యువసారథి, మంత్రి కేటీఆర్‌కు పెద్దపల్లి జిల్లా ప్రజలు నీరాజనం పలికారు. ఆదివారం ఆయన గోదావరిఖని, పెద్దపల్లిలో పర్యటించి, 360 కోట్లతో అభివృద్ధి పనులకు అంకురార్పణ చేయగా, ఆయాచోట్ల బ్రహ్మరథం పట్టారు. ముందుగా గోదావరిఖని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో రామగుండం దశాబ్ది ప్రగతి సభ నిర్వహించగా, సభా స్థలి ఇసుకేస్తే రాలనంత జనంతో కిక్కిరిసిపోయింది. తర్వాత పెద్దపల్లిలోనూ వేలాది మంది రావడంతో ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం కిటకిటలాడింది.
ఆయాచోట్ల అమాత్యుడు రామన్న ప్రసంగాలతో ఊర్రూతలూగించగా, సభికులు ‘జై కేసీఆర్’ ‘జైజై కేటీఆర్’ అంటూ నినదించారు. మాట్లాడుతున్నంత సేపూ చప్పట్లు, ఈలలతో హోరెత్తించారు. ఓవైపు కాంగ్రెస్, బీజేపీ తీరును ఎండగడుతూనే, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని వివరించారు. కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలని, బీఆర్ఎస్ అభ్యర్థులు కోరుకంటి చందర్, దాసరి మనోహర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేయగా, ముక్తకంఠంతో జైకొట్టారు. ‘మేమంతా మీ వెంటే ఉంటాం’ అని అభయమిచ్చారు.
– పెద్దపల్లి, అక్టోబర్ 1(నమస్తే తెలంగాణ)/ పెద్దపల్లి/ ఫర్టిలైజర్‌సిటీ/ కోల్‌సిటీ
గోదావరిఖనిలో రామగుండం దశాబ్ది ప్రగతి సభ, పెద్దపల్లిలో ప్రగతి నివేదన సభలకు జనం పోటెత్తారు. గోదావరిఖని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం, పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన సభలకు వేలాదిగా తరలివచ్చారు. రెండు చోట్లా మంత్రి కేటీఆర్‌కు జయజయ ధ్వానాలతో స్వాగతం పలుకుతూ, ‘జై కేసీఆర్’ ‘జైజై కేటీఆర్’ అని సభికులు నినదించారు. అమాత్యుడు రామన్న తన ప్రసంగాలతో ఊర్రూతలూగించగా, జేజేలు పలికారు.
పెద్దపల్లి, అక్టోబర్ 1(నమస్తే తెలంగాణ)/ పెద్దపల్లి/ఫర్టిలైజర్‌సిటీ/కోల్‌సిటీ: రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్‌కు పెద్దపల్లి జిల్లా ప్రజలు నీరాజనం పలికారు. ఆదివారం ఆయన గోదావరిఖని, పెద్దపల్లిలో పర్యటించగా, ఆయాచోట్ల ఘనంగా స్వాగతించారు. రామగుండం దశాబ్ది ప్రగతి సభ, పెద్దపల్లి ప్రగతి నివేదన సభలకు జనం పోటెత్తారు. ముందుగా మంచిర్యాల జిల్లా మందమర్రి, రామకృష్ణాపూర్లో పర్యటించిన అమాత్యుడు, మధ్యాహ్నం 2.50 గంటల ప్రాంతంలో గోదావరిఖనికి చేరుకున్నారు. జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఐటీ, ఇండస్ట్రియల్ పార్కులతోపాటు 210 కోట్లతో వివిధ పనులకు శంకుస్థాపన చేశారు.
ఆ తర్వాత ఎమ్మెల్యే కోరుకుంటి చందర్ అధ్యక్షతన నిర్వహించిన దశాబ్ది ప్రగతి సభకు హాజరయ్యారు. సాయంత్రం 4 గంటలకు పెద్దపల్లికి చేరుకొని, ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో 150 కోట్ల పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ఆధ్యక్షతన నిర్వహించిన ప్రగతి నివేదన సభకు హాజరయ్యారు. రెండు చోట్లా వేలాదిగా తరలిరావడంతో సభా ప్రాంగాణాలు కిక్కిరిసిపోగా, ఆ తర్వాత వచ్చిన వారంతా సభా స్థలి చుట్టూ నిల్చున్నారు. వేదికలపైకి రామన్న చేరుకోగానే జయజయ ధ్వానాలతో స్వాగతం పలికారు. ‘జై కేసీఆర్’ ‘జైజై కేటీఆర్’ అని నినదించారు.
