‘మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే వారి కుటుంబాలు ఉన్నత స్థానానికి చేరుకుంటాయి. అందుకే మహిళలకు చేయాల్సిన సాయంకన్నా అధికంగా తోడ్పాటునందిస్తున్నాం. ప్రభుత్వం వారిని స్వయం ఉపాధి పనుల దిశగా ప్రోత్సహిస్తున్నది. అందులో భాగంగానే సర్కారు పాఠశాలల విద్యార్థులు, అంగన్వాడీ పిల్లలకు ఏకరూప దుస్తులు కుట్టేపని మహిళా సంఘాలకే అప్పగించాం’ అని అధికార పార్టీ పెద్దలు గొప్పలు చెబుతుండగా.. మహిళా సంఘాల సభ్యురాళ్లు మాత్రం తీవ్రంగా మండిపడుతున్నారు. ఏకరూప దుస్తులు కుట్టాలని తమకు వస్త్రం ఇవ్వగానే నిర్దేశించిన గడువులోపే పూర్తిచేసి అందించామని, కానీ, ఇప్పటివరకు కుట్టుకూలి డబ్బులు పూర్తిగా విడుదల చేయలేదని ఆగ్రహిస్తున్నారు. తెచ్చిన అప్పునకు వడ్డీ చెల్లించలేక నానాతిప్పలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమగ్ర శిక్ష అభియాన్ నుంచి విడుదలైన నిధులు మాత్రమే తమ ఖాతాల్లో జమచేసి, రాష్ట్ర ప్రభుత్వం అదనంగా అందిస్తామన్నా మిగతా మొత్తం నెలలు గడుస్తున్నా విడుదల చేయడం లేదని వాపోతున్నారు. ఇలా అయితే మహిళలు ఎలా ఆర్థిక స్వావలంబన సాధిస్తారని ప్రశ్నిస్తున్నారు.
కరీంనగర్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ కలెక్టరేట్ : ఈ విద్యా సంవత్సరం ఆరంభమయ్యే నాటికి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఏకరూప దుస్తులందించేలా మహిళా సంఘాల సభ్యులకు బాధ్యతలప్పగించారు. ఒక్కో విద్యార్థికి రెండు జతల చొప్పున అందించాల్సి ఉండగా, మొదట ఒక జత సిద్ధం చేసి ఇవ్వాలని సూచించారు. కుట్టుకూలి కింద ఒక్కో జతకు 50 చొప్పున చెల్లిస్తామని అధికారులు చెప్పగా, తమకు సరిపోవడం లేదని మహిళా సంఘాల సభ్యులు తమతో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వినతిపత్రం అందించారు. ఒక్కో జతకు 25 అదనంగా ప్రభుత్వం నుంచి అందిస్తామని సీఎం హామీ ఇవ్వడమే కాదు, కుట్టుకూలి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. మొదటి జత పూర్తి కాగానే జూన్ మొదటివారంలో అధికారులకు అప్పగించారు.
అయితే, అప్పటికే సమగ్ర శిక్ష అభియాన్ నుంచి విడుదలైన మొత్తంలో నుంచి జతకు 50 చొప్పున మొదటి విడుత కుట్టుకూలి జూలై చివరి వారంలో చెల్లించారు. ఆ వెంటనే రెండో జతకు సంబంధించిన వస్త్రం కూడా సంఘాలకు అప్పగించడంతో అవి కూడా పూర్తిచేసి ఆగస్టు మొదటి వారంలో విద్యాశాఖ అధికారులకు అందజేశారు. మొదటి విడుత పెండింగ్‌లో ఉన్న జతకు 25తోపాటు రెండో జత కూలీ 75 ఏకమొత్తంగా 100 ఒకేసారి తమకు అందుతాయనే భావనతో మహిళలు గడువుకన్నా ముందే దుస్తులు కుట్టి అందించారు. వారం, పది రోజుల్లో నిధులు విడుదల కాగానే, పెండింగ్‌లో ఉన్న మొత్తంతో పాటు రెండో జత కూలి చెల్లిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. కానీ, నాలుగు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు కుట్టుకూలి చెల్లింపులపై నోరు మెదపడం లేదని వాపోతున్నారు.
కరీంనగర్ జిల్లాలో 41,665 మంది విద్యార్థులకు అందించాల్సిన రెండు జతల దుస్తులు 15 మండలాల్లోని 600 నుంచి 700 మంది మహిళలు కుట్టారు. వీరికి మొదటి విడుతగా 20,83,250 మాత్రమే చెల్లించారు. ఇంకా 41,66,500 చెల్లించాల్సి ఉన్నది. అలాగే, రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లోని 26,009 ప్రభుత్వ పాఠశాలల్లో 18,58,841 మంది విద్యార్థులకు 20వేల పైచిలుకు మంది మహిళలు దుస్తులు కుట్టగా, సమగ్ర శిక్ష అభియాన్ నుంచి విడుదలైన 9,29,42,050 మాత్రమే వారి ఖాతాల్లో జమచేశారు.
మిగతా 18,58,84,100 ఎప్పుడు చెల్లిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. దీంతో మహిళలు ఆవేదన చెందుతున్నారు. అధికారులపై నమ్మకంతో తమ వద్ద పెట్టుబడి సొమ్ము లేకున్నా బాకీ తెచ్చి ముడిసరుకు కొనుగోలు చేశామని, నెలలు గడుస్తున్నా తమకు కుట్టుకూలి చెల్లించకపోతే తమకు ప్రయోజనమేంటని ప్రశ్నిస్తున్నారు. ఉపాధి కల్పన పేర తమను ఇబ్బందుల పాలు చేయడమే ఆర్థిక స్వావలంబనా..? అని మండిపడుతున్నారు. ఎప్పుడు చెల్లిస్తారో చెప్పాలంటూ నిత్యం అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నేను 5,774 మంది విద్యార్థుల డ్రెస్సులు, 12,040 మంది అంగన్వాడీ పిల్లల డ్రెస్సులు కుట్టిన. ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా నాకు చెల్లించలేదు. అధికారులను అడిగితే ప్రభుత్వం నుంచి డబ్బులు విడుదలైన అనంతరం చెల్లిస్తామని చెబుతున్నరు. కుట్టుకూలి తక్కువే అయినా, ఒకేసారి పెద్దమొత్తంలో డబ్బు వస్తుందనే ఆశతో అప్పు తెచ్చి కుట్టు మిషన్లు, దుస్తులు కుట్టేందుకు అవసరమైన ముడిసరుకులు కొన్న. నాలుగు నెలలు గడుస్తున్నా డబ్బులు రాలేదు. అప్పు తెచ్చిన మొత్తానికి నెలనెలా వడ్డీ చెల్లిస్తున్న. ఇలా అయితే మాకు మిగిలేది ఏముండదు? కనీసం రోజు వారీ కూలీ కూడా పడదు. అధికారుల చుట్టూ తిరిగి తిరిగి యాష్టకొస్తున్నది. ప్రభు త్వం స్పందించాలి. మా కూలీ డబ్బులు వెంటనే చెల్లించాలి.
– పద్మ, మహిళా సంఘ ప్రతినిధి (గంగాధర)