కరీంనగర్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ విద్యానగర్ : యూరియా కొరతపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం ఒకే వేదికగా భిన్నభిప్రాయాలు వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మూడు లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను రాష్ట్ర ప్రభుత్వం బ్లాక్ చేయడం వల్లే యూరియా ఇబ్బందులు ఏర్పడుతున్నాయని బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనని స్పష్టం చేశారు.
ఆ యూరియా ఏమైందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. కేంద్రం సరఫరా చేయకపోవడం వల్లే యూరియా ఇబ్బంది ఏర్పడుతున్నదని పేర్కొన్నారు. ఒకే ప్రాంగణంలో ఇద్దరు వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తం చేయగా, అందులో ఏది వాస్తవం? ఏది అవాస్తవం? అన్న చర్చ నడుస్తున్నది. కరీంనగర్లో కొత్తగా ఏర్పాటు చేసిన పాస్‌పోర్టు కార్యాలయాన్ని సోమవారం బండి సంజయ్, పొన్నం ప్రభాకర్ కలిసి ప్రారంభించారు.
ఆ తర్వాత అక్కడికి వచ్చిన విలేకరులతో ముందుగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడి వెళ్లగా, అనంతరం బండి సంజయ్ వచ్చి మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పడిన యూరియా కొరతకు కేంద్రమే కారణమని పొన్నం చెప్పగా.. రాష్ట్ర ప్రభుత్వ అంచనాలకు మించి కేంద్రం యూరియా ఇచ్చిందని, అయితే, దాదాపు మూడు లక్షల మెట్రిక్‌టన్నులను రాష్ట్ర ప్రభుత్వం బ్లాక్ చేయడం వల్లే ఈ సమస్య ఏర్పడిందని సంజయ్ ఆరోపణలు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశమవుతున్నది.
ఎరువుల పంపిణీ బాధ్యత కేంద్రానిదే : పొన్నం ప్రభాకర్
ఎరువుల తయారీ, పంపిణీ అంతా కేంద్రం చేస్తది. మీకు (బీఆర్ఎస్)కు చిత్తశుద్ధి ఉంటే రండి! అందరం కలిసిపోయి బీజేపీ నాయకత్వాన్ని అడుగుదాం. ఇప్పటికే ముఖ్యమంత్రి, పార్లమెంట్ సభ్యులు, సంబంధిత మంత్రి కేంద్రానికి అనేకసార్లు విజ్ఞప్తి చేశారు. ఇందులో ప్రధాన దోషి బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే రైతులను ప్యానిక్ చేసి కృత్రిమంగా చెప్పులు పెట్టడం, ఎరువులు దొరుకతలేవు దొరుకతలేవు అంటూ ‘నమస్తే తెలంగాణ’ పత్రిక లేదా వాళ్ల నాయకత్వం ఉద్దేశపూర్వకంగా ఒక ప్రణాళిక ప్రకారం చేసిందే తప్ప ఇంకోటి కాదు. ఎరువుల కొరత దేశం మొత్తం మీద ఉన్నది.
ఎరువుల తయారీ పూర్తిగా కేంద్రానిదే బాధ్యత. వారు ప్రయత్నం చేస్తున్నా ఇతర దేశాలనుంచి కావచ్చు! లేదా ఇతర కారాణాలు కావచ్చు! ఎరువుల సరఫరా ఇబ్బంది ఉన్నది. వాస్తవాలను ఒప్పుకునే ప్రయత్నం చేయాలి. భారతీయ జనతా పార్టీని మరోసారి కోరుతున్నా. తప్పకుండా ఎరువుల సరఫరాకు సంబంధించి ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి (బండి సంజయ్‌ను) ప్రత్యేకంగా కోరాం. ప్రత్యేక చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
ఆ యూరియా ఏమైంది?: బండి సంజయ్
రబీ సీజన్లో 12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేంద్రం, తెలంగాణ రాష్ర్టానికి పంపింది. రబీ సీజన్లో ఎంత యూరియా అవసరమని కేంద్రం అడిగితే.. 9 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే అవసరమని చెప్పింది. ఇప్పుడు అదనంగా పంపిన ఆ మూడు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఏమైంది? సరే ఓ లక్ష మెట్రిక్ టన్నుల యూరియా అటు ఇటు పోయింది అనుకుందాం. మిగిలిన రెండు లక్షల మెట్రిక్ టన్నులు ఏమైంది? ఈరోజు రైతుల చేతుల్లోకి వెళ్లాల్సిన యూరి యా ఎమ్మెల్యేలు గన్మెన్లతో ట్రక్కులకు ట్రక్కులు.. టిప్పర్లకు టిప్పర్లు.. లారీలకు లారీలు పక్కదారి పట్టిస్తున్నారు.
అది విడిచి పెట్టి కేంద్రాన్ని ఏ విధంగా విమర్శిస్తారో చెప్పాలి. మోదీ ప్రభుత్వం ఏర్పడిన పదకొండేళ్ల వ్యవధిలో ఏ ఒక్క రోజు కూడా యూరియా కొరత రాలేదు. ఇప్పుడే కొరత ఎందుకు వచ్చింది? యూరియాను బ్లాక్‌కు ఎందుకు తరలిస్తున్నారు? చెప్పులు పెట్టి క్యూలో రైతులు నిల్చునే దుస్థితి ఎందుకు వచ్చింది? రైతులు, ప్రజలకు అన్ని విషయాలు తెలుసు! ప్రధానంగా రాష్ట ప్రభుత్వం తప్పిదం ఉందని ప్రజలకు తెలుసు! నిన్న మిర్యాలగూడలో బ్లాక్ మార్కెట్లో ఒక లోడ్ యూరియా దొరికింది.
నిజానికి పట్టుబడింది ఒక లోడ్ మాత్రమే. ఇంకా దొరకని లోడ్స్ ఎన్ని? కేంద్రం అడుగుతున్నది ఇదే! 12 లక్షల మెట్రిక్‌టన్నుల యూరియా ఇస్తే ఎక్కడికిపోయిందని అడుగుతున్నది. యూరియా బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నది. రైతులు ఇబ్బంది పడుతుంటే ఈ సమస్యను ఎందుకు పరిష్కరించలేక పోతున్నది? రాష్ట్ర ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలి. ప్రభుత్వం బ్లాక్ చేయడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది.