యూరియా కొరత తీవ్రమవుతున్నది. రోజుల తరబడి తిరిగినా ఒక్క బ్యాగు దొరకడం గగనమే అవుతున్నది. ఉమ్మడి జిల్లాలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. దొరకక దొరకక ఒక్క బ్యాగు దొరికితే అది ఏ మూలకూ సరిపోయే పరిస్థితి లేక, రెండో బ్యాగు కోసం తండ్లాడాల్సి వస్తున్నది. మళ్లీ మళ్లీ కేంద్రాల చుట్టూ తిరగాల్సి వస్తున్నది. ఈ పరిస్థితుల్లోనే రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. సర్కారు తీరుపై మండిపడుతున్నారు. వరి, మక్క, పత్తి పంటలకు ఈ నెలలోనే ఎక్కువ శాతం యూరియా వినయోగం ఉంటుందని, ఈ సమయంలో యూరియా వేయకపోతే నష్టపోతామని కన్నీరు పెడుతున్నారు. మున్ముందు యూరియా దొరకకపోయినా, వరి పొట్ట దశలో చల్లకపోయినా ఏకంగా పంటలను వదులుకోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
-గంభీరావుపేట/ముస్తాబాద్, ఆగస్టు 22
రోజూ యూరియా కోసం మండల కేంద్రానికి వస్తున్నం. మహిళా గ్రూప్ షాపులోకి యూరియా వస్తుందని తెలిసి వచ్చిన. 330 బ్యాగులు వచ్చాయని చెప్పిన్రు. కానీ, 500 మంది రైతులు వచ్చిన్రు. ఒక్కొక్కరికి ఒక్క బస్తా ఇస్తమన్నరు. అవి ఏ మూలకు సరిపోతయి? యూరియా దొరకడం లేదు. పొలం చూస్తే దుఃఖం వస్తంది. ఎప్పుడు ఇంత గోసపడలే. ప్రభుత్వం స్పందించాలి. అందరికీ యూరియా అందించాలి.
నాకు మూడెకరాలు ఉన్నది. వరి సాగు చేసిన. పదిహేను రోజుల క్రితమే యూరియా చల్లాల్సి ఉండే. పదిహేను రోజుల సంది యూరియా కోసం తిరుగుతున్న. జగిత్యాల సొసైటీకి ఐదు సార్లు వచ్చిన. ప్రతి సారి నాదాకా వచ్చే సరికి స్టాకు అయిపోతుండే. ఇప్పుడు శుక్రవారం యూరియా దొరికింది. కనీ, అది ఏ మూలకు సరిపోతది? యూరి యా దొరక్క పంటంతా ఎర్రవడ్డది. కనీసం రెండు బస్తాలైనా ఇస్తరనుకుంటే ఒక్కటే ఇచ్చిన్రు. ఇంకా బస్తాలు కావాలంటే మళ్లీ రావాలని చెప్పిన్రు.
పదేండ్ల కిందట గిట్లనే యూరియాకు గోసపడ్డం. చెప్పులు లైన్లో పెట్టినం. ఒక్కో బస్తా తీసుకపోయి చల్లుకున్నం. ఎకరంన్నర భూమిలో వరి నాటేసి నెల దాటింది. మక్కకు, వరికి కలిపి మూడు బస్తాలు అవసరం పడతది. నేను పది దినాల సంది ఎదురు చూస్తున్న. యూరియా రేపత్తది మాపత్తది అన్నరు. అచ్చిందని తెల్వగానే పొద్దున 6 గంటల వరకే వచ్చి లైను కట్టిన. అయిన ఒక్క బస్తా కూడా దొరకలే. నాటేసిన వరికి యాల్లకు మసాల పొయ్యకపోతే పచ్చపడుతదా..? దానికి పిల్ల పుడుతదా..? గీసోంటి మసాలాకు కరువు వస్తదని తెలిస్తే బీడు ఉంచుకుందుంటిమి.
నేను నాలుగెకరాల్లో వరి నాటేసి నలభై రోజులు అయితున్నది. ఆరు బస్తాల యూరియా అవసరం పడుతది. పది రోజుల సంది ఇయ్యిలటికి మూడూర్లు తిరిగిన. ఎక్కడైనా నా లైను వచ్చే వరకు యూరియా అయిపోయిందని చెప్పిన్రు. ఫస్టు లింగన్నపేటకు వచ్చిందంటే అక్కడ దొరకలే. తర్వాత గంభీరావుపేటకు వెళ్లిన. శుక్రారం పొద్దున కొత్తపల్లికి పోయినా దొరకలే. ఏడు గంటలకు అచ్చి లైను కడితే అయిపోయిందని నా ఆధార్ కార్డు నాకు చేతిలో పెట్టిన్రు. సగం.. సగం లారీ లోడులు దించుతూ ఎన్ని రోజులు.. ఎన్ని సార్లు లైను కట్టుమంటారో మాకైతే అర్థమైతలేదు. నాటేసిన వరి చేనుకు గెన పుడుతున్నది. ఇగ చల్లిన లాభం ఉండదు. పంట సరిగా రాదు. పెట్టిన పెట్టుబడి నిండ మునిగినట్టే.
వరి నాట్లు వేసిన రైతులకు యాల్లకు యూరియా ఇయ్యని కాంగ్రెస్ ప్రభుత్వం పని ఇగ అయి పోయింది. నేను ఐదెకరాలు నాటేసిన. పది సంచుల దాకా అవసరమున్నయి. లారీ లోడు వచ్చినప్పుడల్లా ముందుగల రోజు చెప్పులు పెట్టి, పంచేటప్పుడు పొద్దంతా లైను కడుతున్నం. తీరా ఒక్క సంచి ఇత్తే ఏం చేసుకోవాలి? పోయిన పదేళ్లలో ఎన్నడూ గోదాం వద్ద ఒక్క నిమిషం కూడా ఆగలే. అవసరం ఉన్నప్పుడల్లా ఇట్ల వచ్చి అట్ల బండి మీద రెండు సంచులు వేసుకుని పోయిన. గింత గోరమైన పరిస్థితులను పదేండ్ల కిందట కాంగ్రెస్ ప్రభుత్వంలో చూసిన. మళ్ల ఇప్పుడు చూస్తున్న.