– నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి
నీలగిరి, అక్టోబర్ 03 : పోషకాహారం తీసుకోవడం ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తొలి అడుగు అని, పోషణ బలపడితేనే బావితరం బలపడుతుందని నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పోషణ మాసంలో భాగంగా శనివారం జిల్లా కేంద్రంలోని టీఎన్జీవోస్ భవన్లో నల్లగొండ ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రాజెక్టు స్థాయి కార్యక్రమానికి మేయర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చిన్నారుల శారీరక, మానసిక ఎదుగుదలకు బాల్యంలోనే సరైన పోషకాహారం అందించడం ఎంతో కీలకమన్నారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. స్థానికంగా లభించే ఆకుకూరలు, పప్పులు, చిరుధాన్యాలు, కూరగాయలు, పండ్లు వంటి పోషక విలువలు కలిగిన ఆహారాన్ని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సేవలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఐసీడీఎస్ పీడీ లావణ్య కుమారి మాట్లాడుతూ.. పోషణ మాసం నిర్వహణ ఉద్దేశం కేవలం కార్యక్రమాలకే పరిమితం కాకుండా ప్రతి కుటుంబంలో పోషకాహారంపై అవగాహన పెంపొందించడమేనన్నారు. ముఖ్యంగా గర్భిణులు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని గుర్తించి సకాలంలో తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. అంగన్వాడీ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పోషకాహారం, ఆరోగ్యం, పరిశుభ్రత, చిన్నారుల ఎదుగుదలపై అవగాహన కల్పించాలని సూచించారు. పోషకాహార లోపం ఉన్న పిల్లలను గుర్తించి వారికి అవసరమైన సూచనలు, సేవలు అందించడంలో అంగన్వాడీ సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని ఆమె తెలిపారు. “ఆరోగ్యవంతమైన బాల్యం.. బలమైన భవిష్యత్” అనే లక్ష్యంతో ప్రతి అంగన్వాడీ కేంద్రం పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అమీర్ అలీ, సీడీపీఓ చంద్రకళ, ప్రముఖ డాక్టర్ సుచరిత, సూపర్వైజర్లు జయమ్మ, మల్లేశ్వరి, వినోద కుమారి, నిహారిక, లక్ష్మమ్మ, సీనియర్ అసిస్టెంట్ షహీన్, అంగన్వాడీ టీచర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

‘పోషణ బలపడితేనే బావితరం బలపడుతుంది’