బుధవారంపేట గ్రామం ఆగమవుతున్నది. సింగరేణి తీరుతో బతుకుపోరాటం సాగిస్తున్నది. ఓసీపీ-2 విస్తరణ కోసం ఆ సంస్థ వ్యవసాయ భూములు లాక్కునేందుకు సిద్ధమవుతుండగా, గ్రామస్తులు భగ్గుమంటున్నారు. సింగరేణి తమపై పగబట్టిందని, పదిహేనేండ్ల సంది గోసపెడుతున్నదని మండిపడుతున్నారు. ఇప్పటికే అభివృద్ధికి, సంక్షేమ పథకాలకు దూరమయ్యామని, ఇప్పుడున్న వ్యవసాయ భూములను గుంజుకోవాలని చూస్తున్నదని ఆగ్రహిస్తున్నారు. తమది వ్యవసాయ ఆధారిత గ్రామమని, వరితోపాటు పత్తి, కూరగాయల పండిస్తూ ఉపాధి పొందుతున్నామని, ఇప్పుడు భూములు తీసుకుంటే ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు. తీసుకుంటే మొత్తం ఊరును తీసుకోవాలని, లేదంటే ప్రాణాలు పోయినా భూములను ఇచ్చేది లేదని స్పష్టం చేస్తున్నారు.
పెద్దపల్లి, జనవరి 4 (నమస్తే తెలంగాణ)/మంథని : రామగిరి మండలం బుధవారంపేట గ్రామాన్ని సింగరేణి ఆగం చేస్తున్నది. ఓసీపీ-2 విస్తరణలో భాగంగా 2009లోనే ఆ గ్రామానికి చెందిన 700 ఎకరాలకుపైగా భూములు కావాలని ప్రతిపాదించింది. అప్పుడు నిర్వాసిత గ్రామంగా ప్రకటించి అభివృద్ధికి దూరం చేసింది. అప్పటి నుంచి ఇక్కడ జీపీ భవనం మినహా ఎలాంటి నిర్మాణాలు జరగకుండా అడ్డుకున్నది. 2011-12లో డీఎన్‌డీడీ (డ్రాఫ్ట్ నోటిఫికేషన్ డిక్లరేషన్ డేట్) కాగా, 2015లో అవార్డు పాస్ అయింది. ప్రభుత్వం ప్రజలకు నూతన పాస్ పుస్తకాలు జారీ చేస్తే.. గ్రామంలో ఏ ఒక్క రైతుకు కూడా పట్టా బుక్ రాలేదు. గ్రామంలో స్వాధీనం చేసుకున్న 708 ఎకరాలకు పట్టాలు లేక రైతుబంధు జమకాలేదు. 2105 తర్వాత ఎంతో మంది రైతులు చనిపోయినా రైతు బీమా అందలేదు.
సంక్షేమ పథకాలు రాకుండా.. సింగరేణి అవార్డు పాస్ చేయడంతో గ్రామస్తులంతా పోరుబాట పట్టారు. అందరూ కలిసి 2019లో రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. గ్రామస్తుల బాధను అర్థం చేసుకొని 2023లో హైకోర్టు అవార్డు క్యాన్సిల్ చేయడంతోపాటు భూములు తిరిగి రైతులకే రిజిస్ట్రేషన్ చేయాలని తీర్పు ఇచ్చింది. అప్పటి నుంచి రైతులు తమ పట్టాల కోసం తహసీల్దార్, ఆర్డీవో ఆఫీసుల చుట్టూ తిరుగుతుండగా, నాలుగు నెలల క్రితం సింగరేణి మరోసారి భూములు తీసుకుంటామని పిడుగులాంటి వార్త చెప్పింది. ఇప్పటికే ఐదు నెలల క్రితం బుధవారంపేటలో 88 ఎకరాలు తీసుకున్న ఆ సంస్థ.. ఇప్పుడు మరో 444 ఎకరాలు తీసుకునేందుకు సిద్ధం కావడంపై గ్రామస్తులు భగ్గుమంటున్నారు. 15 రోజుల క్రితం ఆ సంస్థ మెగా ఓసీ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టగా, తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ఇటీవల గ్రామ పంచాయతీ పరిధిలో గల సిద్ధిపల్లి గ్రామంలోని 20 ఇండ్లకు నంబర్లు కేటాయిద్దామని సింగరేణి అధికారులు వస్తే అడ్డుకున్నారు. ఊరిలోని ప్రతి ఇంటినీ తీసుకున్న తర్వాతనే భూముల జోలికి రావాలని, లేకుంటే తమ భూములను ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. జీవనాధారమైన వ్యవసాయ భూములను తీసుకుంటే ఇక్కడ తమకు ఉపాధి ఎలా దొరుకుతుందని, తామెలా బతకాలని ప్రశ్నిస్తున్నారు. తమ భూములు తీసుకున్న తర్వాత ఇక్కడ ఓబీ కుప్పల్లో బుక్కెడు బువ్వ కూడా దొరకదని, దుమ్ము ధూళికి రోగాల బారిన పడి చావాలా..? అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీసుకుంటే మొత్తం ఊరిని తీసుకోవాలని, వ్యవసాయ భూములతోపాటు ఇండ్లు, ఇండ్ల స్థలాలను తీసుకొని తమకు మరో చోట పునరావాసం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు గ్రామ పంచాయతీలో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి, ఏకగ్రీవ తీర్మానం చేసుకున్నారు. మంత్రి శ్రీధర్‌బాబు, కలెక్టర్ కోయ శ్రీహర్షకు వినతి పత్రాలు అందజేసి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.
