కరీంనగర్ విద్యానగర్, జూలై 12: ప్రస్తుత వానకాలంలో పరిసరాల పరిశుభ్రత లోపించడం, తాగునీరు కలుషితమవడం వల్ల వివిధ రకాల వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉంది. సీజనల్ వ్యాధుల విషయంలో పూర్తి అప్రమత్తంగా ఉండేందుకు వైద్య ఆరోగ్యశాఖ అన్ని పాఠశాలలు, వసతి గృహాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతి శుక్రవారం డ్రై డేగా అమలు చేయాలని ఆదేశించింది. ఆ వివరాలిలా ఉన్నాయి.
వసతిగృహల్లో పరిశుభ్రత పారిశుధ్యం విషయంలో అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వాన కాలంలో వచ్చే సీజన్ వ్యాధులపై వైద్యాధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. డెంగీ, మలేరియా, డయేరియా వంటి రోగాలకు ఆదిలోనే అడ్డుకట్టు వేసేందుకు సంబంధిత అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు ఇంటింటికీ వెళ్లి ఫీవర్ సర్వే నిర్వహించి జ్వరం, జలుబు, తలనొప్పి, తదితర లక్షణాలున్న వారి వివరాలు సేకరిస్తున్నారు. వ్యాధి లక్షణాలను బట్టి నేరుగా ఇంటి వద్దనే ఉచితంగా మందులు అందిస్తున్నారు. జ్వరం, జలుబు, తలవొప్పి లక్షణాలు మూడు నాలుగు రోజులైనా తగ్గకపోతే సంబంధిత వ్యక్తుల రక్త నమూనాలను సేకరించి పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపిస్తున్నారు.
డెంగీ, మలేరియా నిర్ధారణ అయితే ప్లేట్లెట్స్ తగ్గకుండా ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. డెంగీ కేసులు నమోదైన పరిసర ప్రాంతాల్లోని ఇండ్లల్లో ప్రత్యేక సర్వే చేపట్టి, రక్త నమూనాలను సేకరించి అవసరమైన చికిత్స అందిస్తున్నారు. జిల్లాలోని అన్ని దవాఖానల్లో డెంగీ చికిత్సకు అవసరమైన మందులను అందుబాటులో ఉంచేలా వైద్య ఆరోగ్యశాఖ చర్యలు చేపట్టింది. గ్రామాల్లో ఆశ వరర్, ఏఎన్ఎం ఆధ్వర్యంలో ప్రజలకు విసృ్తతంగా అవగాహన కల్పిస్తున్నారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు, జింక్ టాబ్లెట్లను అందించడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు.
ప్రస్తుత వానకాలంలో సీజనల్ వ్యాధులు ప్రజలే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే చలి జ్వరాలతో దవాఖానలకు క్యూ కడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నది. డెంగీ, టైఫాయిడ్ జ్వరాలతో మొదలై సీజన్ వ్యాధులు విధులు విజృంభించే ప్రమాదం ఉండడంతో ఆదిలోనే అరికట్టేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
నీటి కాలుష్యం పెరుగుతుండడంతో పాటు డ్రైనేజీ నీరు తాగునీటి పైపుల్లోకి చేరడంతో డయేరియా, కామెర్లు వచ్చే ప్రమాదం ఉన్నది. అందుకోసం కాచిన నీటిని తీసుకోవాలి. వర్షపు నీరు నిల్వ ఉండడం మురుగునీటితో దోమలు వ్యాప్తి చెందుతాయి. వీటి నివారణకు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు నీరు నిల్వ ఉండకుండా చూడాలి. తినే ముందు సబ్బుతో చేతులను శుభ్రం చేసుకోవాలి. వేడి ఆహార పదార్థాలను మాత్రమే తినాలి ఆహార పదార్థాలపై మూతలు సరిగ్గా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. పిల్లలకు జ్వరం జలుబు దగ్గు వచ్చినట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించాలి.