ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలుచోట్ల గురువారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పిడుగుపాటుతో ఇద్దరు మృత్యువాత పడడం విషాదం నింపింది. చాలాచోట్ల కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది. రోడ్లపై భారీ వృక్షాలు కూలడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సిరిసిల్ల పట్టణంతోపాటు తంగళ్లపల్లి, వేములవాడ రూరల్ మండలాల్లో భారీ వర్షం పడింది. సిరిసిల్లలలో ఈదురుగాలులకు చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్ తీగలపై పడి విద్యుత్ సరఫరా నిలిచి పోయింది. తిమ్మాపూర్ మండలంలో సుమారు గంటపాటు ఉరుములు, మెరుపులు, పిడుగులతో భారీ వర్షం పడింది.
– రాజన్న సిరిసిల్ల, మే 16 (నమస్తే తెలంగాణ)/తిమ్మాపూర్‌రూరల్/ కరీంనగర్‌రూరల్
అకాల వర్షంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి రైతులు ఆగమయ్యారు. ఆరబోసిన ధాన్యంపై కవర్లు కప్పే ప్రయత్నంలోనే తడువడంతో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. టార్పాలిన్లు కప్పినా గాలులకు కొట్టుకు పోవడంతో అవస్థలు పడ్డారు. ముఖ్యంగా కరీంనగర్, తిమ్మాపూర్, తంగళ్లపల్లి, వేములవాడ, బోయినపల్లి మండలాల్లో వర్షం కురవగా కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసింది.
గాలి బీభత్సానికి జగిత్యాల రూరల్ మండలంలోని చలిగల్, మోరపల్లి గ్రామాల మధ్యలో ప్రధాన రహదారిపై భారీ వృక్షం విరిగి పడ్డది. బోయినపల్లి మండలకేంద్రం నుంచి దేశాయిపల్లి మీదుగా కొదురుపాక వెళ్లే ప్రధాన రహదారిలోని రోడ్డు పక్కన ఉన్న చెట్లు కూలి పోగా, చెట్ల కొమ్మలు విరిగి రహదారిపై పడడంతో రాక పోకలు నిలిచి పోయాయి. మర్లపేట – తడగొండ రహదారిలో చెట్లు విరిగి పడ్డాయి.
తంగళ్లపల్లి మండలం ఇందిరనగర్ పరిధిలోని భరత్‌నగర్‌కు చెందిన రైతు రుద్రారపు చంద్రయ్య(50) గురువారం సాయంత్రం పొలం పనులు చేస్తుండగా ఒక్కసారిగా ఉరుములు,మెరుపులతో వర్షం పstormడింది. ఈ క్రమంలో చంద్రయ్యపై ఒక్కసారిగా పిడుగుపడడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. చంద్రయ్యకు భార్య కళావతి, ముగ్గురు కూతుళ్లు కొడుకు ఉన్నారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని శాత్రాజుపల్లికి చెందిన కంబల్ల శ్రీనివాస్ (31), తండ్రి ఎల్లయ్య, తల్లి లచ్చవ్వ తమ వ్యవసాయ పొలం వద్ద చింతకాయలు తెంపుతుండగా వర్షం పడింది. దీంతో శ్రీనివాస్, ఎల్లయ్య, లచ్చవ్వతోపాటు రేగుల శ్రీనివాస్, దేవయ్య చింతచెట్టుకింద ఉన్నారు. ఈ సమయంలో ఒక్కసారిగా పిడుగు పడి శ్రీనివాస్ అక్కడికక్కడే మృతిచెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వేములవాడ ఏరియా దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. శ్రీనివాస్‌కు భార్య, కూతురు ఉన్నారు. తిమ్మాపూర్ మండలంలోని పర్లపల్లిలోని ఏనుగుల మల్లయ్యకు చెందిన ఆవు, దూడ పిడుగుపాటుకు మృతి చెందింది. సుల్తానాబాద్ మండలంలోని కాట్నపల్లిలో పిడుగు పడడంతో శ్రీనివాస్‌కు చెందిన పాలిచ్చే బర్రె మృతి చెందింది.