‘గ్రామానికో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తం. రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు చేస్తం’ అని ప్రభుత్వం గొప్పలు చెప్పినా.. ఆచరణలో మాత్రం పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉన్నది. ఉమ్మడి జిల్లాలో 1,330 కేంద్రాలు తెరవాలని లక్ష్యంగా పెట్టుకొని, ఎమ్మెల్యేలు, మంత్రులు అక్కడక్కడా ఈ కేంద్రాలను ప్రారంభించినా.. ఇంకా ఎక్కడా కొనుగోళ్లు మొదలు కానేలేదు. ఈ పరిస్థితుల్లో రైతులు ధాన్యం అమ్ముకునేందుకు దళారులు, వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఓ వైపు వర్షం పడుతుండడం, మరోవైపు కేంద్రాల్లో కొనకపోవడంతో అగ్గువసగ్గువకే అమ్ముకుంటున్నారు. అయితే అకాల వర్షాల కారణంగా తేమ శాతం అధికంగా ఉందని, కేంద్రాల్లో కొనుగోళ్లు జరపాలంటే మరో వారమైనా పడుతుందని అధికారులు చెబుతుండగా, ఆ మాత్రం దానికి ఇప్పుడే కొన్నట్టు కేంద్రాలను ప్రారంభించుడెందుకని ప్రశ్నిస్తున్నారు.
కరీంనగర్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ) : వానకాలం సీజన్ పూర్తయింది. కోతల ప్రక్రియ మొదలైంది. సాధారణంగా అక్టోబర్ రెండో వారంలో కొనుగోళ్లు ప్రారంభించాల్సి ఉన్నది. ఇప్పటి నుంచి వచ్చే జనవరి వరకు కొనుగోళ్లు జరిగినా.. ఈ నెలలో 20 నుంచి 25 శాతం కొనుగోళ్లు జరిగే అవకాశముంటుంది. ముందుగా వరి సాగు చేసిన రైతులు ఇప్పటికే కోతలు ప్రారంభించగా, అందుకనుగుణంగా అధికారులు కేంద్రాలు ప్రారంభించి కొనుగోళ్లకు సిద్ధంగా ఉండాలి. గడిచిన పదేళ్లుగా ఇదే ఆనవాయితీ కొనసాగుతున్నది. కానీ, ఈ సారి అంతా విరుద్ధంగా నడుస్తున్నది. కరీంనగర్లో 340, జగిత్యాలలో 421, పెద్దపల్లిలో 311, సిరిసిల్లలో 258 చొప్పున ఉమ్మడి జిల్లాలో మొత్తం 1,330 కేంద్రాలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకొని.. కొన్నింటిని ప్రారంభించినా దాదాపుగా ధాన్యం కొనుగోళ్లు ఎక్కడా జరగడం లేదు. కరీంనగర్ జిల్లాలో 44 కేంద్రాలు ఓపెన్ చేసినా.. ఒక్క కేంద్రంలోనూ కొనుగోలు చేయలేదు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా దాదాపు ఇలాంటే పరిస్థితి ఉండగా, కల్లాల వద్దనే దళారులు, వ్యాపారులు తక్కువ ధరకే అమ్ముకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ యేడాదికి కనీస మద్దతు ధర ఏ గ్రేడ్‌కు 2,320, సాధారణ రకానికి 2,300 నిర్ణయించింది కానీ, దళారులు మద్దతు ధరకు మంగళం పాడుతున్నారు. క్వింటాల్‌కు 1,800 నుంచి 1900 మాత్రమే చెల్లిస్తున్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి కనిపిస్తున్నది.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కేంద్రాలు తెరుస్తున్న అధికారులు కొనుగోళ్ల ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు. అకాల వర్షాల కారణంగా తేమ శాతం అధికంగా ఉంటున్నదని, నిబంధనల ప్రకారం 17 శాతం తేమ ఉంటేనే కొనుగోళ్లు చేస్తామని అధికారులు చెబుతున్నారు. కోతలు చేపట్టిన కొందరు రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని ఆరబెట్టుకుంటున్నారు. అకాల వర్షాల నుంచి దిగుబడిని రక్షించుకునేందుకు అక్కడే పడిగాపులు కాస్తున్నారు. ఓవైపు కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడం, మరోవైపు