నాలుగు కొత్త పథకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో నిర్వహించిన గ్రామ సభలు బుధవారం రెండోరోజు సైతం గందరగోళంగా జరిగాయి. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఆత్మీయ భరోసా, రైతుభరోసా పథకాల కోసం ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాలో తమ పేర్లు ఎందుకు లేవంటూ పలువురు గ్రామస్తులు అధికారులను నిలదీశారు. తామెందుకు పథకాలకు అర్హులం కాదని ప్రశ్నించారు. ఈ సర్వే ఏ విధంగా చేశారని మండిపడ్డారు. దీంతో గ్రామసభలు రసాభాసగా మారాయి. జాబితాల్లో పేర్లు రానివారు మరోసారి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు చెప్పడంతో ఇంకెన్నిసార్లు దరఖాస్తు చేసుకోవాలంటూ ప్రజలు అసహనం వ్యక్తం చేశారు.
హుజూరాబాద్, జనవరి 22: మండలంలోని కనుకులగిద్ద గ్రామసభలో అర్హులను కాకుండా అనర్హులను పథకాలకు ఎంపిక చేశారంటూ పలువురు గ్రామస్తులు అధికారులను నిలదీశారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో అనర్హులే ఉన్నారని, అర్హులకు అందించాలని డిమాండ్ చేశారు. రేషన్‌కార్డుల కోసం ఎన్నిసార్లు దరఖాస్తులు ఇవ్వాలని నిలదీశారు.
హుజూరాబాద్ టౌన్, జనవరి 22: పట్టణంలోని 17వ వార్డు సభలో మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక ప్రసంగానికి కాంగ్రెస్ నాయకులు అడ్డుపడ్డారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తరహాలో ఇప్పటి ప్రభుత్వం పథకాలను అమలు చేయాలని సూచిస్తుండగా.. ప్రసంగానికి అడ్డుపడ్డారు. దీంతో ప్రసంగాన్ని మధ్యలోనే ఆపి, అక్కడి నుంచి వెళ్లిపోయారు.
హుజూరాబాద్ రూరల్, జనవరి 22: మండలంలోని తుమ్మనపల్లి గ్రామసభ ప్రజలు లేక సభ వెలవెల బోయింది. రాంపూర్, సిర్సపల్లి, రాజపల్లి, జూపాక, కనుకులగిద్ద గ్రామాల్లో అర్హులైన వారి పేర్లు జాబితాల్లో రాలేదని పలువురు గ్రామస్తులు అధికారులను నిలదీశారు. ప్రతి గ్రామంలో గ్రామస్తులు ఆందోళనలు చేపట్టారు. పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో శాంతించారు.
జమ్మికుంట టౌన్ (హుజూరాబాద్ టౌన్), జనవరి 22: జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 15వ వార్డులో ఇందిరమ్మ ఇళ్ల కోసం 380 మంది దరఖాస్తు చేసుకోగా, వార్డు సభలో మాత్రం 230 మంది పేర్లు మాత్రమే ప్రకటించడంపై ప్రజలు అధికారులను నిలదీశారు. 14వ వార్డు వార్డుసభలో అర్హులకు పథకాలు ఎందుకు అందించడం లేదని ప్రజలు ప్రశ్నించారు. ఈ క్రమంలో ఆగ్రహంతో ఫ్లెక్సీని చింపి, మురుగుకాలువలో పడేశారు. కోరపల్లి గ్రామసభలో ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో అనర్హుల పేర్లను ప్రకటించారంటూ ప్రజలు, అధికారులతో వాగ్వాదానికి దిగారు. వారిని చుట్టుముట్టారు. పోలీసులు కలుగజేసుకొని, స్థానికులను అదుపు చేశారు.
సైదాపూర్, జనవరి 22: ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో పాల్గొన్నప్పటికీ జాబితాలో తమ పేర్లు ఎందుకు రాలేవని రాంచంద్రాపూర్ గ్రామసభలో ప్రజలు అధికారులను ప్రశ్నించారు. రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న తమకు ఎలిజిబిలిటీ ఎందుకు లేదో చెప్పాలని రాయికల్‌లో ప్రజలు అధికారులను నిలదీశారు. భూమి లేని వారందరికీ ఆత్మీయ భరోసా ఇవ్వాలని ప్రజలు కోరారు.
