కలెక్టరేట్, మార్చి 16 : నగర పరిసరాల్లో నివాసం ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పిస్తున్నది. హెచ్ఎండీఏ అనుమతితో అంగారిక టౌన్షిప్లో మూడో విడుత ప్లాట్లు వేలం వేసేందుకు యంత్రాంగం సన్నద్ధమవుతున్నది. నేటి నుంచి మూడు రోజుల పాటు ఈప్రక్రియ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో రెండు విడుతల్లో నిర్వహించిన వేలం పాటలకు అనూహ్య స్పందన లభించింది. 600కు పైగా ప్లాట్లు హాటుకేకుల్లా అమ్ముడుపోయాయి.
సాంకేతిక కారణాలతో కొన్ని మిగలగా, వాటిని కూడా కొనుగోలు చేసేందుకు అనేక మంది కలెక్టరేట్ చుట్టూ తిరిగిపోతున్నారు. మిగిలిన ప్లాట్లకు వేలం వేయాలంటూ పలువురు ప్రజావాణిలో వినతిపత్రాలు కూడా అందజేశారు. ప్రస్తుతం ఉన్న ధరలతో పోలిస్తే తక్కువ ధరలకు, నగరానికి కూతవేటు దూరంలోనే లభిస్తుండడంతో అనేక మంది అంగారిక టౌన్షిప్లో ప్లాట్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో మిగతా ప్లాట్లను కూడా విక్రయించేందుకు అధికారులు నిర్ణయించారు.
నగరంలోని వాసర గార్డెన్లో మూడు రోజులపాటు (శుక్ర, శని, ఆదివారం) నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు వేలం ప్రారంభమవుతుందని చెప్పారు. కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆధ్వర్యంలో నిర్వహించే వేలంపై ఇప్పటికే విస్తృతంగా ప్రచారం చేశారు. వేలం నిర్వహించే గార్డెన్లో హెల్ప్ డెస్క్‌లు, కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా, అప్రమత్తంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పోలీస్ బందోబస్తుతో పాటు పబ్లిక్ అడ్రస్ సిస్టం, ప్రొజెక్టర్లు, బ్యానర్లు చేశారు. సిబ్బంది ఉదయం 9 గంటలకే వాసర గార్డెన్‌కు చేరుకునేలా ఆదేశాలు జారీచేశారు.