Chalmeda Narasimha Rao | వేములవాడలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీ నరసింహారావు పార్టీ నాయకులతో కలిసి మాట్లాడారు. సిరిసిల్లలో వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఆది శ్రీనివాస్‌కు వాక్చాతుర్యం, మాట్లాడే ప్రతిభ ఉన్నప్పటికీ, ప్రజా సమస్యల పరిష్కారంలో ఆ స్థాయిలో ఫలితాలు కనిపించడం లేదని చల్మెడ విమర్శించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై సమాధానం చెప్పకుండా ఇతర అంశాలను తెరపైకి తీసుకురావడం ద్వారా ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆరోపించారు.
మిడ్ మానేరు బాధితుల సమస్యలకు సమాధానం చెప్పాలి..
చల్మెడ మిడ్ మానేరు ముంపు గ్రామాల సమస్యలను ప్రస్తావిస్తూ.. గతంలో సంకపల్లి వంటి గ్రామాల్లో అప్పటి పిసిసి అధ్యక్షుడిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పర్యటించిన సందర్భంగా నిర్వాసితులకు రూ.5.04 లక్షల పరిహారం అందిస్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.
మిడ్ మానేరు సమస్యలు 2005–06 కాలం నుంచే కొనసాగుతున్నాయి. 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వాసితులకు సంబంధించిన పలు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకొని ప్రాజెక్టును పూర్తి చేసింది. ఇప్పుడు మిగిలిన సమస్యల పరిష్కారంపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణను ప్రకటించాలి అని చల్మెడ అన్నారు.
ఆనాడు ప్రకటించి చేసిన తప్పును సవరించుకొని ఇవ్వలేమని చెప్పి… మద్య మానేరు ప్రజలను మభ్యపెడుతూ రూ.5.04 లక్షల పరిహారం కోసం 9 సంవత్సరాలు మంత్రి పొన్నం ప్రభాకర్, ఆది శ్రీనివాస్ ఉద్యమాలు నడిపారని గుర్తు చేశారు. సాక్షాత్తు రేవంత్ రెడ్డి పాదయాత్రలో ప్రతి కుటుంబానికి 5 లక్షల 4 వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి ఓట్లు వేయించుకొని గద్దెని ఎక్కాక ఇప్పుడు వారి సమస్యలు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. సంక పల్లిలోని 45 ఇండ్లకు పరిహారం ఎప్పుడు ఇస్తారు, ముంపు గ్రామాల ప్రజలకు 5 లక్షల 4 వేల రూపాయలు ఎప్పుడు ఇస్తారో తేదీ ప్రకటించాలని డిమాండ్ చేశారు..
జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి సభలో ఆది శ్రీనివాస్ గుర్తు చేసిన సీఎం ఎందుకు హామీ ఇవ్వలేదని ప్రశ్నించారు. ఒకవేళ మీతోని సాధ్యం కాకపోతే ముంపు గ్రామాల ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని సవాల్ విసిరారు..
యువత, మహిళలకు ఇచ్చిన ఉపాధి హామీలు ఏమయ్యాయి..? నిరుద్యోగ యువత, మహిళలకు కుటీర పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చినట్లు పేర్కొంటున్న హామీల అమలు పరిస్థితిని ప్రభుత్వం వివరించాలని చల్మెడ కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేటీఆర్ చొరవతో చేపట్టినట్లు పేర్కొంటున్న ఆక్వా హబ్ ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని అన్నారు. “ప్రాజెక్టు ద్వారా ఎంతమందికి ఉపాధి కల్పించారు? ప్రస్తుతం పనులు ఏ దశలో ఉన్నాయి? మిగిలిన పనులను ఎప్పటిలోగా పూర్తి చేస్తారు?” అని ప్రశ్నించారు.
8వేల ఎకరాల ఆరోపణలపై ఆధారాలు చూపాలి..
బీఆర్ఎస్ నేతలు సుమారు 8 వేల ఎకరాల భూములకు సంబంధించిన అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో, వాటికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వం ప్రజల ముందుంచాలని చల్మెడ డిమాండ్ చేశారు. “ఏ గ్రామంలో ఎంత భూమి ఉంది? ఏ సర్వే నంబర్లు? ఎవరికి సంబంధించిన భూములు? ప్రభుత్వం పేర్కొంటున్న 2,400 ఎకరాల రికవరీకి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు ఏమిటి?” అనే వివరాలను ఆర్టీఐ ద్వారా కోరామని తెలిపారు.
