అభివృద్ధి, సంక్షేమంలో ఆదర్శంగా నిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఎప్పటికప్పుడు సకల జనులకు మేలు చేసేలా సరికొత్త పథకాలను తీసుకొస్తున్నది. ఒకటి కాదు.. రెండు కాదు, లెక్కకు మించిన స్కీంలతో ఇంటింటికీ ఫలాలను అందిస్తూ, అండగా నిలుస్తున్నది. ఎక్కడ చూసినా లబ్ధిదారులే కనిపిస్తుండగా, రోజురోజుకూ ప్రజాహితమే లక్ష్యంగా జోరు పెంచుతున్నది. లక్షలోపు పంట రుణమాఫీ, బీసీ కులవృత్తులతోపాటు మైనార్టీలకు రూ.లక్ష సాయం, దివ్యాంగుల పెన్షన్ పెంపు, గృహలక్ష్మి అర్హుల ఎంపిక, ఆసరా పింఛన్ల బదిలీ, రెండో విడుత గొర్రెల పంపిణీ, దళితబంధు.. ఇలా ఎన్నో పథకాలతో దూసుకెళ్తుండగా, ప్రతిపక్షాలు బేజారవుతున్నాయి. ప్రజల వద్దకు వెళ్తే ఏం చెప్పాలో తెలియక ఠారెత్తిపోతున్నాయి. అంతేకాదు, ఎజెండా తయారు చేసుకునేందుకు అంశమే లేక అయోమయం చెందుతున్నాయి. నిజానికి సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలపై కాంగ్రెస్, బీజేపీలో చర్చ నడువడమే కాదు, ఆ పథకాల అమలులో తమ పార్టీలు గాలికి కొట్టుకుపోవడం ఖాయమన్న అభిప్రాయాలను వారి నాయకుల ముందే ఆ పార్టీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి. దీంతో ప్రధాన పార్టీలు అని చెప్పుకునే పార్టీల నాయకులు పోటీ చేసేందుకు జంకుతున్నట్లు తెలుస్తున్నది.
కరీంనగర్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో రాష్ట్ర సర్కారు ఆది నుంచీ సకలజనుల సంక్షేమమే లక్ష్యంగా ముందుకెళ్తున్నది. ఇటీవల రూ.లక్ష లోపు పంట రుణాలను మాఫీ చేయడమే కాదు, సబ్బండ వర్గాల కోసం అనేక పథకాలు తెస్తూ లబ్ధి కల్పిస్తున్నది. అయితే, ఏ పథకం ప్రవేశపెట్టినా.. అది ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే అంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో సర్కారు మాత్రం ప్రజాహితమే ధ్యేయంగా దూసుకెళ్తున్నది.
అంతేకాదు, ప్రస్తుతం అమలు చేయాల్సిన పథకాలు, అర్హుల గుర్తింపు, వెనువెంటనే లబ్ధి కల్పనకు తీసుకోవాల్సిన చర్యలపై తాజాగా, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సైతం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. దీంతో జిల్లాల వారీగా అధికారులు పథకాల అమలుపై మరింత ఫోకస్ పెట్టారు. మరోవైపు రెగ్యులర్ కార్యక్రమాలను యధావిధిగా కొనసాగిస్తూనే ఉన్నారు. వృద్ధాప్య ఆసరా పింఛన్‌దారులు మరణించిన పక్షంలో వారి భాగస్వామికి పెన్షన్ బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.
క్షేత్రస్థాయిలో పెండింగ్‌లో ఉన్న ఆసరా పింఛన్ దరఖాస్తులను పరిష్కరించి వెనువెంటనే మంజూరు చేసేందుకు ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని సగానికిపైగా పూర్తిచేసిన అధికారులు, ఒకటి రెండు రోజుల్లో పూర్తి చేయడానికి కసరత్తు చేస్తున్నారు. రెండో విడుత గొర్రెల పంపిణీ లక్ష్యాన్ని వారంలో పూర్తి చేయనున్నారు. అందుకోసం అన్ని జిల్లాల్లోనూ అదనపు బృందాలను ఏర్పాటు చేశారు. గతంలో మొదటి విడుత గొర్రెల పంపిణీ కింద పెద్దపల్లి జిల్లాలో 10,204, కరీంనగర్లో 14,761, జగిత్యాలలో 17,450 రాజన్న సిరిసిల్లో 16,162 యూనిట్లు పంపిణీ చేశారు.
ఈసారి ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా చర్యలు తీసుకుంటున్నారు. రెండో విడుత మరింత మందికి లబ్ధి కల్పించనున్నారు. కులవృత్తులకు పునర్జీవం పోయడంలో భాగంగా బీసీల్లోని కులవృత్తుల వారికి లక్ష చొప్పున సాయం చేస్తుండగా, మొదటి విడుతలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 300 మందికి లబ్ధి కల్పించాలని నిర్ణయించారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో 3,233 మందికి చెక్కులు పంపిణీ చేశారు. అందులో ఒక్క కరీంనగర్‌లోనే 1700 మందికి లబ్ధి కల్పించారు. రెండో విడుత కింద జాబితాల తయారీపై దృష్టిపెట్టారు. అలాగే, మైనార్టీలకు లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నారు.
