Vemulawada | వేములవాడ, ఏప్రిల్ 2: వేములవాడ రాజన్న ఆలయంలోని పలు విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఆలయం నుండి నేరుగా వేతనాలు ఇవ్వాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు అజ్జువేణు, జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు కోరారు. వేములవాడ రాజన్న ఆలయ ఈవో రమాదేవికి గురువారం వినతి పత్రం అందజేసి మాట్లాడారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆలయంలోని పలు విభాగాల్లో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ పద్ధతిన ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు.
వీరికి నేరుగా వేతనాలు ఆలయం నుండే ఇవ్వాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని కోరారు. విధి నిర్వహణలో కార్మికుని ఏదైనా ప్రమాదం సంభవిస్తే బీమా సౌకర్యాన్ని కూడా కల్పించాలని కోరారు. సీనియార్టీని గుర్తించి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి అవసరమైన వారికి పదోన్నతులు కూడా కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ అనుబంధ రాజన్న ఆలయ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ సంఘం కార్యదర్శి కేతవ్వ, శంకరవ్వ, లక్ష్మి, దేవవ్వ తదితరులు పాల్గొన్నారు.