మమ్మల్ని ఆగం చేస్తున్నది
మా బుధవారంపేట గ్రామం సింగరేణి సంస్థకు ఒక ప్రయోగశాలగా మారింది. మమ్మల్ని ఆగం చేస్తూ విధ్వంసం సృష్టిస్తున్నది. సింగరేణి కారణంగా 2009 నుంచి అభివృద్ధికి దూరమై నేటికీ అలాగే కొనసాగుతున్నది. ఇప్పుడు మా భూములు మాత్రమే తీసుకొని ఇండ్లను తీసుకోమని చెబుతున్నది. భూములు పోయాక ఓబీ మట్టి కుప్పల్లో మేం ఏం చేయాలో అర్థం కావడం లేదు. సింగరేణికి ఒక్కటే చెబుతున్నాం. మొత్తం గ్రామంలోని ఇళ్లకు అవార్డు పాస్ చేసిన తర్వాతనే మా భూముల జోలికి రావాలి. అలా కాకుంటే మా ఊరిలో సింగరేణి అధికారులను రానిచ్చేది లేదు. దీని కోసం సింగరేణితో యుద్ధం చేయడానికి కూడా మేం సిద్ధమే.
– శంకెసి రవీందర్, మాజీ సర్పంచ్
ఊరు మొత్తాన్ని తీసుకోవాలి
2012 నుంచి మా ఊరు సింగరేణి తీసుకుంటామని చెబుతూ ఇటు అభివృద్ధికి.. అటు సంక్షేమ పథకాలకు దూరం చేసిన్రు. పరిహారం ఇవ్వకుండా మమ్మల్ని ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులకు గురి చేసిన్రు. ఇప్పుడు మళ్ల మా భూములను తీసుకుంటామంటున్నరు. మా భూములను కాదు ఊరు మొత్తాన్ని తీసుకోవాలి. మాకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీని అందించాలి. వరంగల్ జిల్లా మామునూరు ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం మామునూరు భూ నిర్వాసితులకు అందించిన మాదిరిగానే మాకు పరిహారం అందించాలి. గ్రామంలోని గౌడ కులస్తులు పూర్తిగా జీవనోపాధి కోల్పోతున్నరు. వారికి ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వడంతో పాటు ఐదెకరాల భూమి ఇవ్వాలి. హైబ్రిడ్ తాటి చెట్ల మొక్కలను అందించి వారికి ఉపాధి చూపాలి.
– ఆరెల్లి కొమురయ్య, గ్రామస్తుడు
ఊరిలో ఎట్ల బతుకుడు?
సింగరేణి కారణంగా పదహారేళ్లుగా అభివృద్ధికి దూరంగా బతుకుతున్నం. మా గ్రామాన్ని తీసుకుంటా అని చెప్పి భూములను తీసుకొని తప్పుడు అవార్డు పాస్ చేసింది. అప్పుడు మేం కోర్టుకు వెళ్తే భూములు మాకే ఇవ్వాలని తీర్పు వచ్చింది. మళ్లీ భూములు తీసుకుంటామని సింగరేణి నోటీసులు ఇచ్చింది. ఇండ్లను తీసుకోదట. భూములు పోయినంక ఎవుసం ఉండదు. ఉపాధి ఉండదు. ఓబీ కుప్పల్లో బుక్కెడు బువ్వ దొరకదు. ఊరిలో ఎట్ల బతుకుతం? సింగరేణి మా ఇండ్లను తీసుకున్న తర్వాతనే భూముల జోలికి రావాలి. లేదంటే భూములు ఇచ్చేది లేదు. దీనిపై కలెక్టర్‌తోపాటు ఇతర ఉన్నతాధికారులను కూడా కలుస్తాం.
– వడ్లకొండ రాజయ్య, గ్రామస్తుడు
సింగరేణి అన్యాయం చేస్తున్నది
సింగరేణి సంస్థ ఓసీపీ-2 విస్తరణలో భాగంగా కొన్నేండ్ల కిందటే బుధవారంపేట అలియాస్ రామయ్యపల్లిలోని భూములను తీసుకున్నది. ఈ భూములను రెవెన్యూ రికార్డుల్లో కూడా సింగరేణి తీసుకున్నట్టు మార్చారు. అయితే, అప్పుడు కూడా కేవలం భూములు తీసుకుంటామని చెప్పింది. ఆ భూములు పోయిన తర్వాత ఎలా బతకాలని గ్రామస్తులు పోరాడడంతో సింగరేణి ఆ భూములను విడిచి పెట్టింది. మళ్లీ ఇప్పుడు విస్తరణ కోసం బుధవారంపేటలోని వ్యవసాయ భూములను తీసుకుంటామని నోటీసులు ఇచ్చింది. పాత పద్ధతిలోనే ఇళ్లను తీసుకోకుండా వ్యవసాయ భూములు మాత్రమే తీసుకుంటామంటున్నది. సింగరేణి ఆలోచించాలి. బుధవారంపేట గ్రామస్తుల కోరిక మేరకు వ్యవసాయ భూములు, ఇళ్లను కూడా తీసుకోవాలి. నిర్వాసితుడిగా మారుతున్న ప్రతి రైతుకు ఉపాధి కల్పించాలి. అందుకోసం బీఆర్ఎస్, తెలంగాణ బొగ్గు గని సంఘం భూ నిర్వాసితులకు అండగా నిలిచి పోరాటం చేస్తుంది.
– మిర్యాల రాజిరెడ్డి, టీబీజీకేఎస్ అధ్యక్షుడు