ ధరను ప్రభుత్వమే భరించాలని, కూరగాయలు, ఆకుకూరలకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చే మొత్తాన్ని పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

మధ్యాహ్న భోజన కార్మికులకు ఏడు నెలలుగా బిల్లులు మంజూరు కాలేదు. ఇటీవలే ప్రభుత్వం జగిత్యాల జిల్లాకు 1,48,34,500 మంజూరు చేయగా, 1,475 మంది మధ్యాహ్న భోజన కార్మికులకు కొంత చెల్లించారు. ఐదో తరగతి వరకు ఉన్న పాఠశాలల్లో వంట చేస్తున్న వారికి భోజన తయారీ ఖర్చులతోపాటు కోడిగుడ్డు బిల్లులను ఈ యేడాది జనవరి వరకు చెల్లించారు. అలాగే ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో వంట తయారీదారులకు బిల్లులు, కోడిగుడ్డు బిల్లులు ఇచ్చారు. అలాగే, గౌరవ వేతనాన్ని సైతం జనవరి వరకు చెల్లించినట్టు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. అయితే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, జూన్‌కు సంబంధించిన భోజన తయారీ బిల్లులు, గౌరవ వేతనం రాలేదు.
మధ్యాహ్న భోజనంలో పిల్లలకు అందజేయాల్సిన ఆహారానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక మెనూ తయారు చేసింది.
సోమవారం : కిచిడి, మిశ్రమ కూరగాయల కూర, కోడిగుడ్డు.
మంగళవారం : అన్నం, కూరగాయల కూర, సాంబార్.
బుధవారం : అన్నం, మిశ్రమ కూరగాయల కూర, ఆకుకూర, కోడిగుడ్డు.
గురువారం : వెజిటబుల్ బిర్యాని, మిశ్రమ కూరగాయల కూర.
శుక్రవారం : అన్నం, మిశ్రమ కూరగాయల కూర, సాంబార్, కోడిగుడ్డు.
శనివారం : అన్నం, మిశ్రమ కూరగాయల కూర, ఆకు కూర పప్పు.