ఆయాచోట్ల అమాత్యుడు తన ప్రసంగాలతో ఆకట్టుకున్నారు. తాగునీరు, ఉచిత కరెంటు, రైతు బంధు, రైతు బీమా, పెన్షన్, కల్యాణలక్ష్మి వంటి పథకాలను వివరిస్తూనే దేశంలో ఎక్కడైనా ఉన్నాయా..? అంటూ ప్రశ్నించారు. ఇదే సమయంలో నాడు సమైక్యరాష్ట్రంలో పడిన కష్టాలు, అలాగే స్వరాష్ట్రం కోసం చేసిన ఉద్యమం, త్యాగాలు, గడిచిన పదేళ్లలో జరిగిన అభివృద్ధి వంటివి విషయాలను అర్థం చేయించారు. మరోవైపు కాంగ్రెస్, బీజేపీ నాయకుల తీరును కడిగి పారేశారు. తప్పిపోయి వాళ్లకు ఓటు వేస్తే తెలంగాణ అభివృద్ధికి జరిగే విఘాతాలను వివరించి ఆలోచింపజేశారు.
కాంగ్రెస్ ఆరు గ్యారంటీలపై తన పంచ్ డైలాగులు విసరడంతో సభికులు ఈలలు, చప్పట్లతో హోరెత్తించారు. ‘ఆరు దశాబ్దాలపాటు మనల్ని సావగొట్టిన పార్టీ, కరెంట్ ఇయ్యకుండా, సాగుకు నీళ్లు ఇయ్యకుండా సావగొట్టిన పార్టీ కాంగ్రెస్, ఈ రోజు ఆరు గ్యారంటీలంటూ మాట్లాడుతున్నది. అసలు వారంటీయే లేనోళ్లు ఇచ్చే గ్యారంటీలు నమ్ముదామా..?’ అంటూ ప్రశ్నించగా, సభికులంతా ‘నమ్మేది లేదు’ అంటూ బిగ్గరగా చెప్పారు. ‘కాంగ్రెస్ పాలనలో కరెంట్ ఉంటే వార్త. ఈ రోజు కరెంట్ పోతే వార్త. ఈ రోజు రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తున్న మాట నిజమైతే చప్పట్లతో కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలుపండి’ అని కోరగా పెద్ద పెట్టున కరతాళ ధ్వనులు చేశారు.
కాంగ్రెస్ పాలనలో ఆగమైన సింగరేణిని లాభాల్లోకి తీసుకొచ్చి, కార్మికులకు 32 శాతం వాటా ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనని పేర్కొనగా, కార్మికులు జయజయధ్వానాలు చేశారు. అలాగే, ప్రధాని మోదీ అమలు కాని హామీలతో దేశాన్ని అమ్ముకుంటున్నాడని, మన సంపదనంతా కార్పొరేట్లకు కట్టబెడుతున్నడంటూ మోదీ సర్కారును కడిగిపారేశారు. మోదీ దోస్త్ ఎవరని ప్రశ్నిస్తే సభికులంతా అదానీ అంటూ సమాధానమిచ్చారు. రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలని, హ్యాట్రిక్ సీఎంను చేయాలని విజ్ఞప్తి చేయగా, జై కొట్టారు. రామగుండం, పెద్దపల్లి బీఆర్ఎస్ అభ్యర్థులు కోరుకంటి చందర్, దాసరి మనోహర్‌రెడ్డిని గెలిపించాలని కోరడంతో చప్పట్లతో మద్దతు తెలిపారు.
కాంగ్రెస్‌ను ఉద్దేశిస్తూ ‘కారు గుర్తు కావాలా..? కాంగ్రెస్ బేకారుగాళ్లు కావాలా..?’ తేల్చుకోవాలని అమాత్యుడు పిలుపునివ్వగా, కారే కావాలంటూ నినదించారు. మంత్రి కేటీఆర్‌తోపాటు మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు కోరుకంటి చం దర్, దాసరి మనోహర్‌రెడ్డి కూడా ప్రసంగాలతో శ్రేణుల్లో నూతనోత్తేజం నింపారు. మొ త్తంగా గోదావరిఖని, పెద్దపల్లిలో సభలు సక్సెస్ కావడంతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆనందంలో మునిగిపోయారు. జనాల స్పందన చూసి మళ్లీ బీఆర్ఎస్ జెండా ఎగురడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
వారంటీలేని పార్టీ గ్యారంటీలను నమ్ముదామా..?
కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు బూటకం. కాంగెస్ వస్తే 24గంటల కరెంటు పోయి మూడు గంటల కరెంటు వస్తది. ఆ పార్టీ అధికారంలోకి వస్తే రైతుల జీవితాల్లో అంధకారమే. వాళ్లకు అవకాశమిస్తే ఏడాదికో ముఖ్యమంత్రి పక్కా. కుంభకోణాలు గ్యారంటీ.. అవినీతి ప్రభుత్వం గ్యారంటీ. 150 ఏండ్ల ముసలి నక్క కాంగ్రెస్ అవసరమా..?
వారంటీలేని పార్టీ గ్యారంటీలను నమ్ముదామా..? నమ్మి మోసపోదామా.. మీరే చెప్పాలి. వాళ్లను నమ్ముకుంటే కుక్కతోకతో పట్టి గోదావరి ఈదినట్టే. నేను ఒక్కటే చెబుతున్నా. ప్రజలు జాగ్రత్తగా ఆలోచించాలి. 70లక్షల రైతుల ఖాతాల్లో 73వేల కోట్ల రూపాయలు వేసిన కేసీఆర్ కావాలో.. 70 ఏండ్లు అవకాశమిస్తే రైతుల జీవితాలు నాశనం చేసిన కాంగ్రెస్ కావాలో..? ప్రజలే ఆలోచించాలి.
– మంత్రి కేటీఆర్
దాసరిని భారీ మెజార్టీతో గెలిపించండి
మీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి నియోజకవర్గాన్ని చాలా అభివృద్ధి చేసిండు. ఆయనను 50 వేల నుంచి 60వేల మెజార్టీతో మరోసారి గెలిపించండి. మరెన్నో చేస్తం. పెద్దపల్లి జిల్లా కేంద్రానికి బస్ డిపో పక్కా వస్తది. ఇంకా గర్రెపల్లి, కొలనూర్ను మండల కేంద్రాలు చేస్తం. పెద్దపల్లిని అర్బన్, రూరల్ మండలాలు చేస్తం. గంగారం నుంచి ఉశన్నపల్లి, రంగాపూర్ నుంచి శ్రీరాంనగర్‌ను, మల్యాల నుంచి జగ్గయ్యపల్లిని వేరు చేసి కొత్త గ్రామపంచాయతీలు కూడా చేస్తం. దాసరి మనోహర్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించగానే నేనే సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కి అయినా చేయిస్త.
– మంత్రి కేటీఆర్
తీగలను ముట్టుకోండి..
కొంత మంది కాంగ్రెసోళ్లకు కరెంట్ మీద అనుమానం ఉన్నది. ‘కేసీఆర్ కరెంట్ ఎక్కడిస్తుండు? దమ్ముంటే చూపెట్టు’ అని అంటున్నరు. ‘ఒక వేళ ఇచ్చినట్లయితే రాజీనామా చేస్తా’ అని ఓ పెద్ద మనిషి కూడా అన్నడు. ఆ పెద్దమనిషికి, కాంగ్రెస్ నాయకులకు నేనొకటే చెబుతున్న. పెద్దపల్లి నియోజకవర్గంల, రాష్ట్రం ఉన్న మొత్తం కాంగ్రెస్ నాయకులందరూ రండి. మేమే బస్సులు పెడతాం. రేవంత్‌రెడ్డి కాన్నుంచి ఇక్కడున్న విజయరమణారావు దాకా అందరికీ అందరూ రండి. పెద్దపల్లిల ఏ ఊరో మీ ఇష్టం. ఏ టైమో మీ ఇష్టం. అందరూ వరుసల నిలబడి కరెంట్ తీగలను గట్టిగ పట్టుకోండి’ అప్పుడు కరెంట్ ఉన్నదో..? లేదో తెలుస్తది. – మంత్రి కేటీఆర్
చందర్‌ను గెలిపిస్తే దత్తత తీసుకుంటా..
రామగుండం దశాబ్ది సభలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌పై మంత్రి కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. ‘రామగుండం ముద్దుబిడ్డ ఉద్యమనేత. నాటి నుంచి నేటి దాకా ఎత్తిన జెండా దించకుండా సీఎం కేసీఆర్ వెంట ఓ సైనికుడిలా, ఓ తమ్ముడిలా నడిచి, ఇప్పుడు ఎమ్మెల్యేగా ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ, నియోజకవర్గాన్ని కంటికిరెప్పలా కాపాడుకుంటున్నాడు’ అంటూ ప్రశంసించారు. ‘చందరన్నను జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. మరోసారి గెలిపిస్తే రామగుండం నియోజకవర్గాన్ని నేను దత్తత తీసుకుంటా’ అని ప్రకటించగా, సభికులు చప్పట్లలతో స్వాగతించారు.