ఇల్లందకుంట, జనవరి 22: మండలంలోని చిన్నకోమటిపల్లి, సీతంపేట గ్రామాల్లో అధికారులు లబ్ధిదారుల జాబితాలను చదివి వినిపిస్తుండగా, అనర్హులను పథకాలకు ఎంపిక చేశారంటూ పలువురు గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇండ్లకు అర్హత ఉన్నా తమను జాబితాలో చేర్చలేదంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో జాబితాల్లో పేర్లు లేనివారు తిరిగి దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో పుల్లయ్య సూచించారు.
వీణవంక, జనవరి 22: మండలంలోని మామిడాలపల్లి, వీణవంక, గంగారం, బొంతుపల్లి, నర్సింహులపల్లి, పోతిరెడ్డిపల్లి, లస్మక్కపల్లి, వల్భాపూర్, కోర్కళ్ గ్రామ సభల్లో అధికారులు నాలుగు సంక్షేమ పథకాల లబ్ధిదారుల పేర్లు చదివి వినిపించగా, ఎంపికలో అవకతవకలు జరిగాయంటూ ప్రజలు ఆందోళన చేశారు. వీణవంకలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఎంపికలో పూర్తిగా అన్యాయం జరిగిందంటూ మహిళలు పెద్ద ఎత్తున గొడవ చేశారు. ప్రతి గ్రామ సభలో అధికారులను నిలదీశారు.
మానకొండూర్, జనవరి 22: మానకొండూర్ గ్రామపంచాయతీ ఆవరణలో నిర్వహించిన గ్రామసభలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇందిరమ్మ ఇండ్ల కోసం మొత్తం 1734 మంది దరఖాస్తు చేసుకోగా, 826 మంది పేర్లు లిస్టులో పెట్టారు. ఇందులో సొంత జాగ ఉన్న లబ్ధిదారుల కేటగిరిలో 549, ఖాళీ స్థలం లేని వారి జాబితాలో 277 మంది ఉన్నారు. దీనిపై మాజీ జడ్పీటీసీ, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తాళ్లపెల్లి శేఖర్‌గౌడ్ స్పందించి, ఇప్పుడు లిస్ట్ ఉన్న లబ్ధిదారులందరికీ ఇండ్లు మంజూరు అయినట్టేనా, స్పష్టత ఇవ్వాలని అధికారులను కోరారు. అంతలో అక్కడే గ్రామసభలో ఉన్న కాంగ్రెస్ నాయకుడు కొత్తకొండ శంకర్ కల్పించుకుని.. మీ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పదేళ్లలో ఎన్ని ఇండ్లు ఇచ్చారో చెప్పాలని శేఖర్‌గౌడ్‌తో వాగ్వాదానికి దిగాడు. అలాగే, సంక్షేమ పథకాలను ఎవరికి ఇచ్చుకుంటామనేది తమ ఇష్టమని, అడుగడానికి మీరు ఎవరంటూ దుర్భషలాడుతూ అధికారులు, పోలీసుల సమక్షంలోనే రెచ్చిపోయాడు. ఇంతలో అక్కడే ఉన్న కాంగ్రెస్ నాయకులు కోండ్ర సురేశ్, పిట్టల వెంకటేశ్, తాళ్లపెల్లి నరేశ్, ఇర్ఫాన్, తదితరులు బీఆర్ఎస్ నాయకులతో గొడవకు దిగారు. చివరకు అధికారులు, పోలీసుల జోక్యంతో గొడవ సద్దుమణిగింది.
మానకొండూర్ రూరల్, జనవరి 22: మానకొండూర్ మండలం రంగపేట గ్రామసభలో అనర్హులను జాబితాలో నమోదు చేశారని ఎంపీవో కిరణ్ కుమార్‌తో పాటు అధికారులను పలువురు గ్రామస్తులు నిలదీశారు. మళ్లీ సర్వే చేసి అనర్హుల పేర్లు తొలగిస్తామని అధికారులు చెప్పడంతో గొడవ సద్దుమణిగింది.
