అకాల వాన రైతన్నను వెంటాడుతున్నది. ఆరుగాలం కష్టాన్ని నీళ్లపాలు చేస్తూ అపార నష్టాన్ని తెచ్చిపెడుతున్నది. ఓ వైపు కొనుగోళ్లలో నిర్లక్ష్యంతో కేంద్రాల్లోనే ధాన్యం రోజుల తరబడి మూలుగుతున్నది. తాజాగా మంగళవారం అర్ధరాత్రి తర్వాత పడిన వానకు ఎక్కడికక్కడ తడిసిపోయి, కొట్టుకుపోయింది. పెద్దపల్లి జిల్లాలో తీవ్రత ఎక్కువగా ఉండగా, రైతులు లబోదిబోమంటున్నారు. తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
పెద్దపల్లి/ పెద్దపల్లిరూరల్/ ఓదెల, మే14: అకాల వర్షాలు అన్నదాతకు కన్నీరు పెట్టిస్తున్నాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పంట అమ్ముకొనే దశలో అన్నదాతలను ఆగమాగం చేస్తున్నాయి. ఈ నెల 10న సాయంత్రం కురిసిన వానకు జరిగిన నష్టంతో తేరుకోకముందే తాజాగా మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారు జాము వరకు బలమైన ఈదురుగాలులుతో పడిన అకాల వర్షానికి తీవ్ర నష్టం జరిగింది. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో హాకా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో ధాన్యం తడిసిపోయింది. తీరని నష్టం జరిగింది. ఒక ఆధార్ కార్డుకు కేవలం 2 టార్ఫాలిల్ కవర్లు మాత్రమే ఇస్తున్నారని, వర్షానికి ధాన్యాన్ని కాపాడుకోవడం కష్టమైతున్నదని రైతులు వాపోతున్నారు. పెద్దపల్లి మండలంలో దాదాపు అన్ని గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. పలుచోట్ల నీటిలో కొట్టుకుపోగా రైతులు పోగుచేసుకుని కుప్పలు చేసే పనిలో నిమగ్నమయ్యారు.
ఇక ఆలస్యంగా వరి సాగు చేసిన అందుగులపల్లి, అప్పన్నపేట, హన్మంతునిపేట, పెద్దకల్వల, పెద్దబొంకూర్, చీకురాయి, భోజన్నపేట గ్రామాలలో కోతకు వచ్చిన పంట నేలవాలింది. ఈదురుగాలుల వర్షానికి జూలపల్లి మండలం అతలాకుతలమైంది మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కోనరావుపేటలో రోడ్డు కిరువైపులా ఉన్న చెట్లు గాలి వానకు విరిగిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయింది. కేంద్రాల్లో తూకం వేసి బస్తాల్లో నింపిన ధాన్యం తడిసిపోగా, రైతులదే బాధ్యత అంటూ నిర్వాహకులు తేల్చిచెప్పడంతో ఆందోళన పడుతున్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడిసిముద్దయింది. కాగా, జరిగిన నష్టాన్ని అధికారులు గుర్తించి పక్కా అంచనాలు తయారు చేసి పరిహారం అందేలా చూడాలని కోరుతున్నారు.
బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షానికి కరంట్ వైర్ తెగి గొర్రెల మంద చుట్టూ ఉన్న ఇనుప కంచెపై పడడంతో ఓదెల మండలం మడక గ్రామంలో 25గొర్రెలు మృతి చెందాయి. దాదాపు 5లక్షల వరకు నష్టం జరిగినట్లు గొర్రెల కాపరి వేల్పుల రాజకొమురయ్య తెలిపాడు. ఉపాధి లేక నిరాశ్రుడైన తన కుటుంబానికి ప్రభుత్వం ఆర్థికంగా సాయం అందించి ఆదుకోవాలని కోరుతున్నాడు.
ఎకర ముప్పై గుంటలలో వరి వేసిన. రెండు ట్రాక్టర్ల లోడ్ వడ్లు పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డుకు 15 రోజుల క్రితం తెచ్చిన. ప్రతి రోజూ ఆరబెట్టిన. 9న శుక్రవారం శనివారం మాయిశ్చర్ వచ్చింది. సాయంత్రం సంచులు ఇస్తామన్నారు. కానీ, సంచులు ఇవ్వలే. శనివారం సాయంత్రం వాన పడడంతో ధాన్యం పూర్తిగా తడిసింది. మళ్లీ ఆరబెట్టిన మాయిశ్చర్ కూడా వచ్చింది. కానీ, బుధవారం తెల్లవారు జామున పడిన వానకు ధాన్యం తడిసిపోయింది. రెండు సార్లు పడిన వానతో ధాన్యం కొంతమేరకు కొట్టకపోయింది. ఉన్న ధాన్యం తడిసిపోయింది. ఇలా ఎన్ని సార్లు ఆరబెట్టాలి. ఆకాల వర్షం.. సెంటర్ నిర్వాకుల నిర్లక్ష్యంతో కష్టం, నష్టం మిలిగింది.