Sultanabad | సుల్తానాబాద్ రూరల్ జూన్ 22: వర్షాలు వస్తాయని ఆశపడ్డ రైతన్నలు ముందస్తుగా పత్తి పంట సాగు కు సన్నద్ధమయ్యారు. దుక్కులు దున్ని పత్తి విత్తనాలు నాటి నెల రోజులు గడుస్తున్నా.. వర్షాలు రాకపోవడంతో రైతన్నలు ఆకాశం వైపు దీనంగా చూస్తున్నారు. అప్పులు చేసి దాదాపుగా ఎకరానికి రూ.10 వేల వరకు పెట్టుబడులు పెట్టారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో అన్నదాతలు ఉన్నారు. కాలం కరుణించి వానరుడు జాలిపడి వర్షం పడితే రైతుల కళ్ళల్లో ఆనందం ఉంటుంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో పత్తి 780 ఎకరాల వరకు సాగు చేస్తున్నారు. వరి దాదాపుగా 15 వేల ఎకరాల వరకు పంటలు పండించే ప్రయత్నాలు ఏర్పాటు చేస్తున్నారు. మొక్కజొన్న 20 ఎకరాలు పెట్టారు. మంచరామీలో 100 ఎకరాల పత్తి సాగు చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో పత్తి మొక్కలను కాపాడుకునేందుకు రైతులు బకెట్లు, బిందెలతో నీరు అందిస్తున్నారు.
బకెట్లు, బిందెలతో నీళ్లు పోస్తున్నాం.. : శ్రీనివాస్, రైతు మంచరామి
ముందస్తు పత్తి సాగు చేశాను. వర్షాలు రావడం లేదు. పత్తి విత్తనాలు నాటి నెల రోజులు అవుతుంది. పత్తి మొలకలు ఎండిపోతాయని భయమేస్తుంది. అందుకే బకెట్స్, బిందెలతో నీళ్లను పోస్తున్నాను. ఇలా అయినా కొద్ది రోజులు కాపాడుకోవచ్చు. వరుణదేవుడు కనుకరించి వర్షం వస్తే బాగుండు. నాకు 10 ఎకరాల 20 గుంటల వ్యవసాయ భూమి ఉంది. అందులో ఒక ఎకరం 20 గుంటలు పత్తి సాగు చేస్తున్నాను. విత్తనాలు కూడా నాటాను. విత్తనాలకు రూపాయలు రూ.3 వేలు, దుక్కు దున్నే కూలి ఖర్చులు రూ. 6 వేలు, పత్తి విత్తనాలు నాటిన కూలి ఖర్చులు రూ.ఒక వెయ్యి మొత్తం పదివేల వరకు ఒక ఎకరానికి పత్తి సాగు ఖర్చవుతుంది. మరో 8 ఎకరాల 20 గుంటల లో వరి సాగు చేశా. మృగశిల పోయే ఇంకా వర్షాలు రావడం లేదాఏ. ఇలా అయితే రైతులు పంటల సాగు చేసుకోవడం ఎలా. వరి కోత సమయంలో అకాల వర్షాలతో అప్పుడు రైతులకు నష్టం జరిగింది. ఇప్పుడైనా ముందస్తు వర్షాలు వస్తాయని పత్తి సాగు చేస్తే ఇప్పుడు ఈ పరిస్థితి ఉంది.