ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామని గొప్పలు చెబుతున్న కాంగ్రెస్ సర్కారు, క్షేత్రస్థాయిలో తుస్సుమనిపిస్తున్నది. ఏటా విద్యా సంవత్సరం ప్రారంభమైన మొదటి రోజు నుంచే యూనిఫాంలు అందిస్తున్నా.. ఈసారి మాత్రం గగనంగానే కనిపిస్తున్నది. ఈ యేడాది ఫిబ్రవరిలో టెస్కో ద్వారా సిరిసిల్లకు అందించిన స్కూల్ యూనిఫాం వస్ర్తాల ఆర్డర్లను, సగం వస్రోత్పత్తి తర్వాత రద్దు చేసి టెండర్లకు సిద్ధమైంది. దీనిని కోర్టు రద్దు చేసి, ప్రభుత్వ ఆర్డర్లను టెస్కో ద్వారానే ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చినా ప్రభుత్వం మాత్రం చోద్యం చూస్తున్నది. ఫలితంగా ఇప్పటి వరకు తయారైన వస్త్రం పరిశ్రమలోనే మూలుగుతున్నా ఏ నిర్ణయమూ తీసుకోవడం లేదు. నేటి నుంచి స్కూళ్లు పునః ప్రారంభం కానుండగా, యూనిఫాం క్లాత్ అందే పరిస్థితి కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో విద్యార్థులకు పాత యూనిఫాంలే దిక్కయ్యే పరిస్థితి ఉన్నది.
రాజన్న సిరిసిల్ల, జూన్ 14 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి యూనిఫాం వస్త్రం తయారీ ఆర్డర్లను ఫిబ్రవరిలో టెస్కోకు ఇచ్చింది. అందులో 63 లక్షల మీటర్ల ఆర్డర్లను సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ఇచ్చింది. 50 శాతం ఉత్పత్తి కాగా, అంతలోనే ఏప్రిల్ ఒకటిన ఆ ఆర్డర్లను రద్దు చేసి, టెండర్ల ద్వారా వస్త్ర సేకరణకు సిద్ధమైంది. దీంతో తీవ్ర వ్యతిరేకత రావడం, చేనేత సహకార సంఘాలు హైకోర్టును ఆశ్రయించడంతో టెండర్ల విధానం రద్దు చేసి, టెస్కో ద్వారానే ప్రభుత్వ ఆర్డర్లు ఇవ్వాలని ఆదేశించింది.
అయితే, ఇప్పటికీ సర్కారు ఏ నిర్ణయమూ తీసుకోకపోవడంతో ఉత్పత్తి చేసిన వస్త్రం పరిశ్రమల్లోనే నిల్వ ఉన్నది. ఏటా పాఠశాల ప్రారంభం రోజునే దుస్తులు, పుస్తకాల పంపిణీ జరుగుతున్న విషయం తెలిసిందే కాగా, ఈ సారి ఇప్పటి వరకు పాఠశాలలకు యూనిఫాం దుస్తులు చేరలేదు. దుస్తుల పంపిణీకి మార్చిలోనే ప్రణాళికలను రూపొందించి, జిల్లాల వారీగా వస్త్రం అందిస్తారు. వీటీనీ ఎమ్మార్సీల నుంచి ఏప్రిల్, మేలో కుట్టేందుకు అందజేస్తారు. అయితే విద్యాసంవత్సరం నేటి నుంచి ప్రారంభం కానుండగా, ఇప్పటి వరకు క్లాతే జిల్లాకు చేరలేదని తెలిసింది.
పైగా స్కూల్ యూనిఫాం రంగులు మారుస్తున్నట్టు సర్కారు ఈ నెల 9న ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది యూనిఫాం రెడ్ అండ్ యాష్ కలర్లో ఉండగా, ఈసారి లేత నీలం రంగుగా మార్చింది. ఈ కొత్త యూనిఫాంలు వచ్చే వరకు సమయం పట్టనున్నది. అసలు వస్ర్తాలను సేకరించి, దుస్తులుగా కుట్టించి, పంపిణీ చేసే సరికి ఈ విద్యా సంవత్సరం సగం పూర్తయ్యే పరిస్థితి కనిపిస్తున్నది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 2.36లక్షలకుపైగా విద్యార్థులు ఉండగా.. వీరంతా ఈసారి పాత యూనిఫాంలతోనే రావాల్సిన దుస్థితి ఉన్నది. దీంతో తల్లిదండ్రుల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతున్నది.
కిట్స్ అనుమానమే..
సర్కారు ఈసారి కొత్తగా పాఠశాల, హాస్టల్ విద్యార్థులకు కిట్స్ అందిస్తామని ప్రకటించింది. దుస్తులు, బ్యాగులు, షూలు, సాక్స్, నోట్ బుక్స్, పీటీ, నైట్ డ్రెస్, ట్రక్ షూట్, కార్పెట్, బెడ్షీట్, బ్లాంకెట్, ట్రంక్ బాక్సులు, ప్లేట్లు, గ్లాసులు, కప్పులు, ట్రాలీ బ్యాగ్, ఐడీ కార్డు, స్టేషనరీ కిట్ ఇలా 22రకాల వస్తువులతో వెల్కం కిట్ ఇస్తామని గొప్పలు చెప్పింది. కానీ, నేటికీ కనీసం స్పష్టత ఇవ్వలేదు. అసలు ఇస్తుందో.. లేదో ఇప్పటికీ తెలియదు.