బూర్గంపహాడ్, ఆగస్టు 13 : వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలు తగిలి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్(ఎఫ్‌బీవో) బానోత్ నవీన్ ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, దీనిని అటవీ శాఖ అత్యంత సీరియస్‌గా తీసుకున్నదని, అడవుల్లో ఇలాంటి అక్రమ చర్యలకు పాల్పడిన వారిని ఉపేక్షించేది లేదని జిల్లా అటవీ శాఖ అధికారి సిద్ధార్థ్ విక్రమ్‌సింగ్ హెచ్చరించారు. చెరువుసింగారం బీట్ పరిధిలోని నకిరిపేట అటవీ ప్రాంతాన్ని అటవీ అధికారులతో కలిసి గురువారం ఆయన పరిశీలించారు.
విద్యుత్ ఉచ్చు ఏర్పాటు చేసిన ప్రాంతం, విద్యుత్ సరఫరా జరిగిన విధానం, విద్యుత్ లైన్ల ఏర్పాటు వంటి అంశాలను పరిశీలించారు. ఇది కేవలం వన్యప్రాణుల వేటకు సంబంధించిన నేరంగా మాత్రమే కాకుండా ప్రాణాంతకమైన అక్రమ విద్యుత్ వినియోగం, అటవీ ప్రాంతాల్లో విద్యుత్ భద్రత, ఫీల్డ్‌స్థాయి పర్యవేక్షణ, అంతర శాఖల సమన్వయానికి సంబంధించిన అంశంగా పరిగణించారు. ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయి సిబ్బందికి ఎప్పుడైనా సమాచారం అందిందా? అటవీ ప్రాంతాల్లో విద్యుత్ లైన్లపై అవసరమైన పర్యవేక్షణ తనిఖీలు జరిగాయా? అనే కోణంలో సమగ్ర దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని డీఎఫ్‌వో స్పష్టం చేశారు. ఉచ్చులు ఏర్పాటు చేసిన వ్యక్తులు ఎవరు? దీనికి విద్యుత్ సరఫరా ఎలా అందింది? లేదా దీని వెనుక ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో వివరాలు సేకరించారు.
నేరానికి పాల్పడిన వ్యక్తులపై వర్తించే అటవీ, వన్యప్రాణి సంరక్షణ, విద్యుత్, ఇతర సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, విధి నిర్వహణకు అటవీ శాఖ సిబ్బంది వెళితే ప్రత్యేక చర్యలతోపాటు అప్రమత్తత పాటించేలా చర్యలు చేపడతామన్నారు. ఆయన వెంట ఎఫ్‌డీవో కృష్ణప్రసాద్, డీఆర్వోలు అనార్కలీ, క్రాంతి, ఎఫ్ఆర్వో సురేశ్, ఎస్సై రామ్మూర్తి, విద్యుత్ శాఖ అధికారులు, ముసలిమడుగు సెక్షన్ బీట్ ఆఫీసర్లు ఉన్నారు.