పెద్దపల్లి, నవంబర్ 13: గొర్రె కాపరుల సమస్యలు పరిష్కారం, విద్యుత్ శాఖ నిర్లక్ష్యానికి నిరసనగా ఈనెల 17న పెద్దపల్లి కలెక్టర్ ఎదుట చేపట్టే నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గొర్రెకాపరుల సంక్షేమ సంఘం (జీకేఎస్ఎస్) నాయకులు పిలుపునిచ్చారు. గొర్రెకాపరుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సలేంద్ర రాములు యాదవ్ అధ్యక్షతన గురువారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జీకేఎస్ఎస్ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి మారం తిరుపతియాదవ్, రాష్ర్ట ఉపాధ్యక్షుడు చిలారాపు పర్వతాలు మాట్లాడారు.
విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతో గొర్రెలు, ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆరోపించారు. విద్యుత్ ప్రమాదాల్లో గొర్రెల కాపరి చనిపోతే అందించే పరిహారం రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచాలని, ప్రమాదంలో చనిపోయిన గొర్రెకు రూ.20వేలు, పొట్టేలుకు రూ.30వేల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. 17న చేపట్టే నిరసన కార్యక్రమానికి జిల్లాలోని గొర్రెకాపురులు, గొల్లకుర్మలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో రాష్ర్ట కార్యదర్శి వేల్పుల నాగరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల నర్సయ్య, జిల్లా నాయకులు దారం రాజుయాదవ్, బత్తుల లింగం యాదవ్, మండల అధ్యక్షుడు దాడి చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.