Anganwadis problems | కోల్ సిటీ, జూలై 30: అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ అసోసియేషన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర అధ్యక్షురాలు మేకల సాయీశ్వరీ రాష్ర్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలను ఆగం పట్టించడం ప్రభుత్వంకు మంచిది కాదని, రాష్ట్రంలోని 85వేల మంది అంగన్వాడీ టీచర్లు, ఆయాల పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉందని వాపోయారు. ఉద్యోగ విరమణ అనంతరం టీచర్ కు రూ.2లక్షలు, ఆయాలకు రూ.లక్ష చెల్లించకుండా కాలయాపన చేస్తూ మానసిక క్షోభకు గురి చేస్తుందని ఆరోపించారు. టీచర్లకు సర్వీస్ ను బట్టి సూపర్వైజర్ పోస్టులకు నియమించాలన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా రూ.18వేల వేతనం చెల్లించాలని, అద్దెలు, గ్యాస్, ఆరోగ్య లక్ష్మీ బిల్లులు ప్రతీ నెల సక్రమంగా రావడం లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలోని వంద పాఠశాలలను ఫ్రీ ప్రైమరీ స్కూల్స్ నిర్వహించాలని రూ.33 కోట్లు కేటాయించడం, నాలుగేళ్లు నిండిన చిన్నారులను మాత్రమే పాఠశాలలో చేర్చుకోవాలని నిబంధనలు, నూతన విద్యా విధానం మధ్య తేడాలు స్పష్టమైన సమాచారం లేక టీచర్లు, ఆయాలు ఆందోళన చెందుతున్నారన్నారు.
ఐసీడీఎస్ లో ఉన్న ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, అంగన్వాడీ కేంద్రాలను ఫ్రీ ప్రైమరీ స్కూల్స్ మారిస్తే టీచర్లను, ఆయాలను మొదటి ప్రాముఖ్యతగా తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీచర్లు, ఆయాలకు వేతనాలు పెంచి అంగన్వాడీ సెంటర్లను బలోపతం చేయని పక్షంలో భవిష్యత్ పోరాటాలకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.