ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. మంగళవారం యాజమాన్యానికి, ఆర్టీసీ యూనియన్ల మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. అర్ధరాత్రి నుంచే బస్సులు నిలిపివేసి సమ్మెకు వెళ్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ అన్ని డిపోల పరిధిలోని వివిధ యూనియన్లకు సమాచారం అందించింది. దీంతో మంగళవారం అర్ధరాత్రి నుంచి చివరి బస్సు డిపోకు చేర్చిన తర్వాత కార్మికులు సమ్మెకు దిగుతున్నారు.
కరీంనగర్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ)/ తెలంగాణ చౌక్ : గత కొంత కాలంగా తమ సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికులు ఇటు ప్రభుత్వం, అటు యాజమాన్యానికి విజ్ఞప్తులు చేస్తూ వస్తున్నారు. పలు సార్లు సమ్మెకు వెళ్తామని ఆర్టీసీ జేఏసీ నోటీసులు కూడా ఇవ్వగా, సమస్యలు పరిష్కరించేందుకు సమయం కావాలని యాజమాన్యం కోరుతూ వచ్చింది. కానీ, ఇప్పటి వరకు ఎలాంటి పరిష్కారం చూపక పోవడంతో ఇటీవల సమ్మె నోటీస్ ఇచ్చింది. డిపోల వారీగా సమ్మెకు సమాయత్తమవుతూ సభలు, సమావేశాలు నిర్వహించుకున్నారు. ఆర్టీసీ బస్టేషన్లు, డిపోలు, వర్క్‌షాపుల ఎదుట ధర్నాలు, నిరసనలు వ్యక్తం చేశారు.
అయినా, ఇటు ప్రభుత్వం, అటు యాజమాన్యం దిగి రాలేదు. 22న అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్లాలని నిర్ణయించడంతో జేఏసీతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. మంగళవారం ఆర్టీసీ జేఏసీ నాయకులతో ఆ కమిటీ చర్చలు జరిపింది. సమస్యలు పరిష్కరించేందుకు నాలుగు వారాల గడువు కావాలని కమిటీ కోరగా, అందుకు జేఏసీ నాయకులు అంగీకరించలేదు. దీంతో ఆర్టీసీ సమ్మె అనివార్యమైంది. మంగళవారం రాత్రి పొద్దు పోయే వరకు జరిగిన చర్చలు విఫలమైనట్లు, అర్ధరాత్రి నుంచి బస్సులు నిలిపి వేయాలని, మొదటి డ్యూటీ నుంచి సమ్మెకు వెళ్లాలని జేఏసీ నాయకులు ఆయా డిపోల పరిధిలోని యూనియన్ నాయకులకు సమాచారం అందించారు.
ఆర్టీసీ సమ్మె కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో తీవ్ర ప్రభావం చూపనుంది. రీజియన్ పరిధిలోని 11 డిపోల్లో 556 ఆర్టీసీ బస్సులు, 330 అద్దె బస్సులు 102 ఎలక్ట్రికల్ బస్సులు ఉన్నాయి. అందులో ఎలక్ట్రికల్ బస్సులు మినహా ఆర్టీసీ, అద్దె బస్సులకు సంబంధించిన 988 మంది డ్రైవర్లు, 989 మంది కండక్టర్లు సమ్మెలో ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు. ఆర్టీసీలో సమ్మె అనివార్యమైన నేపథ్యంలో డిపోల ఎదుట పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఆయా డిపోల మేనేజనర్లు పోలీసులకు సమాచారం అందించారు. బుధవారం ఉదయం 4 గంటల నుంచి ఆర్టీసీ కార్మికులు ప్రత్యక్ష ఆందోళనలకు దిగే అవకాశమున్నది.