వేములవాడ టౌన్, మే 9 : భారత సైన్యానికి సకలజనం సలాం కొడుతున్నది. పహల్గాం దురాగతానికి ప్రతీకారంగా పాకిస్థాన్‌పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయవంతంగా ముందుకుసాగుతుండడంపై హర్షం వ్యక్తం చేస్తున్నది. పాక్ దొంగచాటుగా చేస్తున్న దాడులను సమర్థవంతంగా ఎదుర్కొంటూ, ఆ దేశానికి చుక్కలు చూపిస్తుండడంతో గర్వపడుతున్నది. సైన్యానికి సంఘీభావంగా శుక్రవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు తీశారు. రాష్ట్ర దేవాదాయ శాఖ సూచన ల మేరకు అన్ని ఆలయాల్లో పూజలు చేశారు. వేములవాడ రాజన్న ఆలయంలో చండీ సహిత రుద్ర హోమం నిర్వహించా రు. భారత యుద్ధవీరులకు సంపూర్ణ విజయం కలుగాలని, భారత త్రివిధ దళాలు క్షేమంగా ఉండాలని కోరుకున్నారు.
సారంగాపూర్, మే 9 : పహల్గాం ఉగ్రదాడికి ప్రతి చర్యగా భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్‌కు సారంగాపూర్ మండలం పెంబట్ల, రంగపేట, లక్ష్మీదేవిపల్లి, బట్టపల్లి గ్రామాల్లో ఉపాధి కూలీలు మద్దతు పలికారు. శనివారం ‘హ్యాట్సాఫ్ సిందూర్’ అంటూ హర్షం వ్యక్తం చేశారు. ఉగ్రదాడిలో మరణించిన వారికి మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కోల జమున శ్రీనివాస్, మాజీ సర్పంచ్ బోడ్డుపెల్లి రాజన్న, విండో చైర్మన్ గురునాథం మాల్లారెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తేలు రాజు, నాయకుడు కోండ్ర రాంచంర్రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రామడుగు రవి, తదితరులు పాల్గొన్నారు.