మరోవైపు గృహలక్ష్మి పథకం కింద సాయం అందించేందుకు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షలకు పైగా దరఖాస్తుల ధ్రువీకరణ పూర్తయిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వెల్లడించడం, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అసెంబ్లీ నియోజకవర్గానికి 3 వేల మంది అర్హులను ఎంపిక చేసి, జిల్లా ఇన్చార్జి మంత్రి ఆమోదం తీసుకొని మంజూరు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడంతో ఈ ప్రక్రియను వేగవంతం చేశారు. అందుకు సంబంధించి ఆన్లైన్ యాప్‌లో వివరాల నమోదు ప్రక్రియను వారంలో పూర్తి చేయనున్నారు. తద్వారా మొదటి విడుత కింద ఉమ్మడి జిల్లాలో 36 వేల మంది గృహలక్ష్మి పథకం కింద లబ్ధి పొందనున్నారు.
దళితబంధు రెండో విడుత అమలు ప్రక్రియ కొనసాగుతున్నది. మొదటి విడుత హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకున్న ప్రభుత్వం, అక్కడ 18 వేల పైచిలుకు లబ్ధిదారులకు పది లక్షల చొప్పున నిధులు ఇచ్చి యూనిట్లను గ్రౌడింగ్ చేసింది. వాటిని నిత్యం పర్యవేక్షిస్తూ, విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఆ తర్వాత అన్ని అసెంబ్లీ నియోజవకవర్గాల్లో వంద మంది చొప్పున ఎంపిక చేసి, ఆర్థికసాయం అందించారు. రెండో విడుతగా ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌కు 1100 చొప్పున యూనిట్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం అనుమతించిన విషయం తెలిసిందే. ఈ ప్రక్రియ నడుస్తున్నది. ఒకవైపు పథకాల అమలు జోరు కొనసాగుతుండగానే.. వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగాలకు వేతనాలు పెంచుతూ వస్తున్నది. తాజాగా, ఉపాధ్యాయ బదిలీలకు కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
ప్రతిపక్షాల బేజారు
సంక్షేమ రంగంలో దేశానికి అదర్శంగా నిలుస్తున్న తెలంగాణ, అదే స్పీడ్‌తో దూసుకెళ్తున్నది. ‘సంపద సృష్టిస్తం. వాటిని అర్హులైన పేదలకు అందిస్తం’ అంటూ సీఎం కేసీఆర్ గతంలో చెప్పిన మాటలు.. అక్షర సత్యాలై ప్రజల ముందు సాక్షాత్కరిస్తున్నాయి. దీంతో ప్రతిపక్షాలు బేజారవుతున్నాయి. బీఆర్ఎస్ జోరును చూసి ప్రతిపక్షాలు నోరు మెదుపలేని పరిస్థితికి చేరుకున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. ప్రజల్లోకి వెళ్లి చెప్పడానికి తమకు ఎజెండానే లేకుండా పోయిందన్న చర్చ ప్రతిపక్ష పార్టీల్లో జరుగుతున్నది. అందులో ముఖ్యంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా విషయానికి వస్తే.. నాటి సమైక్యరాష్ట్రంలో కరువుతో అల్లాడిన అనేక మెట్ట ప్రాంతాలు నేడు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. నలువైపులా జలధారలతో ఉమ్మ డి జిల్లా స్వరూపమే మారిపోయింది.
ఉమ్మడి జిల్లా లో 14,54,569 ఎకరాల భూమి సాగుకు అనువుగా ఉన్నా 2014 వరకు 6.65 లక్షల (45.73 శాతం) మాత్రమే సాగైంది. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత జరిగిన సాగు నీటిరంగ అభివృద్ధి, కాళేశ్వరం జలాలు రావడం వల్ల కొత్తగా 7,27,968 ఎకరాల భూమి సాగులోకి వచ్చింది. స్వరాష్ట్రంలో 137 శాతం పెరిగింది. ఇక్కడ చెప్పడానికి ప్రతిపక్షాలకు ఒక్క అవకాశం లేదు. ఇదిపోగా, రైతుబంధు, రుణమాఫీ, రైతు బీమా, ఉచిత విద్యుత్ ఇలా ఏ కోణంలో చూసినా ప్రతిపక్షాలకు రైతుల గురించి మాట్లాడే అంశమే లేకుండా చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. పథకాల విషయంలో చూస్తే.. ఒకవైపు సాముహికంగా లబ్ధి కల్పించే పథకాలు, మరోవైపు వ్యక్తిగతంగా లబ్ధిచేకూర్చే పథకాలు అమలవుతున్నాయి.
ఇంకోవైపు ప్రభుత్వం ఫ్రెండ్లీ గవర్నమెంట్ పేరిట ఉద్యోగులతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నది. ఇలా ప్రతి రంగంలో తమకంటూ ప్రత్యేక ముద్రను వేస్తుండగా.. ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. యువతీ యువకుల పరంగా చూస్తే.. హైదరాబాద్‌ను ఐటీ హబ్‌గా మార్చి లక్షలాది మందికి సొంత గడ్డపై ఉద్యోగం చేసుకునే అవకాశం కల్పిస్తున్నది. మరోవైపు వివిధ విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి ఇప్పటికే వేలాది పోస్టులకు నోటిఫికేషన్ జారీచేసింది. కొన్నింటినీ భర్తీ చేసింది. ఇంకా కొన్ని నోటిఫికేషన్లు జారీ చేస్తున్నారు. తాజాగా, గురుకుల ఉపాధ్యాయులు, డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయల నియామకాలకు అడుగులు వేస్తున్నది. ఇలా ఏ కోణంలోచూసినా బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు దూసుకెళ్తుండడంతో ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు నాయకులు, వివిధ నియోజకవర్గాల్లో పోటీ చే యాలా? వద్దా? అన్న మీమాంసలో కొట్టు మిట్టాడుతున్నట్లుగా ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి.