సిరిసిల్ల టౌన్, జనవరి 9: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేకే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్‌పై రేవంత్‌రెడ్డి సర్కా రు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని అక్రమ కేసులు బనాయిస్తున్నదని బీఆర్ఎస్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య విమర్శించారు. గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిష్టాత్మకమైన ఫా ర్ములా-ఈ కార్ రేస్‌ను ప్రపంచ వ్యాప్తంగా ఆ యా దేశాల్లో నిర్వహిస్తున్నారని తెలిపారు. మెక్సికోతో పాటు వేరే దేశంలో ఫార్ములా-ఈ కార్ రేస్ ఈ నెలలో జరుగుతుందని చెప్పారు. రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలన్న లక్ష్యంతో ఫార్ములా-ఈ కార్ రేస్ కేటీఆర్ చొరవతో 2023లో తెలంగాణలో జరిగిందని, నిబంధనల ప్రకా రం 2024లోనూ నిర్వహించా ల్సి ఉండగా, కక్షపూరితంగా రేవంత్‌రెడ్డి నిలిపివేశారన్నారు. డబ్బు సంచులతో దొరికిన రేవంత్‌రెడ్డి.. కేటీఆర్‌పై అక్కసుతో అక్రమంగా ఏసీబీ కేసు పెట్టించాడని ఆరోపించారు.
దురుద్దేశ పూర్వకంగా ఆరోపణలు చేస్తూ.. బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేయాలన్న ఉద్దేశంతో రేవంత్‌రెడ్డి కేటీఆర్‌పై దుష్ప్రచారం చేస్తున్నాడని ఆరోపించారు. రాష్ట్రంలో అన్ని వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి రాబోయే ఎన్నికల్లో ఘోర పరాభావం తప్పదన్నారు. మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ, అబద్ధపు హామీలతో రేవంత్‌రెడ్డి అందలం ఎక్కాడన్నారు. రైతుభరోసా, కల్యాణలక్ష్మితోపాటు తులం బంగారం, విద్యార్థులకు స్కూటీలు ఇవ్వాలని, జాబ్ క్యాలెండర్, ఎన్నికల హామీలన్నింటినీ అమలు చేయాలని కేటీఆర్ చేస్తున్న డిమాండ్లను ఎదుర్కొనలేక అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు. మీరు ఎన్ని తప్పుడు కేసులు పెట్టిన నిలువబోవన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు కోడి అంతయ్య, అందె సుభాష్, అక్కరాజు శ్రీనివాస్, బొల్లి రామ్మోహన్, కుంబాల మల్లారెడ్డి, అబ్బడి అనిల్, మాట్ల మధు, కొమ్ము బాలయ్య, తదితరులు పాల్గొన్నారు.