GANGADHARA | గంగాధర, ఏప్రిల్ 11: రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఆన్లైన్ స్లాట్ బుకింగ్ విధానాన్ని రద్దు చేయాలని గంగాధర డాక్యుమెంట్ రైటర్ల సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. ఆన్లైన్ స్లాట్ బుకింగ్ కు వ్యతిరేకంగా గంగాధర సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం ఎదుట శుక్రవారం డాక్యుమెంట్ రైటర్లు నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆన్లైన్ విధానం అమలుతో తమాస్ జీవనాధారం దెబ్బతింటుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రిజిస్ట్రేషన్ వ్యవస్థను డిజిటలైజ్ చేస్తూ ఆన్లైన్ స్లాట్ బుకింగ్ విధానాన్ని తీసుకువస్తే డాక్యుమెంట్ రైటర్లు ఉపాధి కోల్పోయి కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధానం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు అవుతాయని, సమాచార లోపంతో రిజిస్ట్రేషన్లు ఆలస్యం అవుతున్నాయని పేర్కొన్నారు.
ధరణి వ్యవస్థలో ఇప్పటివరకు సమస్యలను ప్రభుత్వం పరిష్కరించలేదని, ఈ విధానంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందు పడుతున్నారని, ధరణి సమస్యలను పరిష్కరించకుండానే సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో కూడా ఆన్లైన్ వ్యవస్థను తీసుకురావడం ప్రజలను మరింత సమస్యల్లోకి నెట్టడమేనని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆన్లైన్ స్లాట్ బుకింగ్ విధానాన్ని రద్దు చేసి, పాత విధానంలోనే రిజిస్ట్రేషన్ లను కొనసాగించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో డాక్యుమెంట్ రైటర్ల సంఘం సభ్యులు తోట చంద్రయ్య, గంట కిషన్, తాండ్ర రమేష్, గుజ్జుల సూర్య ప్రతాప్ రెడ్డి, ప్రతాప్, కమలాకర్, మహేష్, రాజశేఖర్, ప్రమోదు, యోనా, వేణు, హరీష్, అనిల్, శ్రీనివాస్, అచ్యుత్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.