పేదల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర సర్కారు ఆరోగ్యశ్రీని పకడ్బందీగా అమలు చేస్తున్నది. వైద్యసేవల ఖర్చును 2లక్షల నుంచి 5 లక్షలకు పెంచడంతోపాటు ఇప్పటిదాకా ఉన్న పాత కార్డుల స్థానంలో కొత్తగా డిజిటల్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ కొత్త పథకం వర్తించాలంటే అర్హత ఉన్న ప్రతి కుటుంబం ఈ-కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని గత నెలలోనే స్పష్టం చేసింది. అంతేకాదు, ప్రతి పంచాయతీ పరిధిలోని కామన్ సర్వీస్ సెంటర్ (సీఎస్సీ)లో ఉచిత నమోదుకు అవకాశం ఇచ్చింది. ఈ ప్రక్రియ ఆగస్టులోనే ప్రారంభమైనా.. నమోదులో ఉమ్మడి జిల్లా వెనుకబడిపోయింది. చాలా మందికి అవగాహన లేక ఇప్పటివరకు 42 శాతం మాత్రమే పూర్తి కాగా, ఈ నెల 30వ తేదీ వరకు కచ్చితంగా చేయించుకోవాలని యంత్రాంగం స్పష్టం చేస్తున్నది. రేషన్‌కార్డుతోపాటు ఆధార్, దానికి లింకైన మొబైల్, అలాగే సదరు కుటుంబ సభ్యులందరూ విధిగా సీఎస్సీ కేంద్రానికి వెళ్లి ఈ-కేవైసీ చేయించుకోవాలని చెబుతున్నది. లేదంటే అసలుకే ఎసరు వచ్చే ప్రమాదమున్నది.
– కరీంనగర్, సెప్టెంబర్ 7(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
కరీంనగర్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారి ఆరోగ్య సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం అమలు చేస్తున్నది. దీని ద్వారా బీపీఎల్ కుటుంబాలకు కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తున్నది. ఈ పథకం కింద దాదాపు 1672 వ్యాధులను కవర్ చేస్తున్నది. ఈ పథకం కింద ఇన్నాళ్లూ 2 లక్షల దాకా పేమెంట్ చేస్తున్న ప్రభుత్వం తాజాగా 5 లక్షలకు పెంచింది. ప్రస్తుతం ఆరోగ్య శ్రీద్వారా రాష్ట్రంలో 90 లక్షలపై చిలుకు కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. కాగా, ఇటీవల ‘ఆయుష్మాన్ భారత్’ను అమల్లోకి తెచ్చిన కేంద్రం, ఈ పథకం కింద 5 లక్షల దాకా ఉచిత వైద్యసేవలను అందిస్తామని చెప్పింది. ‘ఆరోగ్య శ్రీ’కి వర్తిస్తున్న అన్ని కుటుంబాలకూ ఆయుష్మాన్ భారత్‌ను వర్తింపజేస్తామని ముందుగా ప్రగల్భాలు పలికింది. కానీ, కేవలం 30 వేల కుటుంబాలకు మాత్రమే వర్తింప చేసింది. దీంతో మిగిలిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారే ప్రమాదం ఏర్పడింది. ఈ నేపథ్యంలో పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకున్న సీఎం కేసీఆర్, ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలను 2 లక్షల నుంచి 5 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే ఆర్థిక మంత్రి హరీశ్‌రావు వెల్లడించడంతోపాటు అందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఇచ్చారు. ఆయుష్మాన్ భారత్ పథకం కొంత మందికి మాత్రమే వర్తిస్తుండగా, బీపీఎల్ కుటుంబాలన్నింటికీ కొత్త ఆరోగ్యశ్రీని వర్తింపచేసి, 5 లక్షల విలువైన వైద్య సేవలు అందించాలని నిర్ణయించారు.
