NPDCL CMD Karnati Varun Reddy | వేములవాడ, ఏప్రిల్ 5 : సిరిసిల్ల సహకార విద్యుత్ సంస్థ లైసెన్స్ రెన్యువల్ కానందున మాకు బాధ్యతలు అప్పగించినందున క్షేత్రస్థాయిలో ఐదు రోజులుగా నాణ్యమైన విద్యుత్ సేవలు అందిస్తున్నామని ఎన్పీడీసీఎల్ సీఎండి కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. ఆయన వేములవాడ భీమేశ్వర స్వామిని ఆదివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చెక్కపల్లి రోడ్డులోని విద్యుత్ సబ్ స్టేషన్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిరిసిల్ల సహకార విద్యుత్ సంస్థ విద్యుత్ సరఫరాకు లైసెన్స్ పునరుద్ధరణ కాకపోవడంతో మాకు బాధ్యతలు అప్పగించారని తెలిపారు.
వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సేవలందించడమే ప్రధాన ఉద్దేశమని, గడచిన ఐదు రోజులుగా క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది వినియోగదారుల వద్దకు వెళ్లి మంచి సేవలను అందిస్తున్నారని తెలిపారు. జిల్లాలో గడిచిన ఐదు రోజులలోనే 250 విద్యుత్ వ్యవసాయ అవసరాలకు మంజూరు చేశామని చెప్పారు. సెస్ గడిచిన ఏడాదిలో 1400 ఇస్తే మరో 2500 వరకు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. మిగిలిన వాటిని ఎక్స్ ప్రెస్ డ్రైవ్ ను చేపట్టి ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళ్తామన్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న సిరిసిల్ల మగ్గాల కార్మికులకు విద్యుత్ బిల్లుల సమస్యను పరిష్కరిస్తున్నామని చెప్పారు.
కేటగిరి మూడు కింద బిల్లింగ్ అవుతున్న దానిని, 4ఏ కిందకు మార్చుతున్నామని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని రైతుల విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు పొలంబాట కూడా నిర్వహించామని తెలిపారు. సమస్యలను గుర్తించి ఎక్కడికక్కడ పరిష్కరిస్తున్నామని, మేము మందిస్తున్న సేవల పట్ల పవర్లూమ్ కార్మికులు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట డీఈ వెంకటరమణ, ఏడీఈ గంగాధర్, అనిల్, విజిలెన్స్ ఎస్ఐ ఓంకార్ యాదవ్, తిరుపతి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.