Koushik reddy | హుజురాబాద్, మే 20 : తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు జారీ చేయడం కాంగ్రెస్ కక్ష సాధింపు చర్యలకు పరాకాష్ట అని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం ప్రతికా ప్రకటన విడుదల చే శారు. ఈ సందర్భంగా ఆయన వారికి నోటీసులు అందజేయడంపై తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఎదుగుతున్న నాయకులను, ప్రజల గుండెల్లో స్థానం సంపాదించిన నాయకులను ఇలా వేధించడం దారుణమని పేర్కొన్నారు. విశ్వఖ్యాతి గాంచిన కాళేశ్వరం ప్రాజెక్టుతో కేసీఆర్ వచ్చిన ఖ్యాతిని, ప్రజల్లో ఏర్పడిన గౌరవాన్ని జీర్ణించుకోలేక కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా కక్ష తీర్చుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏం నేరం చేశారని కేసీఆర్ వెంటపడుతున్నారని నిలదీశారు. తెలంగాణ కోసం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడినందుకా.. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిన వరప్రదాయిని ‘కాళేశ్వరం’ కట్టినందుకా.. అని ప్రశ్నించారు. లేదా కోటి ఎకరాలకు సాగు నీరు ఇచ్చినందుకా.. రైతుబంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్ తో రైతును రాజును చేసినందుకా అని నిలదీశారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగు నీరు అందించినందుకా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
ప్రతీ ఇంటికీ సంక్షేమ పథకాలు అందించినందుకే మీరు ఇలా వెంటపడుతున్నట్లు అర్థమవుతోందని, ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో చేసిన పనులన్నీ ప్రజల మనుసుల ల్లోచెరగని ముద్రలని, అవి అభివృద్ధి చిహ్నాలని పేర్కొన్నారు. విచారణల పేరుతో వేధిస్తే తెలంగాణ ప్రజలు ఊరుకోబోరని ఆయన హెచ్చరించారు. కరోనా వంటి ప్రపంచ విపత్తులోనూ ప్రజల మధ్య ఉండి ధైర్యం ఇచ్చిన నాయకుడు కేసీఆర్ అని, అలాంటి మహానేతను కించపరచాలన్న యత్నాలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని పేర్కొన్నారు.
రెవంత్ రెడ్డి సర్కార్ తాటాకు చప్పుళ్లకు బీఆర్ఎస్ పడదని, కేసీఆర్ తో గోక్కున్నోళ్లెవరు బాగుపడలేరని వ్యాఖ్యానించారు. ఇందుకు కాంగ్రెస్ పార్టీ తగిన మూల్యం చెల్లించక తప్పదని, ఎన్నికల ముందు ఇచ్చిన 420 హామీలను అమలు చేయలేని దౌర్భాగ్యాన్ని ప్రజల దృష్టి నుండి మళ్లించేందుకు కేసీఆర్ గారికి నోటీసుల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని తెలిపారు.