కొత్తగా డిజిటల్కార్డులు
ఆరోగ్య శ్రీ కింద వైద్య సేవలను ఖర్చులను 2 నుంచి 5 లక్షలకు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం ఈ సేవలను వర్తింపజేయడానికి డిజిటల్ కార్డులను ఇవ్వాలని నిర్ణయించింది. అందుకోసం ప్రస్తుతం ఆరోగ్య శ్రీ కింద లబ్ధిపొందిన ప్రతి కుటుంబం ఈ-కేవైసీ చేయించుకోవాలని ఆదేశించింది. అందుకు కావాల్సిన సౌకర్యాలను కూడా ప్రజలకు అందుబాటులోనే ఉంచింది. దాదాపు ప్రతి పంచాయతీ పరిధిలో ఉన్న కామన్ సర్వీస్ సెంటర్ (సీఎస్సీ)లో ఈ-కేవైసీ చేసుకోవడానికి అనుమతినిచ్చింది. అందుకోసం ప్రత్యేక సాప్ట్‌వేర్‌ను అమలు చేస్తున్నది. అందులో భాగంగానే ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కలిగి ఉన్న ప్రతి కుటుంబం, తమ రేషన్‌కార్డుతోపాటు ఆధార్, దానికి లింకైన మొబైల్, అలాగే సదరు కుటుంబ సభ్యులందరూ, విధిగా సీఎస్సీ కేంద్రానికి వెళ్లి ఈ కేవైసీ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను గత ఆగస్టు నుంచే ప్రారంభించిన ప్రభుత్వం, ఈ నెల 30తో ముగించాలని నిర్ణయించింది. కరీంనగర్ జిల్లాలో కామన్ సర్వీస్ సెంటర్లు 441 పనిచేస్తున్నాయి. అలాగే పెద్దపల్లి జిల్లాలో 200, జగిత్యాలలో 400, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 200కుపైగా కేంద్రాలు పని చేస్తున్నాయి. ఈ-కేవైసీ కోసం సంబంధిత సీఎస్సీ కేంద్రానికి వెళ్తే అక్కడ ఉండే వీఎల్ఈఎస్లు ఉచితంగా చేస్తారు. ఈ కేవైసీ చేసినందుకు ప్రభుత్వమే సదరు వీఎల్ఇఎస్లకు పేమెంట్ చేస్తుంది.
అప్రమత్తమైతేనే..
నిజానికి ప్రస్తుతం అరోగ్యశ్రీ కింద లబ్ధి పొందుతున్న ప్రతి కుటుంబానికి కొత్త ఆరోగ్యశ్రీ పథకం వర్తించాలంటే విధిగా ఈ-కేవైసీ చేయించుకోవాలి. అందుకోసం విధిగా కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా అసలుకే ఎసరు వచ్చే ప్రమాదమున్నది. అయితే దీనిపై సరైన అవగాహన లేకపోవడంపాటు ఈకేవైసీ పూర్తి స్థాయిలో చేయించుకోలేకపోతున్నారు. నిజానికి చాలా మంది ఆయుష్మాన్ భారత్ తమకు వర్తిస్తుందన్న భావనలో ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో పది లక్షలకుపైగా కుటుంబాలు ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కింద లబ్ధిపొందుతున్నాయి. కానీ, అందులో ఇప్పటివరకు కేవలం 42 శాతం మంది మాత్రమే ఈకేవైసీ చేయించుకున్నారు. మిగిలిన మెజార్టీ కుటుంబాలు చేయించుకోవాల్సి ఉంది. ప్రజలు అప్రమత్తమైతేనే ఆరోగ్యశ్రీ వర్తిస్తుందన్న విషయాన్ని అర్హులైన కుటుంబాలు గుర్తించాల్సిన అవసరమున్నది.
ఆరోగ్యశ్రీ సద్వినియోగం చేసుకోవాలి
పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొన్ని రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఆరోగ్యశ్రీ పథకం కింద డిజిటల్ కార్డులను ఇవ్వనున్నది. అందుకోసం అర్హత ఉన్న ప్రతి కుటుంబం విధిగా ఈకేవైసీ చేయించుకోవాలి. ప్రభుత్వం ఆరోగ్య కింద ప్రస్తుతమున్న 2 లక్షలను 5లక్షలకు పెంచింది. దీని ద్వారా మెరుగైన వైద్య సౌకర్యం పొందవచ్చు. అయితే రేషన్‌కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ ఈ కేవైసీ చేయించుకున్నప్పుడు మాత్రమే ఇది వర్తిస్తుంది. మీ దగ్గరలోని కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి, అక్కడ రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు, ఆధార్‌తో లింకైన మొబైల్ నంబర్ ఫోన్ తీసుకెళ్లాలి. ఈ కేవైసీ పూర్తయిన వారికి త్వరలోనే ప్రభుత్వం డిజిటల్కార్డులు ఇస్తుంది. ఈ నెల 30వరకు మాత్రమే గడువు ఉన్నందున ఇప్పటివరకు నమోదు చేసుకోని వారు వెంటనే ప్రక్రియ ప్రారంభించాలి. ఒక వేళ ఆయుష్మాన్ భారత్కింద నమోదై ఉంటే ఈ కేవైసీ చేసేటప్పుడు ఇప్పటికే రిజిస్టర్ అయినట్లుగా సూచిస్తున్నది. అటువంటి వారు ఆరోగ్యశ్రీ కింద నమోదు చేసుకోవద్దు.
– శ్రీధర్, డిస్ట్రిక్ కోఆర్డినేటర్, మేనేజర్ (కరీంనగర్)