Luke Williams : ఫ్రాంచైజీ క్రికెట్లో అదరగొడుతున్న ముంబై ఇండియన్స్ (Mumbai Indians)కు కొత్త హెడ్‌కోచ్ వచ్చేశాడు. మహిళల ప్రీమియర్ లీగ్ ఛాంపియన్ ముంబై తదుపరి కోచ్‌గా ల్యూక్ విలియమ్స్ (Luke Williams) నియమితులయ్యాడు. కీట్లే లీసా స్థానంలో ఈ ఆస్ట్రేలియా దిగ్గజం త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నాడు. మహిళల క్రికెట్‌పై లోతైన అవగాహన, సుదీర్ఘ కోచింగ్ అనుభవమున్న విలియమ్స్ తమ జట్టును విజయవంతం చేస్తాడని ముంబై యాజమాన్యం భావిస్తోంది. కొత్త కోచ్‌గా అతడి నియామకాన్ని గురువారం ఎక్స్ వేదికగా ఫ్రాంచైజీ ప్రకటించింది.
మహిళల ప్రీమియర్ లీగ్‌లో రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ ఐదో సీజన్లో కొత్త కోచ్ మార్గనిర్దేశనంలో ఆడనుంది. కీట్లే లీసా స్థానంలో ల్యూక్ విలియమ్స్ ముంబై హెడ్‌కోచ్‌గా నియమితులయ్యాడు. డబ్ల్యూపీఎల్‌లో ఆర్సీబీ తొలిసారి ట్రోఫీని ముద్దాడడంలో కీలకమైన విలియమ్స్ ఇకపై ముంబై విజయాల్లో భాగం కానున్నాడు. మహిళల బిగ్‌బాష్ లీగ్ (WBBL)లోనూ అతడు స్ట్రయికర్స్ జట్టును వరసగా రెండుసార్లు (2022, 2023) ఛాంపియన్‌గా నిలిపాడు.
Bringing experience, ambition & a champion mindset to our MI family 💪💙
Paltan, join us in welcoming our new women’s team Head Coach, Luke Williams! 🤝
Read full story: https://t.co/xUYISgb9Pd pic.twitter.com/02LGt7GZcM
— Mumbai Indians (@mipaltan) September 24, 2026
‘ఇప్పటికే విజేతగా నిరూపించుకున్న వ్యక్తి విలియమ్స్. అతడి సుదీర్ఘ అనుభవం, మహిళల క్రికెట్‌పై అతడికున్న లోతైన అవగాహన, క్రికెటర్లను సానబెట్టడంలో అతడి అంకితభావం అమోఘం. ల్యూక్ నిర్దేశనం, హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో ముంబై జట్టు మరింత వృద్ధి చెందడంతో పాటు విజయవంతం అవుతుందని నాకు నమ్మకం ఉంది. అలానే.. యువక్రికెటర్లు పెద్ద కలలు కనేందుకు ముంబై టీమ్ స్ఫూర్తిగా నిలవనుంది’ అని ఎంఐ యజమానురాలు నీతా అంబానీ పేర్కొంది. మరోవైపు.. ముంబై ఫ్రాంచైజీ తనను ప్రధాన కోచ్‌గా తీసుకోవడం పట్ల విలియమ్స్ సంతోషం వ్యక్తం చేశాడు.
🗣️ A special message from Aapla new women’s team Head Coach Luke Williams! 😍
We can’t wait to see you soon in Mumbai too! 😁 pic.twitter.com/D9PUo19APi
— Mumbai Indians (@mipaltan) September 24, 2026
‘గౌరవప్రదమైన, విజయవంతమైన ముంబై ఇండియన్స్‌లో చేరడానికి నేను చాలా ఆతృతగా ఉన్నా. ప్రతిభావంతులైన క్రికెటర్లు, సహాయక సిబ్బందితో కలిసి పని చేసేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా. సమిష్టిగా నిర్మించడానికి, బ్రాండ్ క్రికెట్ ఆడడానికి, విజయం కోసం పోరాడడానికి మనకు అద్భుత అవకాశాలు ఉన్నాయి’ అని విలియమ్స్ వెల్లడించాడు. ముంబై కోచ్‌గా అతడి ప్రయాణం.. ఐదో సీజన్ రిటెన్షన్ ప్రక్రియతో మొదలవ్వనుంది. ప్లేయర్లను అట్టిపెట్టుకునేందుకు సెప్టెంబర్ 28 ఆఖరి తేదీ కావడంతో ఫ్రాంచైజీ యాజమాన్యం, కెప్టెన్ హర్మన్‌ప్రీత్, ఇతర కోచింగ్ సిబ్బందితో విలియమ్స్ కసరత్తు చేయనున్నాడు.
ఇక డబ్ల్యూపీఎల్ -2022 ఆరంభ సీజన్లో విజేతగా అవతరించిన ముంబై ఇండియన్స్.. వరసగా రెండో ఏడాది టైటిల్‌ను తన్నుకుపోయింది. కానీ, స్మృతి మంధాన సారథ్యంలోని ఆర్సీబీ జోరుతో.. కాస్త వెనకబడిన ముంబై.. మూడు, నాలుగో సీజన్లో నిరాశపరిచిన విషయం తెలిసిందే.