సిటీబ్యూరో, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ) : నగర రోడ్లు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. బాబోయ్.. ఇవేం రోడ్లు అంటూ.. వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ఏ రోడ్డును చూసినా.. ఏ ప్రాంతంలో చూసినా..గుంతలే కనిపిస్తున్నాయి. ప్రధాన రహదారుల నుంచి అంతర్గత రోడ్ల దాకా సాఫీ ప్రయాణానికి వీలు లేకుండా ఉంది. గుంతలమయంగా మారిన రోడ్లపై ప్రయాణం నరకప్రాయంగా మారింది. ఇటీవల కురుస్తున్న వానలకు చాలా చోట్ల రహదారులు దెబ్బతిన్నాయి.
దాదాపు రెండేండ్లుగా మరమ్మతుల్లో అధికారులు నిర్లక్ష్యం వహించడంతో మరింత అధ్వానంగా మారాయి. వర్షాలకు దాదాపు 600 ప్రాంతాల్లో పాట్‌హోల్స్ (రోడ్లు డ్యామేజీ) ఏర్పడినట్లు అధికారులు తమ అధ్యయనంలో తేల్చారు. యుద్ధ ప్రాతిపదికన వీటి మరమ్మతు పనులు చేపట్టకపోవడంతో అనేక ప్రాంతాల్లో ప్రయాణికులు ప్రమాదాల బారినపడుతున్నారు. నిత్యం జీహెచ్ఎంసీ టోల్‌ఫ్రీ నంబర్‌కు వందలాది ఫిర్యాదులు వస్తున్నా అధికారులు స్పందించడం లేదు. దెబ్బతిన్న రహదారులపై ప్రయాణంతో వాహనదారుల ఒళ్లు హూనమవుతున్నది. వర్షాలు తగ్గాకే రోడ్లు పూర్తి స్థాయిలో రిపేర్లు చేస్తామని చెబుతుండటంతో నగరవాసులకు మరిన్ని రోజులు ఇబ్బందులు తప్పేలా లేవు.

ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లు ఎక్కడెక్కడ దెబ్బతిన్నాయో అధికారులు అధ్యయనం చేశారు. దాదాపు 600 ప్రాంతాల్లో రోడ్లు గుంతలమయంగా మారినట్లు గుర్తించారు. అధికారుల రికార్డుల ప్రకారం గోశామహల్ సర్కిల్లోని గౌలిపుర, బేగంబజార్, శాంతి ఫైర్ వర్క్స్, పూసలబస్తీ, బడా బంగ్లా, అమర్‌నగర్, గుప్పా మందిర్ గేట్, మంగళ్‌హాట్, దత్తాత్రేయనగర్, హరిదర్గా, ఇస్మాయిల్ చౌదరి మసీద్, సర్వర్‌నగర్, నల్ల పోచమ్మ టెంపుల్, అశోక్‌బజార్, రంగమహల్ నుంచి పుత్లీబౌలి జంక్షన్లలో రహదారులు పూర్తిగా ధ్వంసమైనట్లు తేల్చారు. యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
ముషీరాబాద్ సర్కిల్లోని రాంనగర్, ముషీరాబాద్, బాపూజీనగర్, యూసుఫ్‌గూడ సర్కిల్లోని సంస్కార్ స్కూల్, అమీర్‌పేట సర్కిల్లోని హోమియో కేర్ దవాఖాన, రసూల్‌పుర, వడ్డేర బస్తీ, కలాసిగూడ, ఎస్పీ రోడ్డు, హరిహరకళా భవన్, లీలానగర్, ఎస్ఆర్ నగర్, జెన్ టెక్నాలజీస్ సనత్‌నగర్, మలక్‌పేట సర్కిల్లోని చామస్ అక్బర్‌బాగ్, ఏకలవ్య గ్రౌండ్, విరించి అపార్ట్మెంట్స్,అస్మాన్‌ఘడ్, మలక్‌పేట ఆర్వోబీ, సోహిల్ హోటల్, ఆదిబట్ల సర్కిల్లోని తొర్రూర్ రోడ్, కోహెడా, టెలిఫోన్ కాలనీ, తుర్కయాంజల్, మిధానీ కాలనీ, ఏపీఏటీ కాలనీ, నాదర్గుల్, పటేల్‌గూడ, మంగళ్‌పల్లి మజీస్, ముత్యాలమ్మ టెంపు ఆదిబట్ల, పటేల్‌గూడ, జల్పల్లి గేట్, పహాడీషరీఫ్, ఎర్రకుంట క్రాస్‌రోడ్, జాంజాం కాలనీ, కొత్తపేట ప్రభుత్వ దవాఖానా, శంషాబాద్ సర్కిల్ పరిధిలోని శంషాబాద్ రైల్వే గేట్, ఎయిర్‌పోర్టు కాలనీ స్ట్రీట్ నంబరు 1,2,3, మంకాల్, సర్దార్‌నగర్, కంఠ మహేశ్వర టెంపుల్, హర్షగూడ, మధురానగర్, రాళ్లగూడ, ఆదర్శ్‌నగర్, శంకరాపురం,