అకాల వర్షాలు పడుతుండడంతో ఆందోళన చెందుతున్నారు. కనీసం తెరిచిన కేంద్రాల్లోనైనా కొనుగోళ్లు జరిపితే తాము దళారులను ఆశ్రయించే పరిస్థితి ఉండదని చెబుతున్నారు. పరిస్థితి ఇలా ఉంటే అధికారులు మాత్రం, ప్రభుత్వ కేంద్రాల్లో కొనుగోళ్లు ప్రారంభించేందుకు మరో వారం పదిరోజులైనా పట్టవచ్చని నమ్మబలుకుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆది నుంచీ తమకు వ్యతిరేకంగా ఉందని రైతులు వాపోతున్నారు. కాంగ్రెస్ చెప్పినట్టు రైతులందరికీ రుణమాఫీ కాకపోవడం, వానకాలం సీజన్ దాటిపోయినా రైతు భరోసా ఇవ్వకపోవడం సర్కారు వైఫల్యమేనని విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ధాన్యం కొన్న తర్వాత డబ్బులు విడుదల చేయడంలో జాప్యం జరిగితే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా తమకు నమ్మకం కుదరడం లేదని చెబుతున్నారు. మరోవైపు అకాల వర్షాలతో ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లోనే దళారులు, వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా అనేక గ్రామాల్లో వ్యాపారులు కొనుగోళ్లకు ఎగబడుతున్నారు. తక్కువ ధరకే ధాన్యం దండుకుపోతున్నారు. ఇటు సన్నాల కొనుగోళ్లకు ప్రభుత్వం కొర్రీలు పెట్టడం, కేవలం 33 రకాలు మాత్రమే కొంటామని ప్రకటించడం, కేంద్రాల్లో మైక్రో మిషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పడంతో రైతులు అయోమయంలో పడ్డారు. ఈ విషయంపై నమ్మకం లేక సన్న రకాలను అగ్గువకే అమ్ముకుంటున్నారు.
మాది పెద్దూరు. నాకు మూడెకరాల పొలం ఉన్నది. సెంటర్‌కు వడ్లు తెచ్చి పన్నెండు రోజలైతంది. వానకు నానుతున్నవి. ఎండకు ఎండుతున్నయి. తడిసినప్పుడల్లా తిర్లమర్ల పోత్తున్నం. మాకు ఇంకో పనేలేదు. మబ్బుల పడుతున్నప్పుడల్లా జల్లుమంటంది. అక్కడక్కడ సెంటర్లు స్టార్ట్ చేసిన్రు. గింజలైతే కొంటలేరు. గీసర్కారొచ్చినంక పెట్టుబడికి పైసలే ఇయ్యలే. అక్కడక్కడ బాకీలు తెచ్చి లాగోడిపెట్టుకున్నం. ఇగ గింజలేమి కొంటుందో లేదో అర్థమయితలేదు. చాలా మంది రైతులు తుట్టికే దళారీలకు అమ్ముకుంటున్రు. మాపరిస్థితి ఏడికత్తదో
నాకున్న నాలుగెకరాల పొలంలో 110 క్వింటాళ్ల వడ్లు వచ్చినయి. క్వింటాల్‌కు 1900కు అమ్మిన. సర్కారు మద్దతు ధర 2320 ప్రకటించింది. ఇప్పటి వరకు గింజలు కొన్న దిక్కులేదు. ఎక్కడ పడితే అక్కడ సెంటర్లు చాలు జేసుకుంటూ పోతున్నరు. గింజలు తీస్కొని పోతే వానత్తే సౌలతు లేదు. కొనేదాక సెంటర్లలో నీలుగాలే. తాలంటరు. జాలి పట్టలేదంటరు. ఎండలేదంటరు. గిట్ల కొర్రీలు పెట్టి క్వింటాల్‌కు ఏడు కిలోలు తరుగు జోకుతరు. అందుకే నష్టమొచ్చినా ప్రైవేటోళ్లకు అమ్ముకుంటున్నం.
నాకు పది ఎకరాలున్నది. కేసీఆర్ సర్కారున్నప్పుడు ఎంటదెంట వడ్లను కొన్నది. అన్ని సీజన్లకు రైతు బంధు వేసిండు. కొత్త సర్కారు వచ్చినంక ఇయ్యలె. సెంటర్లనైతే చాలు జేసుకుంటూ పోతన్నరు. వడ్లను కొనలేదు. ఇప్పట్ల కొంటరన్న నమ్మకం లేదు. అందుకే మాపల్లెకొచ్చిన వ్యాపారులకు అమ్ముకోవాల్సి వచ్చింది. క్వింటాల్‌కు 1850కి వంద క్వింటాళ్లు అమ్మినా. ఇంకా అమ్మేటియి ఉన్నయి. అకాల వర్షాలు పడుతున్నయి. వడ్లు నానితే సెంటర్ల కొంటారా? కొన్నవాటికి పైసలు ఎప్పుడిత్తరో? అసలే వానలు పడి రంగు మారుతుంది.