Rajiv Yuva Vikasam |మంథని, ఏప్రిల్ 11: నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి పథకం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన రాజీవ్ యువ వికాసం వెబ్ సైట్ మొరాహిస్తూ ముందుకు సాగనట్టుంది. గత నెలాఖరులో ప్రారంభమైన రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఏప్రిల్ 4న ముగిసి పోవాల్సి ఉండగా కుల, ఆధాయ ధృవీకరణ పత్రాల లేక పోవడంతో అభ్యర్థులు ఆందోళన చెందారు.
అభ్యర్థుల అభ్యర్థనల మేరకు ఏప్రిల్ 14వ తేదీ వరకు పొడిగించిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో రాజీవ్ యువ వికాసం పథకాన్ని దరఖాస్తు చేసుకునేందుకు నిరుద్యోగులు, ఔత్సాహికులంతా ఆన్లైన్ సెంటర్ల వద్ద క్యూ కడుతున్నారు. మరో నాలుగు రోజుల్లో ఆన్లైన్ దరఖాస్తులకు గడువు ముగిసి పోతున్న నేపథ్యంలో యువత దరఖాస్తు చేసుకునేందుకు ఆన్లైన్ సెంటర్లకు కొండంత ఆశతో వస్తున్నప్పటికీ వెబ్ సైట్ పని చేయక పోవడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు.
ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆన్లైన్ సెంటర్ల వద్ద పడి గాపులు గాస్తున్నప్పటికీ సైట్ సక్రమంగా పని చేయక అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చాలా సార్లు ప్రయత్నిస్తే ఒక్కోక్కసారి సైట్ పని చేసినప్పటికీ సమాచారమంతా నింపుతూ చివరి పేజీకి వెళ్లిన తరువాత పేజీ పని చేయడం లేదంటూ కన్పిస్తోంది. దీంతో చేసేదేమీ లేక దరఖాస్తులు సమర్పించాలని వచ్చే అభ్యర్థులంతా నిరాశతో వెనుదిరుగుతున్నారు.
మొదటగా తక్కువ సమయం ఇచ్చి కుల, ఆధాయ సర్టిఫికెట్లు కావాలంటూ అలా ఇబ్బందులకు గురి చేశారని, మరోసారి సమయాన్ని పెంచి గడువు దగ్గరికి వస్తుంటే సైట్ పని చేయకుండా చేస్తూ ఇలా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ పలువురు దరఖాస్తుదారులు ప్రభుత్వంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి సైట్ సక్రమంగా పని చేసేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.