శివం రోడ్, యాకత్‌పుర సర్కిల్లోని కోట మైసమ్మ టెంపు, గౌలిపుర, అచ్చయ్య నగర్, ఖైరతాబాద్ సర్కిల్ పరిధిలోని కింగ్‌కోఠి, బషీర్‌బాగ్, నాంపల్లి మెట్రో స్టేషన్, ఈడెన్ గార్డెన్ జంక్షన్, గన్‌ఫౌండ్రీ, హైదర్‌గూడ పెట్రోల్ బంక్, అంబర్‌పేట సర్కిల్లోని కాచిగూడ, తిలక్‌నగర్, పటేల్‌నగర్, మాసబ్‌ట్యాంక్ సర్కిల్లోని విజయ్ నగర్ కాలనీ, బోటి గల్లీ, శాంతినగర్ ఐటీ టవర్, మహవీర్ హాస్పిటల్, హోటల్ పీఎన్ఆర్, చాచా నెహ్రూ పార్కు, బండగ్‌పేట సర్కిల్లో జిల్లెలగూడ, టీకేఆర్ కాలేజీ, మంత్రాలయ చెరువు కట్టా, తుర్కయాంజల్, మల్లాపూర్, అత్తాపూర్ సర్కిల్లోని ఎన్ఎంగూడ, ఏబీ బ్యాంకెట్ హాల్, హైదర్‌గూడ, శివ ఆంజనేయ టెంపుల్, రాజేంద్రనగర్, బహదూర్‌పుర, ఫలక్నుమాచ జంగమెట్ సర్కిల్లో రహదారులు పూర్తిగా అధ్వానంగా మారాయి.

జీహెచ్ఎంసీ పరిధిలో 9,013 కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయి. ఇందులో 2,846 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 6,167 కిలోమీటర్ల అంతర్గత రోడ్లు ఉన్నాయి. ఇందులో 70 శాతం రోడ్లపై గుంతలు ఏర్పడ్డాయి. ఇందులో భాగంగానే 2025-26 సంవత్సరంలో రూ.1041.91 కోట్లతో 3806 రహదారుల పనులు చేపట్టగా, ఇందులో రూ. 485 కోట్ల నిధులు ఖర్చు చేసి 1680 చోట్లలో పనులు పూర్తి చేశారు. 2126 చోట్ల పనులు వివిధ దశల్లో ఉన్నట్లు ఇంజినీరింగ్ నిర్వహణ విభాగం అధికారులు తెలిపారు. ఇండియన్ రోడ్ కాంగ్రెస్ ప్రకారం బీటీ రోడ్డు వేస్తే ఆరేళ్ల వరకు, ఆదే విధంగా సీసీ రోడ్డు అయితే 10 ఏళ్లు వరకు ఖరాబ్ కాకుండా ఉండాల్సి ఉంది.
కానీ ఇప్పుడు వేసిన రోడ్లు నెలల వ్యవధిలోనే పూర్తిగా గుంతలు పడుతున్నాయి. జీహెచ్ఎంసీలో అధికారులు, కాంట్రాక్టర్లు అవినీతిని పాల్పడుతుండడంతోనే రోడ్లు త్వరగా డ్యామేజ్ అవుతున్నాయన్న విమర్శలు లేకపోలేదు. కాగా జీహెచ్ఎంసీ, జలమండలి, విద్యుత్, టెలికాం శాఖల మధ్య కనీస సమన్వయం లేకపోవడమే ఈ దుస్థితికి మూలకారణంగా మారింది. ఒక శాఖ రోడ్డు వేస్తే, మరుసటి రోజే మరో శాఖ వచ్చి మళ్లీ తవ్వేస్తున్నారు.. తవ్విన గుంతలను ముగింపు దశకు తెచ్చే బాధ్యతను ఏ ఒక శాఖా తీసుకోవడం లేదు. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపంతో రహదారులు మరణమృదంగాలుగా మారుతున్నాయి.