వేములవాడ, ఫిబ్రవరి 16: వేములవాడ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ రెండు పదవులు కూడా కాపు సామాజిక వర్గానికే దక్కాయి. దీంతో ఇతర సామాజిక వర్గాలకు నిరాశ మిగలగా, అధికార పార్టీ వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. మున్సిపాలిటీలో మొత్తం 28 వార్డులు ఉండగా, 13 స్థానాలు కాంగ్రెస్, 8 బీజేపీ, 5 బీఆర్ఎస్ గెలుచుకోగా, ఇద్దరు స్వతంత్రులు గెలిచారు. సోమవారం ఉదయం 11గంటలకు కౌన్సిల్ కార్యాలయానికి చేరుకున్న నూతన కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. 12. 30 గంటలకు ప్రత్యేక సమావేశం నిర్వహించి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహిస్తామని ఎన్నికల అధికారి రాధాబాయి తెలుపగా, అధికార పార్టీ నాయకులు రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఎన్నికను బైకాట్ చేసి వెళ్లిపోయారు. ఎక్స్ అఫీషియో సభ్యుడు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌తో కలిసి మొత్తం 25 మంది ఉండగా, ఎన్నిక నిర్వహించారు.
చైర్మన్ పదవి బీసీ జనరల్ కాగా, పులం రాజు పేరును ప్రతిపాదించారు. 17 మంది ఓటు వేయడంతో ఆయనను చైర్మన్‌గా ప్రకటించారు. అలాగే వైస్ చైర్మన్ పదవి కోసం ప్రతిపాదించిన నరాల శేఖర్‌కు 17 ఓట్లు రావడంతో ఎన్నికైనట్టు ప్రకటించారు. అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్లతో ప్రమాణ స్వీకారం చేయించిన పత్రాలను అందజేశారు. అయితే చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను ఒకే సామాజిక వర్గానికి కట్టబెట్టడంపై ఇతర సామాజిక వర్గాల నాయకులు తీవ్ర అసహనం చెందారు. ఇతర వర్గాల కౌన్సిలర్లు ఉన్నా కేటాయించకపోవడం సరికాదంటూ విప్ ఆది శ్రీనివాస్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
మున్సిపల్ చైర్మన్ పదవిని కాంగ్రెస్ మొదటి నుంచి కొనసాగుతున్న తూమ్ మధు, అసెంబ్లీ ఎన్నికల ముందు చేరిన పులం రాజు, ఇప్పపూల మమత అజయ్ ఆశించారు. వీరిలో చైర్మన్ పదవికి పులం రాజు పేరును ప్రతిపాదించగా.. మిగిలిన ఆశావహులు తీవ్ర నిరాశ చెందారు. దీంతో అసంతృప్తులను బుజ్జగించేందుకు చైర్మన్ పదవిని రెండున్నరేళ్లకు ఒకరికి ఇస్తామని, ఆశావహుల్లో ఒకరికి హామీ ఇచ్చినట్టు తెలిసింది. అయితే ఎన్నిక ప్రక్రియైన పూర్తయిన తర్వాత విలేకరుల సమావేశంలో తాము రెండున్నరేళ్లు ఉంటామని చెప్పకపోవడంపై సదరు అసంతృప్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
తర్వాత విప్ ఆది శ్రీనివాస్‌తో కలిసి తీసిన విజయోత్సవ ర్యాలీని వారు బహిషరించినట్టు తెలిసింది. ర్యాలీలో సదరు కౌన్సిలర్లు కనిపించడం లేదని నాయకులు చెప్పి, వారికి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయనట్టు తెలిసింది. మరోవైపు కాంగ్రెస్ నుంచి కౌన్సిలర్‌గా పోటీచేసిన మస్తాన్, సీనియర్ నాయకుడు మంత్రి నాగభూషణం కూడా తమకు తెలియకుండానే తమ ప్రత్యుర్థులను పార్టీలోకి తీసుకోవడంపై గుర్రుగా ఉన్నట్టు తెలిసింది.