మంథని, ఏప్రిల్ 11 : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించిన వెబ్ సైట్ మొరాయిస్తున్నది. గత నెలాఖరులో ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఈ నెల 4వ తేదీన ముగిసి పోవాల్సి ఉండగా కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల లేక పోవడంతో అభ్యర్థులు ఆందోళన చెందారు. దీంతో ఈ నెల 14 వరకు పొడిగించిన విషయం విధితమే.
ఈ నేపథ్యంలో రాజీవ్ యువ వికాసం పథకాన్ని దరఖాస్తు చేసుకునేందుకు నిరుద్యోగులు, ఔత్సాహికులంతా ఆన్లైన్ సెంటర్ల వద్ద క్యూ కడుతున్నారు. మరో నాలుగు రోజుల్లో దరఖాస్తులకు గడువు ముగిసి పోతున్న నేపథ్యంలో యువత దరఖాస్తు చేసుకునేందుకు ఆన్లైన్ సెంటర్లకు కొండంత ఆశతో వస్తున్నా వెబ్ సైట్ పని చేయక పోవడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు.
ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆన్లైన్ సెంటర్ల వద్ద పడిగాపులు పడుతున్నారు. ఒక్కోసారి సైట్ పని చేసినప్పటికీ సమాచారమంతా నింపుతూ చివరి పేజీకి వెళ్లిన తర్వాత పేజీ పని చేయడం లేదంటూ కన్పిస్తోంది. దీంతో చేసేది ఏమీ లేక నిరాశతో వెనుదిరుగుతున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి సైట్ సక్రమంగా పని చేసేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.