శంకరపట్నం, జనవరి 22: కేశవపట్నం, కన్నాపూర్, ధర్మారం, ఆముదాలపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు, ఆత్మీయ భరోసా పథకం, రేషన్ కార్డుల జాబితాల విషయమై అధికారులతో వాగ్వాదానికి దిగారు. కేశవపట్నంలో గొడిశాల రజిత-రాములు అనే దంపతులు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా జాబితాలో తమ పేరు లేకపోవడంతో తహసీల్దార్ భాస్కర్‌ను ప్రశ్నించారు. తమకు జాబ్ కార్డు ఉందని, 50 రోజుల పాటు ఉపాధి పనులకు సైతం వెళ్లామని తెలిపారు. ఆముదాలపల్లి గ్రామంలో తమకు స్థలం కలిగి జాబ్ కార్డు ఉన్నా, ఉపాధిహామీ పనులకు వెళ్తున్నా ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో తమ పేరు చేర్చలేదని శనిగరపు రాధ-ఓదయ్య అధికారులతో వాదనకు దిగారు. ధర్మారం గ్రామంలో అర్హులమైనా తమను ఆత్మీయ భరోసా పథకంలో చేర్చలేదని చొల్లేటి రాజయ్య, గోపి ఆవేదన వ్యక్తం చేశారు.
తిమ్మాపూర్ రూరల్, జనవరి 22: మండలంలోని వచ్చునూరు, నేదునూరు, కొత్తపల్లి, మన్నెంపల్లి, మల్లాపూర్, మొగిలిపాలెం, పర్లపల్లి గ్రామసభల్లో అర్హుల పేర్లు జాబితాలో లేవంటూ అధికారులను గ్రామస్తులు నిలదీశారు. లబ్ధిదారుల జాబితాను ఏ ప్రతిపాదికన ఎంపిక చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
గన్నేరువరం, జనవరి 22: గన్నేరువరం గ్రామసభలో ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల జాబితాలో అర్హుల పేర్లు లేవని, కాంగ్రెస్ నాయకులకే పథకాలను కేటాయించారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పారువెల్ల గ్రామసభలో వెల్లడించిన సంక్షేమ పథకాల లబ్ధిదారుల జాబితాల్లో అర్హత ఉన్నప్పటికీ తమ పేర్లు ఎందుకు చేర్చలేదంటూ పలువురు గ్రామస్తులు అధికారులను నిలదీశారు.
చిగురుమామిడి, జనవరి 22: మండలంలోని గాగిరెడ్డిపల్లి, లంబాడిపల్లి, సీతారాంపూర్, ముదిమాణిక్యం, నవాబుపేట గ్రామాల్లో రెండో రోజు గ్రామ సభలను అధికారులు నిర్వహించారు. కాగా, లబ్ధిదారుల జాబితాలో అనర్హుల పేర్లు వచ్చాయని పలువురు గ్రామస్తులు ఆరోపించారు.
చొప్పదండి, జనవరి 22: వివిధ గ్రామాల్లో జరిగిన గ్రామసభల్లో లబ్ధిదారుల జాబితాలో తమ పేర్లు రాలేదని పలువురు గ్రామస్తులు అధికారులను ప్రశ్నించారు. నియోజకవర్గానికి 3500 ఇండ్లు కేటాయించామని చెప్పుకొంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఒక పోలింగ్ బూత్ పరిధిలో సుమారు పది ఇండ్లు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ గ్రామ సభల్లో ఏ ఒక దరఖాస్తుదారుడికి ఇల్లు మంజూరు చేయకపోవడంతో ప్రజలు నిరాశ పడుతున్నారు.
రామడుగు, జనవరి 22: గోపాల్రావుపేట గ్రామసభలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల జాబితాల్లో తమ పేరు ఎలా తొలగిస్తారని మండల ప్రత్యేకాధికారి అనిల్ ప్రకాశ్, ఎంపీవో శ్రవన్కుమార్పై పలువురు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త రేషన్‌కార్డులను పంపిణీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఎంతమందికి అందించిందో చెప్పాలని నిలదీశారు.
