Korutla | కోరుట్ల, ఏప్రిల్ 17 : ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్ర ప్రధాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సభను ప్రజలు విజయవంతం చేయాలని ఎన్నారై బీఆర్ఎస్ బహ్రెయిన్ శాఖ అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చావు నోట్లో తలపెట్టి తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నాన్ని నిజం చేసిన ధీరోధత్తుడు కేసీఆర్ ను ప్రజలు ఆదరించాలన్నారు. శుక్రవారం బహ్రెయిన్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈనెల 20న జరిగే కేసీఆర్ భారీ బహిరంగ సభతో బీఆర్ఎస్ జైత్రయాత్ర మొదలుకానుందని తెలిపారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభ అంటేనే కాంగ్రెస్ నాయకులు వణికిపోతున్నారని చెప్పారు. సభకు ఆటంకాలు కలిగించేందుకు కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 30 నెలలు గడుస్తున్న ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రశ్నిస్తే బీఆర్ఎస్ నాయకులను వేధింపులకు గురి చేస్తూ కేసులు పెడుతున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన మహానాయకుడనే గౌరవం లేకుండా సీఎం రేవంత్ రెడ్డి ఇష్టరీతిలో మాట్లాడుతున్నాడని, తెలంగాణ ప్రజలు అంతా గమనిస్తున్నారని పేర్కొన్నారు.
నాలుగుకోట్ల తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పాలనను గుర్తు చేసుకొని రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలి అని కోరుకుంటున్నారన్నారు. కేసీఆర్ ప్రసంగం కోసం ప్రజలు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ భారీ బహిరంగ సభతో రాష్ట్ర రాజకీయాలు మలుపు తిరగడం ఖాయమన్నారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి తన అనుచరులు వేలాది మందితో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా ముందస్తుగా ఎన్నారై బీఆర్ఎస్ బహ్రెయిన్ పక్షాన శుభాకాంక్షలు తెలిపారు. సమావేశంలో ఎన్నారై బీఆర్ఎస్ సెల్ ఉపాధ్యక్షుడు బొలిశెట్టి వెంకటేష్, ప్రధాన కార్యదర్శులు మగ్గిడి రాజేందర్, అన్నారం సుమన్, కార్యదర్శులు చెన్నమనేని రాజేందర్, సంగేపు దేవన్న, ఉత్కం కిరణ్ గౌడ్ పాల్గొన్నారు.