కరీంనగర్, జనవరి 6 (నమస్తే తెలంగాణ)/ కలెక్టరేట్: కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో 29.99 లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది. గతేడాది అక్టోబర్ 29 నుంచి ఓటరు జాబితా సవరణ చేపట్టి, సోమవారం తుది జాబితాను విడుదల చేసింది. కరీంనగర్ జిల్లాలోని 12 నియోజకవర్గాల పరిధిలోని ఓటర్ల జాబితా సవరించిన తర్వాత నాలుగు నియోజకవర్గాల్లో 10,83,365 మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుషులు 5,30,337 మంది, 5,52,353 మంది మహిళలు, 61 మంది ట్రాన్స్జెండర్స్, 614 మంది సర్వీసు ఓటర్లు ఉన్నారు. జగిత్యాల జిల్లాలో 7,20,825 మంది ఓటర్లు ఉండగా, అందులో 3,45,819 మంది పురుషులు, 3,74,712 మంది మహిళలు, 35 మంది ట్రాన్స్జెండర్స్, 259 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారు.
పెద్దపల్లి జిల్లాలో మొత్తం ఓటర్లు 7,18,042 మంది ఉండగా, 3,53,732 మంది పురుషులు, 3,63,607 మంది మహిళలు, 51 మంది ట్రాన్స్జెండర్స్, 653 మంది సర్వీసు ఓటర్లు ఉన్నారు. సిరిసిల్ల జిల్లాలో 4,76,604 మంది ఉండగా, అందులో 2,29,352 మంది పురుషులు, 2,47,046 మంది మహిళలు, 37 మంది ట్రాన్స్జెండర్లు, 169 మంది సర్వీసు ఓటర్లు ఉన్నారు. మొత్తంగా సిద్దిపేట జిల్లా పరిధిలోని హుస్నాబాద్ నియోజకవర్గంలోని చిగురుమామిడి, సైదాపూర్ మండలాలను మినహాయిస్తే ఉమ్మడి జిల్లాలో 29,99,006 మంది ఓటర్లు ఉన్నారు. ఇక హుస్నాబాద్ నియోజకవర్గంలో 2,51,150 మంది ఓటర్లు ఉండగా, అందులో 1,23,083 మంది పురుషులు, 1,27,837 మంది మహిళలు, ఆరుగురు ట్రాన్స్జెండర్స్, 224 మంది సర్వీసు ఓటర్లు ఉన్నారు.