కరీంనగర్ రూరల్, జనవరి 22: మండలంలో బుధవారం జరిగిన గ్రామసభల్లో అసౌకర్యాలతో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. గోపాల్పూర్, చేగుర్తి, మందులపల్లి, జూబ్లినగర్, నల్లగుంటపల్లి, ఫకీర్‌పేట, తాహెర్ కొండాపూర్, బహ్దుర్ఖాన్పేట గ్రామసభలు జరుగగా, పలు చోట్ల కనీసం నీటి సౌకర్యం కల్పించకపోవడంతో పిల్లలతో వచ్చిన మహిళలు ఇక్కట్లపాలయ్యారు. ఇక సర్వేలో ఎంపికైన లబ్ధిదారుల పేర్లు నోటీస్ బోర్డులో పెట్టకపోవడం అనేక మంది అధికారులను ఆరా తీస్తూ కనిపించారు.
కార్పొరేషన్, జనవరి 22: ప్రజాపాలన వార్డు సభల్లో ప్రజలు ఇచ్చిన దరఖాస్తులను ప్రభుత్వానికి పంపి అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని నగర మేయర్ యాదగిరి సునీల్‌రావు పేర్కొన్నారు. నగరంలో రెండో రోజు బుధవారం ఉదయం 15 డివిజన్ల్లు, మధ్యాహ్నం 15 డివిజన్లలో వార్డు సభలు జరిగాయి. సభల్లో వివిధ పథకాలకు ఎంపికైన లబ్ధిదారుల జాబితాను అధికారులు ప్రకటించారు. జాబితాల్లో పేర్లు లేకపోవడంతో అనేక మంది ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల కోసం తిరిగి దరఖాస్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమాల్లో నగర మేయర్ యాదగిరి సునీల్‌రావుతో పాటు, పలు డివిజన్లలో నగర కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ వార్డు సభలను పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, సంక్షేమ పథకాల కోసం ప్రజలు ఇచ్చిన దరఖాస్తులను ప్రభుత్వ పరిశీలనకు పంపిస్తామని తెలిపారు. కాగా, నగరంలోని 39వ డివిజన్లో కార్పొరేటర్ దరఖాస్తు పత్రాలను అందిస్తుండగా, వాటిని తీసుకునేందుకు ఒక్కసారిగా ప్రజలు పోటీపడడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. పలు పత్రాలు చిగిరిపోయాయి. దీంతో పోలీసులు కలుగజేసుకొని దరఖాస్తు పత్రాలను అందించారు. అనేక ప్రాంతాల్లో దరఖాస్తు పత్రాల కోసం ప్రజలు జిరాక్స్ సెంటర్లకు వెళ్లడం కనిపించింది.
నాకు ఇల్లు లేకపోవడంతో ప్రజాపాలనలో నా భార్య తిరుమల పేరిట దరఖాస్తు చేసుకున్న. మా గ్రామంలో ప్రజాపాలన గ్రామసభలో వెల్లడించిన లబ్ధిదారుల జాబితాలో మాతో పాటు అర్హత ఉన్న ఎంతో మంది పేర్లు గల్లంతయ్యాయి. అనర్హుల పేర్లు జాబితాలో వచ్చాయి. కావాలనే కొంత మంది పైరవీకారులు మా పేర్లను తొలగించారు. ఈ విషయం జిల్లా మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు దృష్టికి తీసుకువెళ్తా.
కార్పొరేషన్, జనవరి 22: తమ డివిజన్లో ప్రకటించిన ఇందిరమ్మ ఇళ్ల జాబితాల్లో అనేక మంది అర్హుల పేర్లు రాలేవంటూ 25వ డివిజన్ కార్పొరేటర్ ఎడ్ల సరితా అశోక్ బుధవారం తన నివాసంలో కళ్లకు గంతలు కట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. అలాగే రేషన్‌కార్డుల విషయంలోనూ ప్రభుత్వం ఎలాంటి స్పష్టత లేకుండానే జాబితాను ప్రకటించిందన్నారు. అందుకే తాము గాంధీగిరి పద్ధతిలో నిరసన వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. అర్హులందరికి ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులను మంజూరు చేయాలని కోరారు.