ఆరోపణలు నిజమని తేలితే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని, లేకపోతే ప్రభుత్వం ప్రజలకు స్పష్టమైన వివరణ ఇవ్వాలని అన్నారు. సంబంధిత రెవెన్యూ రికార్డులు, విచారణ నివేదికలు, స్వాధీనం ప్రక్రియ వివరాలను బహిర్గతం చేయాలని కోరారు.అప్పటి కలెక్టర్ బదిలీకి సంబంధించిన అధికారిక కారణాలను కూడా ప్రభుత్వం వెల్లడించాలని చల్మెడ డిమాండ్ చేశారు. కలెక్టర్ బదిలీ ఎలా జరిగిందో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు.
ఎమ్మెల్యే ఆస్తులపై ప్రశ్నలు..
కేటీఆర్ వ్యాపారాలు, ఆస్తులకు సంబంధించిన విమర్శలపై స్పందించిన చల్మెడ.. గతంలో కేటీఆర్ తన వ్యాపార కార్యకలాపాల గురించి 2010 పదిలోనే మీ ప్రియమైన ఏబీఎన్ లో బహిరంగంగా మాట్లాడిన విషయాన్ని గుర్తుచేస్తూ అప్పటి వీడియోను చూపారు. అదే సమయంలో ప్రజాప్రతినిధుల ఆస్తుల వివరాలు ఎన్నికల అఫిడవిట్లలో వెల్లడవుతాయని పేర్కొంటూ, ఆది శ్రీనివాస్ తన ఆస్తుల వివరాలు, ఎన్నికల అఫిడవిట్లలో నమోదైన ఆస్తుల్లో వచ్చిన మార్పులపై ప్రజలకు వివరణ ఇవ్వాలని కోరారు.
రాజరాజేశ్వర స్వామి ఆలయ పనులపై తేదీ ప్రకటించాలి. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి, పునర్నిర్మాణ పనులపై కూడా చల్మెడ ప్రశ్నలు సంధించారు.“ఆలయ పనులు ప్రస్తుతం ఏ దశలో ఉన్నాయి? మొదటి దశలో మంజూరైన నిధుల్లో ఎంత ఖర్చు చేశారు? రెండో దశలో కేటాయించిన నిధుల వినియోగం ఎలా ఉంది? భక్తులకు స్వామివారి దర్శనం పూర్తిస్థాయిలో ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుంది?” అనే అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన వివరాలు ఇవ్వాలని కోరారు.
ఆలయ నిర్మాణంలో రాతి శిల్పాలను ఆర్సీసీ నిర్మాణాలకు అనుసంధానం చేసే సాంకేతిక అంశాలపై పూర్తి అవగాహన లేకుండా రాజకీయ విమర్శలు చేయడం సరికాదని అన్నారు. ఆలయ పనుల పూర్తికి ప్రభుత్వం స్పష్టమైన గడువు, భక్తులకు దర్శనాలపై అధికారిక తేదీ ప్రకటించాలని డిమాండ్ చేశారు.
బైపాస్ రహదారిలో వెడల్పు బిఆర్ఎస్ ప్రభుత్వం లోనే అయింది..
వేములవాడ పట్టణానికి అనుసంధానమైన రెండు బైపాస్ రహదారుల వెడల్పుకు బి ప్రభుత్వ హయాంలో వేములవాడ నంది కమాన్ నుండి తిప్పాపూర్ వరకు, అలాగే మొదటి బైపాస్ రహదారి శాత్రాజు పల్లి రోడ్డు వరకు, రెండవ బైపాస్ రహదారి నంది చౌరస్తా వరకు 30 ఫీట్ల నుండి 80 ఫీట్ల వరకు చేసి సుమారు 88 కోట్ల రూపాయలతో వేములవాడ పట్టణానికి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చేసిన ఘనత కెసిఆర్ ప్రభుత్వంకి దక్కిందని గుర్తు చేశారు.
22 ఎకరాలు సేకరించి రింగు బండు పూర్తి చేయాలి..
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మీకు దమ్ముంటే 22 ఎకరాల భూమిని సేకరించి గుడి చెరువు రింగు బండ్ ను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. మల్కపేట రిజర్వాయర్‌ను నింపి చెరువులకు నీరందించాలి. వేసవి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రుద్రంగి, శ్రీపాద ఎల్లంపల్లి, నర్మాల, మిడ్ మానేరు కాలువలతో పాటు సురంపేట ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ భూసేకరణ ప్రక్రియలను త్వరితగతిన పూర్తి చేయాలని చల్మెడ కోరారు.
మిడ్ మానేరు నీటితో మల్కపేట రిజర్వాయర్‌ను నింపి, దాని ద్వారా ఆయా ప్రాంతాల్లోని చెరువులకు నీరు అందించాలని డిమాండ్ చేశారు. దీంతో రైతులకు సాగునీటి సౌకర్యం మెరుగుపడుతుందని అన్నారు. “ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వం స్పష్టమైన లెక్కలు, నిధుల వివరాలు, గడువులు ప్రకటించాలి. రాజకీయ విమర్శలకు బదులుగా ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలి అని చల్మెడ లక్ష్మీ నరసింహారావు అన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.